kerala elections
-
ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం.. న్యాయం కోసం సీఎంపై పోటీ
అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ సీఎం పినరయి విజయన్‌పై స్వతంత్ర అభ్యర్థిగా ‘వలయార్ సిస్టర్స్’ తల్లి పోటీ చేస్తున్నారు! నాలుగేళ్ల క్రితం 13, 9 ఏళ్ల వయసున్న ఆమె కూతుళ్లపై అత్యాచారం జరిగింది. రెండు నెలల వ్యవధిలోనే వారిద్దరూ ప్రాణంలేని బొమ్మలై కనిపించారు! నాటి నుంచీ న్యాయం కోసం ఆమె పోరాడుతూనే ఉన్నారు. పోలీసులతో పోరాటం, లాయర్లతో పోరాటం, ప్రభుత్వంతో పోరాటం, చివరికి ఇప్పుడు సీఎంతో పోరాటం! ఈ తల్లికి న్యాయం జరుగుతుందా? అదే పనిలో ఉన్నామని, కేసును సీబీఐకి అప్పగించామని కేరళ ప్రభుత్వం అంటోంది. మొదట ఆమె ఫిబ్రవరి 27న శిరోముండనం చేయించుకున్నారు. తర్వాత మార్చి 16న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ధర్మదం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండూ కూడా తన న్యాయ పోరాటంలో భాగంగా ఆమె తీసుకున్న నిర్ణయాలే. ఆమె ఒక సామాన్య దళిత మహిళ. దళిత మహిళ అనే కన్నా.. బిడ్డల్ని కోల్పోయిన తల్లి అనాలి. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. నాలుగేళ్ల క్రితం ఆ ఇద్దరు మైనరు కూతుళ్లపై అత్యాచారం జరిగింది. తర్వాత వాళ్లిద్దరూ వాళ్లింట్లోనే దూలాలకు ఉరి వేసుకున్నట్లుగా వేలాడుతూ కనిపించారు. పాలక్కాడ్ జిల్లా వాయలూర్‌లో ఉంటుంది ఆ తల్లీకూతుళ్ల కుటుంబం. 2017 జనవరి 13న పెద్ద కూతురు (13), అదే ఏడాది మార్చి 4న చిన్న కూతురు (9) ఆ పెంకుటింటి పైకప్పును అవమానపడిన తమ ముఖాలపై మృత్యువస్త్రంలా కప్పుకున్నట్లుగా కనిపించారు. కానీ అది వాళ్లకై వాళ్లు తీసుకున్న నిర్ణయం, చేసుకున్న పనైతే కాదని తల్లిదండ్రులకు స్పష్టంగా తెలుస్తోంది. విషాద స్మృతులు : కూతుళ్ల చెప్పులు, గజ్జెలు దుఃఖానికి విరామం ఇవ్వకుండా దెబ్బ మీద దెబ్బ. ఆ తల్లి విలవిల్లాడింది. ఇప్పటికీ ఇంటి పైకప్పును చూసుకుంటూ తల్లడిల్లిపోతూనే ఉంది. రెండు బొమ్మలు ఇంటి పైకప్పులో చిక్కుకున్నట్లుగా ఆమె ఇద్దరు కూతుళ్లు అనుదినం కళ్లకు కనిపిస్తూనే ఉన్నారు. వాళ్లపై అత్యాచారం చేసి, ఉరి వేసి వెళ్లినవారికి శిక్ష పడేలా చేసేందుకు నాలుగేళ్లుగా ఆమె నిద్రాహారాలు మాని, అదే జీవితావసరంగా ప్రభుత్వానికి మొర పెట్టుకుంటూనే ఉంది. అనేక విధాలుగా తన నిస్సహాయ నిరసనలను వ్యక్తం చేసింది. ఆక్రోశంతో శిరోముండనం చేయించుకుంది. ఆఖరి అస్త్రంగా ఇప్పుడు అసెంబ్లీఎన్నికల్లో ముఖ్యమంత్రిపై పోటీ చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. అప్పుడైనా ముఖ్యమంత్రికి తనొకరంటూ ఉన్నట్లు తెలుస్తుందని, తను తెలిస్తే తన కూతుళ్లకు జరిగిన అన్యాయం గురించి తెలుస్తుందనీ, దోషుల్ని తప్పించేందుకు పోలీసులు చేసిన అక్రమాల గురించి తెలుస్తుందని ఆమె ఆశ. అంతే తప్ప అధికారం కోసం కాదు. వలయార్ సిస్టర్స్‌కి న్యాయం జరిపించాలని కోరుతూ కొచ్చిలో ప్రదర్శనలు మైనర్లు కనుక ఆమె కూతుళ్ల పేర్లు బయటికి చెప్పడానికి లేదు. బాధితురాలు కనుక ఆమె పేరునూ ప్రస్తావించకూడదు. నిర్భయ తల్లిలా విజయం సాధించిప్పుడు, దోషులకు శిక్షపడి వలయార్ సిస్టర్స్‌కి న్యాయం జరిగినప్పుడు విజయం సాధించిన తల్లిలా ఆమె పేరు ప్రతిధ్వనించవచ్చు. అప్పటి వరకు ఆమె పేరు ‘అమె’. ఆమె కూతుళ్ల పేర్లు ‘వలయార్ సిస్టర్స్’. ‘‘నాలుగేళ్లుగా మొత్తుకుంటున్నాను. ‘దోషులకు శిక్ష పడి తీరుతుంది’ అని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి తన మాటను నిలబెట్టుకోలేదు. ఒక తల్లిగా ఇప్పటి వరకు న్యాయపోరాటం చేశాను. ఇక రాజకీయ పోరాటం చేస్తాను’’ అని ఆమె అంటున్నారు. పోస్ట్‌మార్టంలో ఇద్దరు పిల్లలూ చనిపోవడానికి ముందు వారిపై అత్యాచారం జరిగినట్లు నిర్థారణ అయింది. ‘‘మా బంగారు తల్లులను పాడుచేసి, చంపేశారు. వాళ్లది ఆత్మహత్య కాదు’’ అని ఆమె ఫిర్యాదు చేసినట్లే, శవ పరీక్ష నివేదిక కూడా సరిగ్గా వచ్చింది. ఆ తల్లిదండ్రుల తరఫున కేరళ వ్యాప్తంగా ప్రదర్శనలు జరిగాయి. అప్పటికప్పుడు ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు గత ఏడాది పోలీసు విచారణలో ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకున్నారు. ‘‘కొంతమంది పోలీసులు నేరస్థులతో కుమ్మక్కయి కేసును బలహీనపరిచి ప్రమోషన్లు పొందారు. సీఎం చూస్తూ ఊరుకున్నారు. ఈ సంగతి ప్రజలకు తెలియాలి. ఇద్దరు బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లికి ఈ ముఖ్యమంత్రి న్యాయం చేయలేకపోయారని ప్రజలందరికీ తెలియాలి’’ అని తన అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తూ ఆమె అన్నారు. నేరస్థులలో కొందరికి అధికార పార్టీలోని వారితో సంబంధాలు ఉండటంతో కేసు నీరు కారిపోయిందని ప్రతిపక్షాలు మొదట్నుంచీ ఆరోపిస్తూనే ఉన్నాయి. అందుకే ఆమె.. తన వెనుక ఏ పార్టీవారూ లేరని, తల్లిగా తనకు తాను మాత్రమే ఉన్నానని, అందరు తల్లుల తరఫున ఎన్నికల్లో నిలబడుతున్నానని కూడా ప్రకటించవలసి వచ్చింది. ఎన్నికల్లో తను నిలబడుతున్న కారణాన్ని ఆమె వెల్లడించగానే అధికార పార్టీ తక్షణం స్పందించవలసి వచ్చింది. ‘‘ఆ తల్లి బాధను అర్థం చేసుకోగలం. ఈ కేసులో ఆమెకు న్యాయం జరిగేందుకు ప్రభుత్వం చేయవలసినదంతా చేసింది. ప్రస్తుతం కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది’’ అని న్యాయశాఖ మంత్రి ఎ.కె.బాలన్ వివరణ ఇచ్చారు. కూతుళ్లను కోల్పోయిన తల్లిదండ్రులిద్దరూ భవన నిర్మాణ కార్మికులు. వాళ్లిద్దరూ పనికి వెళ్లినప్పుడు పెద్దకూతురు ఇంట్లో పై కప్పు కొక్కేనికి వేలాడుతూ కనిపించడాన్ని మొదట చూసింది వాళ్ల చిన్న కూతురు. ఇద్దరు మనుషులు ముసుగులు వేసుకుని ఇంట్లోంచి పరుగున వెళ్లడాన్ని కూడా ఆ చిన్నారి చూసింది. తర్వాత చిన్న కూతురు కూడా అదేవిధంగా ప్రాణాలు కోల్పోయింది. కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే దర్యాప్తు బృందానికి సారథ్యం వహించిన పోలీస్ ఆఫీసర్ ప్రత్యేక పదోన్నతిపై బదలీ అయి వెళ్లారు. ఐదుగురు నిందితులలో ఒకరి తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది జిల్లా బాలల సంక్షేమ కమిటీకి అధ్యక్షులు అయ్యారు. ఆ వరుసలోనే 2019 అక్టోబర్‌లో పోక్సో కోర్టు సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో ఐదుగురు నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది. తల్లిదండ్రులు హైకోర్టుకు వెళ్లారు. ఈ జనవరిలో హై కోర్టు.. పోక్సో ఇచ్చిన తీర్పును పక్కనపెట్టి కేసు పునర్విచారణను సీబీఐకి అప్పగించింది. చంపేశారు మొర్రో అంటున్నా వినకుండా ‘అసహజ మరణాలు’ గా పోలీసులు కేసు నమోదు చేసినప్పుడే తమకు న్యాయం జరగదని అర్థమైపోయిందని అంటున్న ఆ తల్లి.. ‘‘ప్రభుత్వం అసహాయుల తరఫున ఉండాలి తప్ప, అధికారం, బలం ఉన్న వారివైపు కాదు’’ అని చేతులు జోడించి చెబుతున్నారు. -
టీవీ చూస్తూ.. సిమ్‌కార్డు మింగేసింది!
టీవీలో ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి.. కేరళలో ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తోంది.. ఆ విషయం గురించి 16 ఏళ్ల అస్వతి అనే అమ్మాయి తన తల్లిదండ్రులతో చర్చిస్తోంది. ఫలితాల గురించిన చర్చ కాస్త వేడెక్కింది.. అంతలో ఆమె తన చేతిలో పట్టుకుని ఉన్న సిమ్‌కార్డును కాస్తా గుటుక్కున మింగేసింది!! దాంతో ఆమె తల్లిదండ్రులు ఆమెకు పళ్లు, పీచు పదార్థాలు పెట్టారు. ఎలాగోలా సిమ్ కార్డు బయటకు వస్తుందన్న ఆలోచనతో అలా చేసినా, ఫలితం కనిపించలేదు. కాసేపటి తర్వాత ఆమెకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ సీటీ స్కాన్ చేశారు. అందులో.. ఆ సిమ్ కార్డు ఆమె ఊపిరి తిత్తుల్లో ఇరుక్కున్నట్లు కనిపించింది. దాంతో వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి సిమ్ కార్డు బయటకు తీశారు. సోమవారం నాడు అస్వతిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. వైద్యులు సీటీ స్కాన్ తీయకపోతే ఆమె ప్రాణాలు కూడా కోల్పోయేది. -
డబ్బులు ఎవరికి ఇచ్చారు.. ఎవరిచ్చారు: సుష్మా
విదేశాల నుంచి కేరళీయులను విడిపించడానికి తాము డబ్బులు చెల్లించామన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ వ్యాఖ్యలను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్రంగా ఖండించారు. ఆయా దేశాల నుంచి తాము వేలాది మంది కేరళీయులను విడిపించి తీసుకొచ్చామని, వాళ్లందరికీ డబ్బులు ఎవరు, ఎవరికి చెల్లించారని ఆమె ప్రశ్నించారు. లిబియా నుంచి 29 మంది భారతీయులను విడిపించడానికి తాము డబ్బులు చెల్లించామంటూ చాందీ చేసిన వ్యాఖ్యలను ఆమె గుర్తుచేశారు. తనకైతే ఎవరూ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని స్పష్టం చేశారు. భారతదేశ పౌరుల పట్ల ఇది తమ ప్రాథమిక బాధ్యత కాబట్టి తాము ఇదంతా చేస్తున్నాము తప్ప.. ఇందులో డబ్బులకు సంబంధించిన ప్రశ్న లేనే లేదని అన్నారు. ఈనెల 16వ తేదీన కేరళలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ రాజకీయాలు వేడెక్కాయి. రాజకీయాలకు సంబంధం లేని అంశాలను కూడా నేతలు వాడుకుంటున్నారు. Mr.Chandy - We evacuated thousands of Indians from Kerala from Iraq, Libya and Yemen. Who paid for them ? — Sushma Swaraj (@SushmaSwaraj) 12 May 2016 Mr.Chandy - You said 'Kerala paid for 29 Indians evacuated from Libya.' — Sushma Swaraj (@SushmaSwaraj) 12 May 2016 Mr.Chandy - You started this debate - as to Who paid ? Not me. We always did this because this is our pious duty towards our citizens. — Sushma Swaraj (@SushmaSwaraj) 12 May 2016 -
ప్రధాని 'సోమాలియా' వ్యాఖ్యలపై భగ్గుమన్న ట్విట్టర్ జనం
'దేవుడి సొంత ప్రదేశం' అని పేరున్న కేరళ రాష్ట్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమాలియాతో పోల్చడంతో ఆయనపై ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో జనం దుమ్మెత్తిపోస్తున్నారు. కేరళలో ఎన్నికల ప్రచారం చేసిన మోదీ.. ప్రజల ఆరోగ్యం, అభివృద్ధిలో కేరళ సోమాలియా కన్నావెనుకబడి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఇటీవల జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యలు, దళిత యువతిపై అత్యాచారం, హత్య లాంటి విషయాల్లో ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన మండిపడ్డారు. అయితే.. మోదీ ఇలా వ్యాఖ్యానించడంపై ట్విట్టర్ జనాలు తీవ్రంగా స్పందించారు. 'పో మోన్ మోదీ' అని హ్యాష్ ట్యాగ్ పెట్టారు. ఇది ఓ మళయాళం సినిమాలోని ఫేమస్ డైలాగ్ 'పో మోనే దినేశా'కు పేరడీ. 'ఇక చాలు, ఇంటికి వెళ్లు' అని దీనికి అర్థం. ఎన్నికల్లో గెలుపు కోసమే ప్రధాని ఇలా వ్యాఖ్యానించారని, రాష్ట్రాన్ని సోమాలియాతో పోల్చడం సిగ్గుచేటని కేరళ సీఎం ఊమెన్ చాందీ అన్నారు. సోమాలియా లాంటి కరువు దేశం లక్షణాలు ఒక రాష్ట్రంలో ఉన్నాయనడం సిగ్గుచేటు కాదా అని ప్రశ్నించారు. మే 16న కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మీద అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రధానంగా సోలార్ కుంభకోణం, ఒక మహిళ సీఎం మీద, ఆయన కుమారుడి మీద చేసిన ఆరోపణల లాంటివి సంచలనం సృష్టించాయి. -
'ఇక్కడే చస్తా.. అస్థికలు కలిసేది గంగలోనే'
తిరువనంతపురం: తన జాతీయతపై మరోసారి చెలరేగుతున్న విమర్శకులకు ధీటుగా బదులిచ్చారు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ. తాను భారతీయురాలినేనని, తన ప్రియమైన వ్యక్తుల నెత్తురు కలిసిపోయిన ఈ గడ్డపైనే మరణిస్తానని, అస్తికలు ఇక్కడి గంగలోనే కలుస్తాయని ఉద్వేగభరితంగా మాట్లాడారు. కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తిరువనంతపురంలో ఏర్పాటుచేసిన సభలో సోనియా మాట్లాడారు. 'అవును. నేను ఇటలీలో పుట్టానని చెప్పుకోవడానికి సిగ్గుపడను. 90 ఏళ్ల నా తల్లి అక్కడే ఉందని చెప్పడానికి సంకోచించను. ఇందిరాగాంధీ కోడలినయిన తర్వాత గడిచిన 48 ఏళ్ల నుంచి నేను ఇక్కడే ఉంటున్నా. ఇదే నా ఇల్లు. ఇదే నాదేశం. నా చావు ఇక్కడే. అస్తికలు కలిసేది ఈ నీటిలోనే' అని సోనియా గాంధీ అన్నారు. ఘనమైన తన జాతీయతను మోదీగానీ, ఆర్ఎస్ఎస్ గానీ అర్థంచేసుకోలేరని, అలా అర్థం చేసుకోవాలని తాను భావించనూలేదని వ్యాఖ్యానించారు. ఇటలీలోని ఒక గౌరవప్రదమైన కుటుంబంలో జన్మించానని, అక్కడ తన తల్లి, ఇద్దరు సోదరీమణులు ఉన్నారన్న సోనియా.. తన దేశం భారత్ లో తనకెంతో ప్రియమైన వ్యక్తుల రక్తం కలిసిపోయిందని, తుది శ్వాస వరకు ఇక్కడే ఉంటానని స్పష్టంచేశారు. వ్యక్తులను దూషించడం, ఎప్పుడూ అబద్ధాలు చెప్పడమే వాళ్ల పని అంటూ ప్రధాని మోదీని విమర్శించారు. శుక్రవారం కేరళలో జరిగిన బీజేపీ సభలో ప్రధాని మోదీ సోనియా జాతీయతపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే. కాగా, తమిళనాడు, కేరళల్లో శుక్ర, శనివారాల్లో పోలింగ్ జరగనుంది. ప్రచారానికి మరో మూడు రోజుల్లో గడువు ముగియనుండటంతో పార్టీలు తమ కీలక నేతలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. -
బెంగాల్లో దోస్తీ, కేరళలో కుస్తీ
కాంగ్రెస్, వామపక్ష పార్టీలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దోస్తీ చేసుకుంటూ.. కేరళలో మాత్రం కుస్తీ పడుతున్నాయని, ఇదేంటని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. కేరళలో ఒక దళిత బాలికపై దారుణంగా అత్యాచారం జరిగి, ఆమె హత్యకు గురైనా కూడా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎందుకు ఈ రాష్ట్రానికి రాలేదని వెంకయ్య ప్రశ్నించారు. ఇదే విషయాన్ని కేరళ ప్రజలే యువరాజును అడుగుతున్నారని ఆయన అన్నారు. కేరళలోని చిలకెర ప్రాంతంలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు రెండుసార్లు వెళ్లారు గానీ కేరళ మాత్రం రాలేదని.. ఎందుకంటే అది కాంగ్రెసేతర ప్రభుత్వం పాలనలో ఉన్న రాష్ట్రం కాబట్టే వెళ్లారని ఆయన అన్నారు. కేరళలో బీజేపీ బలం పుంజుకుంటోందని కాంగ్రెస్, కమ్యూనిస్టులు బాధపడుతున్నారని.. వాళ్లిద్దరూ కలిసి వచ్చి ఓట్లు మార్చుకుంటారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఇక.. ఇద్దరు మిస్టర్ క్లీన్ల హయాంలోనే అత్యంత అన్ క్లీన్, డర్టీ స్కాములు జరిగాయని ఆయన చెప్పారు. వాళ్లలో ఒక మిస్టర్ క్లీన్ మన్మోహన్ సింగ్ కాగా, మరో మిస్టర్ క్లీన్ ఏకే ఆంటోనీ అని చెప్పారు. -
ప్రవాసుల ప్రభావం పెద్దదే!
కేరళ ఎన్నికల్లో ప్రభావం చూపనున్న మాంద్యం ♦ దేశానికి వచ్చే విదేశీ నగదులో 40% కేరళకే ♦ ఈ ఏడాది భారీగా తగ్గిన నగదు ప్రవాహం సాక్షి, సెంట్రల్ డెస్క్: కేరళ అసెంబ్లీకి మే 16న ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ నేతృత్వంలోని అధికార యునెటైడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్), సీపీఎం సారథ్యంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)ల మధ్య పోటీ నెలకొంది. రాష్ట్రంలో ఎన్నికలను బలంగా ప్రభావితం చేసే వర్గాల్లో.. ప్రవాసుల కుటుంబాలు ప్రధానమైనవి. విదేశాల్లో పనిచేస్తున్న కేరళీయుల సంఖ్య 2014 నాటికి 24 లక్షలకు పెరిగింది. విదేశాల నుంచి భారత్‌కు వచ్చే నగదులో 40 శాతం వాటా కేరళదే. రాష్ట్రంలో 2.4 లక్షల కుటుంబాలకు ఈ విదేశీ నగదే ఆధారం. రాష్ట్రంలోని 3.5 కోట్ల జనాభాలో 72 లక్షల మంది తమ వారు విదేశాల నుంచి పంపించే నగదు ఆధారంగా జీవిస్తున్నారని ఒక సర్వేలో తేలింది. అయితే గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (2015-16 అక్టోబర్ - డిసెంబర్)లో రాష్ట్రానికి విదేశీ నగదు ప్రవాహం నాలుగేళ్లలో కనిష్టానికి (రూ. లక్ష కోట్లకు) పడిపోయింది. ప్రపంచ చమురు ధరలు పడిపోవటం, గల్ఫ్ సంస్థల లాభాలు తగ్గిపోవటం వల్ల గల్ఫ్‌లోని భారతీయులు తమ ఇళ్లకు పంపే నగదు తగ్గింది. కేరళలోని ప్రవాసుల కుటుంబాలపై ఇది గణనీయంగా ప్రభావం చూపుతుందని.., రాబోయే ఎన్నికల్లోనూ దీని ప్రభావం ఉంటుందని ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేరళ నుంచి వలస వెళ్లిన వాళ్లలో అత్యధికులు కాంగ్రెస్‌కు అనుకూలమని పరిశీలకులు చెప్తున్నారు. కేరళ నుంచి గల్ఫ్‌కు వెళ్లిన వారిలో అత్యధికులు ముస్లింలే. వీరు భారత్‌లో మైనారిటీలు కావటంతో, కొన్ని ప్రాంతాల్లోనివారి కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు అనుకూలంగా ఉంటాయని, ఆ పార్టీకి లౌకిక ముద్ర ఉండటమే దీనికి కారణమని నిపుణులు చెప్తున్నారు. అయితే.. అవినీతి, కుంభకోణాలు.. అందులో ప్రస్తుత ప్రభుత్వంలోని పలు మంత్రుల పాత్రపై ఆరోపణలు.. వచ్చే ఎన్నికల్లో అత్యంత ముఖ్యమైన అంశం అవుతుందని విశ్లేషిస్తున్నారు. అలాగే.. ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఎల్డీఎఫ్కు మేలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. -
పొరుగు రాష్ట్రంలోనూ పోటీకి సై!
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడులో అధికార పార్టీగా ఉన్న అన్నాడీఎంకే పొరుగు రాష్ట్రం కేరళపై కూడా కన్నేసింది. తమిళనాడుతోపాటు కేరళ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ పార్టీ తరఫున అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్టు పార్టీ అధినేత్రి జయలలిత మంగళవారం ప్రకటించారు. తమిళనాడులోనూ కేరళలోనూ ఒకేసారి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అఖిల భారత అన్నాడీఎంకే పేరిట జాతీయ పార్టీగా నిలువాలని జయలలిత భావిస్తున్నారు. ఇందులో భాగంగా అప్పుడప్పుడు పొరుగు రాష్ట్రాల్లోనూ ఆమె అభ్యర్థులను నిలబెడుతున్నారు. గతంలో నెల్లూరు జిల్లాలో కొన్ని స్థానాలకు అన్నాడీఎంకే అభ్యర్థులను నిలబెట్టింది. నేడు అదే బాటలో కేరళలో పోటీకి దింపుతోంది. పార్టీ తరఫున పోటీ చేసే ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవచ్చని జయలలిత ఓ ప్రకటనలో సూచించారు. దేశంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ ఆశీస్సులు అభ్యర్థులకు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. -
ప్రజలతో.. ఫేస్బుక్లో సీఎం లైవ్ చాటింగ్
కేరళలో త్వరలో ఎన్నికలు జరగనుండటంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ సోషల్ మీడియాను ముమ్మరంగా ఉపయోగించుకుంటున్నారు. ఫేస్బుక్ ఇటీవల ప్రవేశపెట్టిన 'లైవ్ బ్రాడ్కాస్ట్' ఫీచర్‌ను ఉపయోగించుకుని ప్రజల వద్దకు వెళ్తున్నారు. దేశంలోనే ఎన్నికల సమయంలో ఓటర్ల వద్దకు ఇలా ఫేస్బుక్ ద్వారా వెళ్తున్న మొదటి సీఎం బహుశా చాందీయే అని చెబుతున్నారు. సోమవారం రాత్రి 9 గంటల నుంచి దాదాపు అరగంట పాటు వివిధ రంగాలకు చెందినవారితో లైవ్ చాటింగ్ చేశారు. ప్రజలు కూడా చాలా చురుగ్గా ఈ కార్యక్రమంలో పాల్గొని సీఎంకు పలు ప్రశ్నలు సంధించారు. విజిలెన్స్ శాఖను ఆర్టీఐ పరిధి నుంచి ఎందుకు తప్పించారని, భూమి కుంభకోణాల గురించి, కొచ్చి మెట్రోరైలు, కన్నూరు విమానాశ్రయ ప్రాజెక్టుల విషయాల్లో వచ్చిన ఆరోపణలపై ప్రశ్నలు గుప్పించారు. కన్నూరు విమానాశ్రయం ఈ యేడాదే పూర్తవుతుందని, నవంబర్ ఒకటో తేదీన ప్రారంభిస్తామని సీఎం చాందీ సమాధానం చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజలతో చర్చించడానికి ఇది అద్భుతమైన వేదికగా ఉందని ఆ తర్వాత ఆయన అన్నారు. రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించడానికి ప్రజలు మనస్ఫూర్తిగా మద్దతివ్వాలని ఆయన కోరారు. కేరళలో అసెంబ్లీ ఎన్నికలు మే 16వ తేదీన జరగనున్నాయి.