న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో ప్రజలు తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తూ ఆ వేదికలను దుర్వినియోగపరుస్తున్నారంటూ సుప్రీంకోర్టు విచారం వ్యక్తం చేసింది. కొందరు వ్యక్తులు ఇతరులను కించపరిచేలా వ్యాఖ్యానాలు చేస్తున్నారనీ, ఇలాంటి వాటిపై నియంత్రణ అవసరమంది. కోర్టు కార్యకలాపాలు, న్యాయమూర్తులు, తీర్పులను కూడా ఒక్కోసారి సామాజిక మాధ్యమాల్లో తప్పుగా ప్రచారం చేస్తున్నారని ధర్మాసనం గురువారం ఆందోళన వ్యక్తం చేసింది.
గతేడాది జూలైలో ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ వద్ద దారి దోపిడీ దొంగలు కారులో వెళ్తున్న ఓ కుటుంబంపై దాడి చేసి, తల్లీ కూతుళ్లపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన కేసును విచారిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ పై వ్యాఖ్యలు చేసింది. సామాజిక మాధ్యమాలు దుర్వినియోగం అవుతుండటంపై ధర్మాసనం అభిప్రాయంతో సీనియర్ న్యాయవాదులు ఫాలీ నారీమన్, హరీశ్ సాల్వే కూడా ఏకీభవించారు. పదవు ల్లో ఉన్నవారు ఏం మాట్లాడినా అది ప్రభుత్వ విధానాలను ప్రతిబింబిస్తుందనీ, కాబట్టి సున్నితమైన, విచారణలో ఉన్న అంశాలపై ప్రజాప్రతినిధులు సొంత అభిప్రాయాలను వెల్లడించలేరని హరీశ్ సాల్వే వాదించారు.
ప్రభుత్వాన్నీ వదలట్లేదు
పలువురు జడ్జీలు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే ఆరోపణలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అవసరమైనప్పుడు ప్రభుత్వానికీ చివాట్లు పెడుతూనే ఉన్నామంది. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో దవే అలా పేర్కొనడం తమను బాధించిందని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. జడ్జీలు, న్యాయ వ్యవస్థపై కొందరు బాధ్యతారాహిత్యంగా సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్యంగా వ్యాఖ్యానించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ‘సుప్రీంకోర్టులో ప్రభుత్వ అనుకూల జడ్జీలేఎక్కువ ఉన్నారని బార్ సభ్యుడొకరు అన్నారు. పౌర హక్కుల పరిరక్షణకు సంబంధించి ప్రభుత్వా న్ని కూడా ఎలా ఇరకాటంలో పెడుతున్నామో వారు కోర్టుకొచ్చి చూడాలి’ అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment