తెలంగాణకు ప్రాధాన్యమివ్వండి | Arun Jaitley, appealed to the Chief KCR | Sakshi
Sakshi News home page

తెలంగాణకు ప్రాధాన్యమివ్వండి

Published Sun, Feb 8 2015 1:39 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

తెలంగాణకు ప్రాధాన్యమివ్వండి - Sakshi

తెలంగాణకు ప్రాధాన్యమివ్వండి

  • కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి
  • సాక్షి, న్యూఢిల్లీ: ఈ సారి బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక  శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. 13వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులను, సీఎస్‌టీ బకాయిలను వీలైనంత త్వరగా విడుదల చేయాలని కోరారు. ఐదు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చిన కేసీఆర్ శనివారం ఉదయం అరుణ్ జైట్లీని ఆయన నివాసంలో కలిశారు.

    ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను జైట్లీకి వివరించడంతోపాటు... రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన ఆర్థిక సాయం తదితర అంశాలపై చర్చించారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లతోపాటు మహబూబ్‌నగర్ జిల్లాలో మూడు ప్రాంతాల్లో టెక్స్‌టైల్ క్లస్టర్ల ఏర్పాటుకు కేంద్రం ఇప్పటికే అనుమతులు ఇచ్చినందున ఇందుకు కావాల్సిన నిధులు ఈ బడ్జెట్‌లో కేటాయించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

    తెలంగాణకు రావాల్సిన సీఎస్‌టీ (సెంట్రల్ సేల్స్‌ట్యాక్స్) బకాయిలను వీలైనంత త్వరగా విడుదల చేయాలని కేసీఆర్ కోరగా... మూడు వాయిదాల్లో సీఎస్‌టీ బకాయిలను చెల్లిస్తామని జైట్లీ తెలిపారు. 13వ ఆర్థిక సంఘానికి సంబంధించి తెలంగాణకు ఈ ఏడాది రావాల్సిన రూ. 2,300 కోట్ల బకాయిల అంశాన్ని కూడా కేసీఆర్ ప్రస్తావించగా... మార్చిలోగా నిధులను విడుదల చేస్తామని జైట్లీ హామీ ఇచ్చారు. హెచ్‌ఎండీఏ, హౌజింగ్ బోర్డు వంటి సంస్థలపై ఆదాయ పన్ను బకాయిలు మాఫీ చేయాలని సీఎం కోరారు.

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేలా ఫెడరల్ స్ఫూర్తితో ఈ సారి బడ్జెట్ ఉంటుందని అరుణ్ జైట్లీ కేసీఆర్‌కు చెప్పారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు ఇది మంచి అవకాశమని ఆయన అభిప్రాయపడ్డారు. జైట్లీతో భేటీ సందర్భంగా కేసీఆర్‌తోపాటు టీఆర్‌ఎస్ ఎంపీలు కె.కేశవరావు, వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు డా.వేణుగోపాలాచారి, రామచంద్రు తేజావత్, రాష్ట్ర సీఎస్ రాజీవ్‌శర్మ తదితరులు ఉన్నారు.
     
    చర్చకు వచ్చిన జీఎస్‌టీ అంశం

    కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తేవాలని యోచిస్తున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్‌టీ)తో లాభనష్టాలపై అరుణ్ జైట్లీ, కేసీఆర్ చర్చించుకున్నారు. జీఎస్‌టీ బిల్లును వర్షాకాల సమావేశాల్లో ఆమోదించనున్నట్టు జైట్లీ వివరించారు. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత ‘ఉత్పత్తి చేసే రాష్ట్రాల’కు కొంత ఇబ్బంది ఉంటుందని చెప్పారు. అయితే.. ‘తెలంగాణ ఉత్పత్తి రాష్ట్రాల్లోకి వస్తుందా, సర్వీసెస్ ఉన్న రాష్ట్రాల జాబితాలోకి వస్తుందా?’ అని జైట్లీ కేసీఆర్‌ను ఆరా తీశారు. తెలంగాణ ఉత్పత్తి, సేవా రంగాల కలగలుపుగా ఉందని కేసీఆర్ సమాధానమిచ్చారు.

    జీఎస్‌టీ అమలుతో మొదటి ఏడాదిలోనే తెలంగాణ రాష్ట్రం లబ్ధి పొందే అవకాశముందని ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. విభిన్న సంస్కృతులను కలిగిన హైదరాబాద్ నగరానికి అన్ని రంగాల్లో ఆర్థికంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని, గొప్ప నగరంగా తీర్చిదిద్దుకోవడంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని జైట్లీ హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం ఈ వివరాలను టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్‌కుమార్, ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు తేజావత్ మీడియాకు తెలిపారు.

    అయితే విభజన చట్టంలో పొందుపర్చిన ప్రకారం పన్ను ప్రోత్సాహకాలు, ఇతర అంశాలపై ప్రస్తుతం చర్చించలేదని ఎంపీ వినోద్‌కుమార్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేంద్ర బడ్జెట్ వచ్చిన తర్వాత అన్ని అంశాలపై స్పష్టత వస్తుందని, ఆ తర్వాతే దానిపై స్పందిస్తామని పేర్కొన్నారు. కాగా... నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ తరఫున ప్రధాని మోదీ దృష్టికి తీసుకురావాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్, పార్టీ ఎంపీలు, రాష్ట్ర ఉన్నతాధికారులతో శనివారం సమీక్షించారు.

    కొత్తగా ఏర్పాటైన రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించారు.  ప్రజారోగ్యం, వ్యవసాయం, వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ వంటి పథకాలను నీతిఆయోగ్ సమావేశంలో కేసీఆర్ వివరించనున్నారు. దీంతోపాటు కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర అవసరాలకు తగినట్టుగా వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని కోరనున్నారు.
     
    ‘నీతి ఆయోగ్’కు ఇద్దరు సీఎంలు

    ఆదివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు,  ఏపీ సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. తమ రాష్ట్రాల్లో అమలవుతున్న ప్రాధాన్యత గల పథకాలకు ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరనున్నారు. అలాగే 2015-16 బడ్జెట్‌తో పాటు, ప్రాధాన్యత గల పథకాల అమలుకు సలహాలు, సూచనలను అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి ప్రధాని మోదీ స్వీకరించనున్నారు.
     
    హిందుస్తాన్ కేబుల్స్లిమిటెడ్‌ను కాపాడండి

     
    హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్‌ను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులో చేర్చేలా చొరవ తీసుకోవాలని కేసీఆర్‌ను హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు కోరారు. ఈ మేరకు  సంఘం నేతలు ఢిల్లీలో కేసీఆర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆ సంఘం నాయకులతో కలిసి యూనియన్ అధ్యక్షుడు సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. మూడేళ్లుగా హెచ్‌సీఎల్‌ను స్వాధీనం చేసుకుంటామంటూ హామీ ఇచ్చినా... మూతవేసే దిశగానే భారీ పరిశ్రమల శాఖ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులో హెచ్‌సీఎల్‌ను చేర్చేలా రక్షణశాఖ, భారీ పరిశ్రమలశాఖపై ఒత్తిడి తేవాలని కేసీఆర్‌ని కోరినట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement