ప్రవాసుల ప్రభావం పెద్దదే!
కేరళ ఎన్నికల్లో ప్రభావం చూపనున్న మాంద్యం
♦ దేశానికి వచ్చే విదేశీ నగదులో 40% కేరళకే
♦ ఈ ఏడాది భారీగా తగ్గిన నగదు ప్రవాహం
సాక్షి, సెంట్రల్ డెస్క్: కేరళ అసెంబ్లీకి మే 16న ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ నేతృత్వంలోని అధికార యునెటైడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్), సీపీఎం సారథ్యంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్)ల మధ్య పోటీ నెలకొంది. రాష్ట్రంలో ఎన్నికలను బలంగా ప్రభావితం చేసే వర్గాల్లో.. ప్రవాసుల కుటుంబాలు ప్రధానమైనవి. విదేశాల్లో పనిచేస్తున్న కేరళీయుల సంఖ్య 2014 నాటికి 24 లక్షలకు పెరిగింది. విదేశాల నుంచి భారత్‌కు వచ్చే నగదులో 40 శాతం వాటా కేరళదే. రాష్ట్రంలో 2.4 లక్షల కుటుంబాలకు ఈ విదేశీ నగదే ఆధారం. రాష్ట్రంలోని 3.5 కోట్ల జనాభాలో 72 లక్షల మంది తమ వారు విదేశాల నుంచి పంపించే నగదు ఆధారంగా జీవిస్తున్నారని ఒక సర్వేలో తేలింది.
అయితే గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (2015-16 అక్టోబర్ - డిసెంబర్)లో రాష్ట్రానికి విదేశీ నగదు ప్రవాహం నాలుగేళ్లలో కనిష్టానికి (రూ. లక్ష కోట్లకు) పడిపోయింది. ప్రపంచ చమురు ధరలు పడిపోవటం, గల్ఫ్ సంస్థల లాభాలు తగ్గిపోవటం వల్ల గల్ఫ్‌లోని భారతీయులు తమ ఇళ్లకు పంపే నగదు తగ్గింది. కేరళలోని ప్రవాసుల కుటుంబాలపై ఇది గణనీయంగా ప్రభావం చూపుతుందని.., రాబోయే ఎన్నికల్లోనూ దీని ప్రభావం ఉంటుందని ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేరళ నుంచి వలస వెళ్లిన వాళ్లలో అత్యధికులు కాంగ్రెస్‌కు అనుకూలమని పరిశీలకులు చెప్తున్నారు.
కేరళ నుంచి గల్ఫ్‌కు వెళ్లిన వారిలో అత్యధికులు ముస్లింలే. వీరు భారత్‌లో మైనారిటీలు కావటంతో, కొన్ని ప్రాంతాల్లోనివారి కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు అనుకూలంగా ఉంటాయని, ఆ పార్టీకి లౌకిక ముద్ర ఉండటమే దీనికి కారణమని నిపుణులు చెప్తున్నారు. అయితే.. అవినీతి, కుంభకోణాలు.. అందులో ప్రస్తుత ప్రభుత్వంలోని పలు మంత్రుల పాత్రపై ఆరోపణలు.. వచ్చే ఎన్నికల్లో అత్యంత ముఖ్యమైన అంశం అవుతుందని విశ్లేషిస్తున్నారు. అలాగే.. ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఎల్‌డీఎఫ్‌కు మేలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.