జైట్లీ సాదా సీదా బడ్జెట్
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2015-16 ఆర్థిక సంవత్సరానికి సాదా సీదా సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రపంచంలోని బలమైన ఆర్థిక వ్యవస్థలే అతలాకుతలమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా ఉందంటూ బడ్జెట్ ఉపన్యాసాన్ని ప్రారంభించిన అరుణ్ జైట్లీ, ముందుగా ఆశలు రేకెత్తించి అంతలోనే వాటిని నీరుగార్చారు.
ఉద్యోగుల ఆదాయం పన్ను మినహాయింపు రాయితీల్లో ఎలాంటి మార్పులు చేయకుండా వారి ఆశలను అడియాసలు చేశారు. ఆరోగ్య బీమా ప్రీమియం ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని రూ. 15 వేల నుంచి రూ. 25 వేలకు, ప్రయాణ భత్యాన్ని 800 నుంచి 1600కు పెంచుతూ గుడ్డిలో మెల్లగా ఏదో చేశామనిపించారు. అలాగే వయోవృద్ధుల వైద్య ఖర్చులపై పన్ను మినహాయింపు పరిమితిని 20వేల నుంచి 30 వేలకు పెంచారు. ఆరోగ్య బీమాలేని 80 ఏళ్లు దాటిన వారికి కూడా 30వేల మేరకు వైద్య ఖర్చులను అనుమతిస్తామని తెలిపారు. పీపీఎఫ్, ఈపిఎఫ్ ఖాతాల్లో ఎవరు క్లెయిమ్ చేయని కారణంగా పేరుకుపోయిన రూ. 9,000 కోట్ల నుంచి వృద్ధుల సంక్షేమం కోసం నిధిని ఏర్పాటు చేస్తున్నామంటూ వారికి సాంత్వన కలిగించారు. ప్రధాన మంత్రి బీమా యోజన కింద కేవలం 12 రూపాయల వార్షిక ప్రీమియంతో రూ. 2 లక్షల ప్రమాద బీమాను ప్రకటించడం పేదలకు మేలు చేసే చర్య.
ఇక రైతులకిచ్చే పంట రుణాల లక్ష్యాన్ని రూ. 50 వేల కోట్ల నుంచి ఏకంగా 8.5 లక్షల కోట్లకు పెంచుతూ వారిని కరుణించారు. ఈ లక్ష్యాన్ని బ్యాంకులు పరిపూర్తి చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రధాన మంత్రి వ్యవసాయ యోజనకు రూ. 3వేల కోట్లు కేటాయించడం ముదావహం. ప్రధానమంత్రి మోదీ మానసపుత్రిక ‘స్వచ్ఛ బారత్’కు పెద్ద పీట వేశారు. స్వచ్చ భారత్ నిధికి ఇచ్చే విరాళాలకు నూటికి నూరు శాతం పన్ను మినహాయింపు ప్రకటించారు. స్వచ్ఛ భారత్ ప్రచారం కోసం అన్ని పన్నులపై 2% లెవీ విధించారు. రానున్న బీహార్, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ తరహాలో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు ఇస్తామని ప్రకటించారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చట్టబద్ధంగా ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు జమ్మూ కాశ్మీర్‌లో ఐఐఎంలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
నాలుగేళ్లపాటు కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి పాతిక శాతానికి తగ్గిస్తూ ఆ రంగాన్ని మెప్పించేందుకు ప్రయత్నించారు. కోటీ రూపాయలకు పైగా ఆదాయం కలిగిన సుసంపన్నులపై సంపన్న పన్నును ఎత్తివేసి 2 శాతం సర్‌చార్జీని విధించారు. సర్‌చార్జి ద్వారా రూ. 9వేల ఆదాయం వస్తుందని ప్రకటించి దీనివల్ల వారికి కూడా ప్రయోజనం లేదని ఆయన చెప్పకనే చెప్పారు. కొన్ని ముడి సరకులపై కస్టమ్స్ సుంకాన్ని పెంచుతూ వారిపైనా కూడా భారం వేశారు. దేశ, విదేశాల్లో మూలుగుతున్న నల్ల డబ్బును తెచ్చేందుకు చర్యలను ముమ్మరం చేస్తున్నామని అన్నారు. అందులో భాగంగా నల్ల కుభేరులకు పదేళ్ల జైలు శిక్ష విధించే కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నామని ప్రకటించారు. ప్రత్యక్ష పన్నుల డ్రాప్ కోడ్‌ను ఎత్తివేశారు.
పారిశ్రామిక రంగంలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు 20వేల కోట్ల రూపాయల మూల ధనంతో ముద్రా బ్యాంకును ఏర్పాటు చేస్తున్నట్లు అరుణ్ జైట్లీ ప్రకటించారు. పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టాలనుకుంటున్న ఎస్సీ, ఎస్టీలకు ఈ ముద్రా బ్యాంకు మూల ధనం నుంచి రుణాలందిస్తారు. స్థిరాస్తుల కొనుగోలుకు రూ. 20 వేల నుంచి నగదు చెల్లించరాదని, లక్ష రూపాయలకు మించి స్థిరాస్తులు కొనుగోలు చేసిన సందర్భాల్లో పాన్ నెంబర్ తప్పనిసరిగా పేర్కొనాలంటూ మధ్యతరగతి ప్రజలకు కొత్త ఇబ్బందులు తీసుకొచ్చారు. ఎల్‌పీజీ నగదు బదిలీ స్కీమ్‌ను కొనసాగిస్తామంటూ ఉన్నత ఆదాయం పన్ను చెల్లిస్తున్న సంపన్నవర్గాల వారికి ఎల్పీజీపై సబ్బిడీని ఎత్తివేస్తామని సూచించారు. ముందు స్వచ్చందంగా మంత్రులు, పార్లమెంట్ సభ్యులు ఈ సబ్సిడీలను వదులుకుంటున్నారని హర్షధ్వానాల మధ్య జైట్లీ ప్రకటించారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేయాలని ఓ సమయంలో సర్కారు అనుకున్నా.. ఈసారి ఆ పథకం అమలుకు ఏకంగా రూ. 34,699 కోట్ల కేటాయింపులను అరుణ్ జైట్లీ ప్రకటించారు. గ్రామీణ మౌలిక సౌకర్యాల నిధికి రూ. 25వేల కోట్లు కేటాయించారు. పేద ప్రజల అభ్యున్నతికి ఏకరీతి సామాజిక భద్రత స్కీమ్‌ను ప్రకటించారు.
దేశంలో విద్యుత్ కొరతను నివారించేందుకు 4,000 మెగావాట్లను ఉత్పత్తిచేసే సామర్థ్యంగల ఐదు అత్యాధునిక మెగా విద్యుత్ ప్రాజెక్టులను తీసుకొస్తున్నట్లు ప్రకటించిన జైట్లీ, అందుకు భారీ మొత్తంలో లక్ష కోట్ల రూపాయలను కేటాయించారు. ఏడాదిలోగా కూడంకుళంలోని రెండో అణు విద్యుత్ ఉత్పాదన యూనిట్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పారు. ఇంకా దేశంలో 80 వేల మాధ్యమిక పాఠశాలలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎస్సీల సంక్షేమం కోసం రూ. 30,851 కోట్లు, మహిళల సంక్షేమానికి రూ. 79,258 కోట్లు కేటాయించారు. సమ్మిళిత శిశు అభివృద్ధి పథకానికి 1500 కోట్లు, సమ్మిళిత శిశు పరిరక్షణ స్కీమ్‌కు మరో 500 కోట్ల రూపాయలను కేటాయించారు. నిర్భయ నిధిని వెయ్యి కోట్ల నుంచి రెండువేల కోట్ల రూపాయలకు పెంచారు. పరిశోధనారంగంలో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు అటల్ బిహారీ వాజపేయి పేరుతో కొత్తగా ఓ స్కీమ్‌ను ఏర్పాటుచేసి దానికి రూ. 150 కోట్లు కేటాయించారు. రక్షణ రంగానికి కేటాయింపులను 2,22,370 నుంచి 2,46, 727 కోట్ల రూపాయలకు పెంచారు.