
'ఆరు నెలల్లోనే మొత్తం స్మాష్ చేసేస్తాం'
ఆరు నెలలు గడువిస్తే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలన్నింటిని ధ్వంసం చేస్తామని, కూకటి వేళ్లతో పెకలిస్తామని భారత ఆర్మీ చెప్పింది.
న్యూఢిల్లీ: ఆరు నెలలు గడువిస్తే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలన్నింటిని ధ్వంసం చేస్తామని, కూకటి వేళ్లతో పెకలిస్తామని భారత ఆర్మీ చెప్పింది. సర్జికల్ దాడులతో అనూహ్యంగా ఏడు ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన ఆర్మీ మొత్తం పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రమూకల స్థావరాలను ధ్వంసం చేయాలని అనుకుంటోంది. ఎందుకంటే, ఉగ్రవాదులంతా ఈ ప్రాంతంలోనే తలదాచుకోవడమే కాకుండా ఇక్కడి పాక్ సైనికుల సహాయంతో ప్రతిసారి వారు సరిహద్దు భూభాగంలోకి చొచ్చుకొచ్చి భారత సైనికులపై దాడులు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో టాప్ మిలటరీ అధికారులు ఒకరు కొంతమంది కేంద్ర రాజకీయ పెద్దలతో అనధికారికంగా మాట్లాడుతూ అవకాశం ఇస్తే ఆరు నెలల్లోనే పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాదుల స్థావరాలను చిత్తు చేస్తామని, వారికి పునరావాసం లేకుండా దెబ్బకొడతామని చెప్పారు. మొన్న నిర్వహించిన సర్జికల్ దాడిలాంటి వాటిని మరిన్ని నిర్వహించడం ద్వారా ఉగ్రవాదుల తమవైపే రాకుండా చేయొచ్చని తెలిపారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో దాదాపు 50 ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని, వాటిల్లో ఎప్పుడూ ఓ 200మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉంటారని, వీరికి పాక్ ఆర్మీ అండగా నిలుస్తుందని సైనికులు సదరు రాజకీయ పెద్దలతో వివరించారట.