బెంగాల్లో దోస్తీ, కేరళలో కుస్తీ
కాంగ్రెస్, వామపక్ష పార్టీలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దోస్తీ చేసుకుంటూ.. కేరళలో మాత్రం కుస్తీ పడుతున్నాయని, ఇదేంటని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. కేరళలో ఒక దళిత బాలికపై దారుణంగా అత్యాచారం జరిగి, ఆమె హత్యకు గురైనా కూడా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎందుకు ఈ రాష్ట్రానికి రాలేదని వెంకయ్య ప్రశ్నించారు. ఇదే విషయాన్ని కేరళ ప్రజలే యువరాజును అడుగుతున్నారని ఆయన అన్నారు. కేరళలోని చిలకెర ప్రాంతంలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు రెండుసార్లు వెళ్లారు గానీ కేరళ మాత్రం రాలేదని.. ఎందుకంటే అది కాంగ్రెసేతర ప్రభుత్వం పాలనలో ఉన్న రాష్ట్రం కాబట్టే వెళ్లారని ఆయన అన్నారు. కేరళలో బీజేపీ బలం పుంజుకుంటోందని కాంగ్రెస్, కమ్యూనిస్టులు బాధపడుతున్నారని.. వాళ్లిద్దరూ కలిసి వచ్చి ఓట్లు మార్చుకుంటారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఇక.. ఇద్దరు మిస్టర్ క్లీన్‌ల హయాంలోనే అత్యంత అన్ క్లీన్, డర్టీ స్కాములు జరిగాయని ఆయన చెప్పారు. వాళ్లలో ఒక మిస్టర్ క్లీన్ మన్మోహన్ సింగ్ కాగా, మరో మిస్టర్ క్లీన్ ఏకే ఆంటోనీ అని చెప్పారు.