అండర్ వేర్ తో పరీక్షపై హైకోర్టు విచారణ
పట్నా: ఆర్మీలో క్లర్క్ ఉద్యోగాల కోసం రాతపరీక్షకు హాజరై అభ్యర్థులకు బిహార్‌లో షాక్ తగిలింది. చొక్కా, ప్యాంటు, బనీనుతో సహా విప్పేయించి.. కేవలం లోదుస్తుల్లో వారితో రాతపరీక్ష రాయించిన తీరుపై ఇప్పుడు ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కేవలం చూచిరాత, మాస్ కాపీయింగ్‌ను తప్పించడానికి బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఇలా అభ్యర్థులతో అండర్‌వేర్లలో ఆరుబయట పచ్చిక బయళ్లపై పరీక్ష రాయించడం పెద్ద దుమారమే రేపుతోంది.
బిహార్‌లో చూచిరాత, మాస్ కాపీయింగ్ సమస్య తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో ఎలాంటి అక్రమాలు జరుగకూడదనే ఉద్దేశంతో ఈ విధంగా పరీక్ష నిర్వహించామని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు పట్నా హైకోర్టు దృష్టికి వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, కథనాలు పరిగణనలోకి తీసుకొన్న హైకోర్టు ప్రజాప్రయోజనాల దృష్ట్యా సమోటోగా విచారణ చేపట్టాలని నిర్ణయించింది. అభ్యర్థులతో అమానుష పద్ధతిలో పరీక్ష రాయించిన తీరుపై పట్నా హైకోర్టు బుధవారం విచారణ జరుపనుంది.