మాజీ మంత్రి ఇంటిపై ఏసీబీ దాడులు
ముంబై: ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్, ముంబైలో మరో రెండు ప్రభుత్వ భవనాల నిర్మాణాల్లో అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేస్తోన్న మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మంగళవారం మరో అడుగు ముందుకేసింది. కేసుకు సంబంధించిన కీలక ఆధారాల సేకరణ నిమిత్తం ఆ రాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ సీనియర్ నాయకుడు ఛగన్ భుజ్‌బల్ నివాసంపై దాడులు నిర్వహించింది. ఈ కేసులో ఇప్పటికే ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో పొందుపర్చిన సంగతి తెలిసిందే.
మూడు బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు.. బంద్రాలోని భుజ్ బల్ కార్యాలయం, మజ్ గావ్ లోని నివాసంపై ఏకసమయంలో దాడులు జరిపారని, లభించిన ఆధారాలు, సంబంధిత విషయాలను సాయంత్రానికి వెల్లడిస్తామని మహారాష్ట్ర ఏసీబీ డీజీ ప్రవీణ్ దీక్షిత్ చెప్పారు. మంత్రులు, లేదా మాజీ మంత్రుల ఇళ్లపై ఏసీబీ ఇలాంటి దాడులు నిర్వహించడం మహారాష్ట్రలో ఇదే ప్రధమం.
కాగా, భుజ్ బల్ పీడబ్ల్యూడీ మంత్రిగా పనిచేసిన కాలంలో ఆ శాఖలో విధులు నిర్వహించిన పలువురు అధికారుల ఇళ్లలో ఆదివారం ఏసీబీ సోదాలు నిర్వహించింది. మంత్రిగా ఉన్న ఛగన్ భుజ్‌బల్ ఆశ్రీత పక్షపాతం, అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై బహిరంగ విచారణకు అనుమతినివ్వాలన్న ఏసీబీ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబర్‌లో పచ్చ జెండా ఊపింది.