పాక్ కవ్వింపులకు జవాబిచ్చే సత్తా ఉంది
సాయుధ దళాలపై రక్షణ మంత్రి భరోసా
జమ్మూకాశ్మీర్‌లో పర్యటించిన జైట్లీ
శ్రీనగర్: అధీన రేఖపై పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలకు సమాధానమిచ్చే సత్తా భారత సైనిక దళాలకు ఉందని రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. రక్షణ మంత్రిగా తొలిసారి ఆయన శనివారం జమ్మూకాశ్మీర్‌లో పర్యటించారు. ఆయనతో పాటు సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ బిక్రమ్ సింగ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఎల్‌ఓసీపై రక్షణ చర్యలు, రాష్ట్ర శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, సీనియర్ సైన్యాధికారులతో జైట్లీ వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఎల్‌ఓసీపై ఇటీవల పాక్ జరిపిన కాల్పుల వివరాల్ని రక్షణ మంత్రికి ఆర్మీ అధికారులు వివరించారు.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ శుక్రవారం భారత సైనిక కేంద్రాలపై కాల్పులు జరపడం తెలిసిందే. ముందుగా ‘చీనార్ కార్ప్స్’ ప్రధాన కార్యాలయాన్ని రక్షణ మంత్రి సందర్శించారు. కాశ్మీర్ లోయలో శాంతిభద్రతల పరిస్థితిని, ఎల్‌ఓసీపై ఏర్పాటు చేసిన తీవ్రవాద చొరబాట్లను అడ్డుకునే ప్రత్యేక వ్యవస్థ వివరాలను, రాష్ట్రంలో చేపట్టిన తీవ్రవాద వ్యతిరేక కార్యక్రమాల వివరాలను జైట్లీకి అక్కడి ఉన్నతాధికారులు వివరించారు. అనంతరం శ్రీనగర్‌లో జైట్లీని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కలిశారు. భేటీ అనంతరం ‘అరుణ్ జైట్లీతో సమావేశం సంతృప్తికరంగా సాగింది.