నీరవ్ మోదీ
న్యూఢిల్లీ: రూ.13వేల కోట్ల మేర పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో ఆభరణాల వ్యాపారి నీరవ్ మోదీకి బ్రిటన్ న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో అతడిని స్వదేశానికి పంపించాలన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వినతి మేరకు అక్కడి న్యాయస్థానం స్పందించిందని అధికార వర్గాలు తెలిపాయి. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు మోదీపై ఇటీవలే వారెంట్ జారీ చేసినట్లు అక్కడి దర్యాప్తు విభాగం తమకు సమాచారం అందించిందని అధికారులు తెలిపారు.
లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు మోదీని త్వరలోనే అధికారికంగా అరెస్టు చేసే అవకాశాలున్నాయన్నారు. అనంతరం వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరుస్తారు. ఆపైన అతడిని భారత్‌కు అప్పగించే న్యాయ ప్రక్రియ మొదలవుతుందని వివరించారు. అయితే, అతడిని అరెస్టు చేసి, అభియోగాలు మోపే వరకు ఈ పరిణామాలపై స్పందించలేమని లండన్ కోర్టు, స్కాట్లాండ్ యార్డు పోలీసు అధికారులు స్పష్టం చేశారు. మోదీని అప్పగించాలంటూ ఈ నెల ప్రారంభంలో ఈడీ బ్రిటన్ హోం మంత్రిని కోరింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో మోదీ, అతని మామ మెహుల్ చోక్సీపై ఈడీతోపాటు సీబీఐ కూడా మనీలాండరింగ్, తదితర నేరాల కింద కేసులు నమోదు చేశాయి.
ఈ నేరాల కింద మోదీ, అతని కుటుంబానికి చెందిన సుమారు రూ. 2,300 కోట్ల ఖరీదైన ఆస్తులను ఇప్పటికే ఈడీ అటాచ్ చేసింది. పారిపోయిన మోదీ లండన్‌లోని ఖరీదైన ప్రాంతంలో నివసిస్తున్నట్లు ఇటీవల అక్కడి మీడియా వెల్లడించిన విషయం తెలిసిందే. రూ. 9 వేల కోట్ల మేరకు మోసం చేసి బ్రిటన్‌లో ఆశ్రయం పొందుతున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను స్వదేశానికి రప్పించే ప్రక్రియ కూడా చివరి దశలో ఉందని అధికార వర్గాలు తెలిపాయి. మోడీ విషయంలో అనుసరించిన ప్రక్రియనే మాల్యాకు వర్తింపజేస్తామని పేర్కొన్నాయి. ఈడీ వినతి మేరకు లండన్ కోర్టు విజయ్ మాల్యాపై 2017 వారెంట్ జారీ చేయగా ప్రస్తుత ఆయన బెయిల్‌పై ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment