షాహిద్ ఆఫ్రిది, హీనాతో ఆ ఉగ్రవాది సోదరుడు..
న్యూఢిల్లీ: పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ భారత్‌లో చేపట్టిన భారీ రాకెట్‌కు సంబంధించి మరిన్ని వాస్తవాలు వెలుగుచూశాయి. ఈ రాకెట్‌లో భాగంగా ఢిల్లీలో రెక్కీ నిర్వహించేందుకు వచ్చి అరెస్టయిన ఉగ్రవాది మహమ్మద్ ఎజాజ్ సోదరుడి ఫొటోలు తాజాగా వెలుగుచూశాయి. పాకిస్థాన్ జాతీయుడైన ఎజాజ్ సోదరుడు ఫవాద్ ఆ దేశానికి చెందిన ప్రముఖులతో దిగిన ఫొటోలు పోలీసులకు చిక్కాయి. ఫవాద్ పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది, ఆ దేశ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్‌తో సన్నిహితంగా మెలుగుతూ దిగిన ఫొటోలు వెలుగుచూశాయి.
ఈ ఫొటోలు నిజమైనవా? కాదా? అన్నది ప్రస్తుతం పోలీసులు పరిశీలిస్తున్నారు. ఉగ్రవాది మహమ్మద్ ఎజాజ్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ధ్రువపత్రాలతో బంగ్లాదేశ్ మీదుగా భారత్‌కు వచ్చిన ఎజాజ్ ఈ ఏడాది మార్చ్, జూలై నెలల్లో రెండుసార్లు ఢిల్లీని సందర్శించాడు. ఈ సందర్భంగా పార్లమెంటు, రాజ్‌పథ్ ఎదురుగ్గా దిగిన ఫొటోలు పాకిస్థాన్‌కు మెయిల్ చేశాడు. ఢిల్లీలో రెక్కీ నిర్వహించేందుకు తనను ఐఎస్ఐ ఇక్కడికి పంపిందని అతడు పోలీసుల దర్యాప్తులో వెల్లడించాడు.