తమిళనాడు సేలం సమీపంలో బస్సులో విద్యార్థిని అత్యాచారానికి గురైన ఘటనలో మరో బస్ కండక్టర్ విజయన్ (22)ను పోలీసులు అరెస్టు చేశారు.
నిందితులు సెంట్రల్ జైలుకు తరలింపు
చెన్నై: తమిళనాడు సేలం సమీపంలో బస్సులో విద్యార్థిని అత్యాచారానికి గురైన ఘటనలో మరో బస్ కండక్టర్ విజయన్ (22)ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు నలుగురినీ పోలీసులు బుధవారం సేలం మహిళా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం సెంట్రల్ జైలుకి తరలించారు. వీరానం ప్రాంతానికి చెందిన విజయన్ పాత బస్టాండు నుంచి జంక్షన్ వరకు వెళ్లే బస్సులో కండక్టర్‌గా ఉన్నాడు. ఇతనికి బాలికతో పరిచయం ఉన్నట్లు సమాచారం. ముఖ్య నిందితుడిగా ఉన్న పెరుమాళ్‌కు బాలికను విజయనే పరిచయం చేసినట్లు పోలీసులు తెలిపారు. సేలం పేర్లాండ్స్ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల విద్యార్థినిపై సోమవారం రాత్రి 10 గంటల సమయంలో బస్సు డ్రైవర్ మణిమన్నన్ (33), రెండో డ్రైవర్ అధికారిపట్టి మురుగన్ (35), కండక్టర్ పెరుమాళ్ (22)లు బస్సులో అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో విద్యార్థిని కేకలతో స్థానికులు ముగ్గురికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. విద్యార్థినిని పోలీసులు సేలం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి, వైద్య పరీక్షలు నిర్వహించారు.