హవల్దార్ సునీల్‌కుమార్‌కు పట్నాలో నివాళులర్పిస్తున్న దృశ్యం
న్యూఢిల్లీ: చైనా సైనికులతో ఘర్షణలో అమరులైన 20 మంది భారత సైనికులను స్మరిస్తూ బుధవారం లద్దాఖ్ రాజధాని లేహ్‌లో నివాళి కార్యక్రమం జరిగింది. జూన్ 15న సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న లోయలో చైనా భారత్ సైనికులు ముఖాముఖి తలపడటం తెల్సిందే. అమరులైన వారిలో తెలుగుతేజం కల్నల్ సంతోష్‌బాబు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందిస్తూ.. ఈ వీర జవాన్ల త్యాగాలు వృథాకావని వ్యాఖ్యానిం చారు. దేశ ఐక్యత, సార్వభౌమత్యం తమకు ప్రాధాన్యమని తేల్చి చెప్పారు. భారత్ శాంతిని కోరుకుంటోందని, అదే సమయంలో తగిన జవాబు కూడా ఇవ్వగలదని చెప్పారు. మరోవైపు ఈ దాడిలో పాల్గొన్న నలుగురు సైనికుల పరిస్థితి విషమంగా ఉందని ఆర్మీ అధికారిక వర్గాలు తెలిపాయి. చైనా వైపు కూడా దాదాపు 45 మంది సైనికులు మరణించి ఉండవచ్చని అధికారులు తెలిపారు. ఈ దాడి ఆయుధాలతోగాక పిడిగుద్దులు, రాళ్లు విసురుకోవడంతో జరిగిందని అన్నారు. అయితే చైనా సైనికులు మాత్రం రాడ్లు, మేకులు కలిగిన ఆయుధాలు ఉపయోగించినట్లు తెలుస్తోంది. వాస్తవాధీన రేఖకు లోపలే భారత్ తమ కార్యకలాపాలను సాగిస్తోందని, చైనా నుంచి దీన్నే ఆశిస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాక్ శ్రీవాస్తవ చెప్పారు.
అమరులైన భారత సైనికులు
భికుమల్ల సంతోష్ బాబు(సూర్యాపేట), నుదరమ్ సోరెన్(మయూర్భంజ్), మన్దీప్ సింగ్ (పటియాలా), సత్నామ్ సింగ్(గుర్దాస్పూర్), కె. పలాని(మధురై), సునిల్ కుమార్(పట్నా), బిపుల్ రాయ్(మీరట్ సిటీ), దీపక్ కుమార్(రెవా), రాజేష్ ఒరాంగ్(బిర్గుమ్), కుందన్ కుమార్ ఓజా(సహిబ్గంజ్),గణేష్ రామ్(కాంకెర్), చంద్రకాంత ప్రధాన్(కందమాల్), అంకుష్(హమిర్పుర్), గుర్బిందర్(సంగ్రుర్), గుర్తెజ్ సింగ్(మన్సా), చందన్ కుమార్(భోజ్‌పూర్), కుందన్ కుమార్(సహర్సా), అమన్ కుమార్(సమస్తిపూర్), జై కిషోర్ సింగ్ (వైశాలి), గణేశ్ హన్సా్ద(ఈస్ట్ సింగ్బుమ్)
Comments
Please login to add a commentAdd a comment