న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ...అచ్చే దిన్ అంటూనే అందరికీ వాతలు పెట్టారు. 12.36 శాతంగా ఉన్న సర్వీస్ ట్యాక్స్‌ను 14 శాతానికి పెంచారు. ఈ అదనపు వాతతో ప్రభుత్వానికి ఏకంగా 15 వేల కోట్ల రూపాయలు సమకూరతాయి. పెరిగిన సర్వీస్ టాక్స్తో అన్ని సేవలు ఇక మరింత ప్రియం కానుంది. ఇక వేతన జీవులు ఎంతగానో ఎదురుచూసిన ఆదాయ పన్ను మినహాయింపు జోలికి ఆర్థిక మంత్రి పోలేదు. అయితే ఉద్యోగులకిచ్చే ట్రాన్స్‌పోర్టు అలవెన్స్‌ను ఎనిమిది వందల నుంచి 16 వందలకు పెంచడం కాసింత ఊరటగా చెప్పుకోవచ్చు.
జన్‌ధన్ యోజన పథకం విజయవంతం కావడంతో... కొత్తగా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి పేరుతో పేదలకు బీమా పథకాన్ని అమల్లోకి తేనున్నారు. ఏడాదికి 12 రూపాయల ప్రీమియం కడితే రెండు లక్షల రూపాయల కవరేజ్ ఈ పథకంలో ఇవ్వనున్నారు. అటల్ పెన్షన్ పేరుతో పేదలు, అణగారిన వర్గాలకు పెన్షన్ పథకాన్ని ప్రకటించారు.
మరో వైపు కార్పొరేట్లకు పెద్ద పీట వేశారు. కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. వచ్చే నాలుగేళ్ల వరకు ఇది అమల్లో ఉంటుందని భరోసా ఇచ్చారు. దేశీయంగా నల్లధనాన్ని అరికట్టేందుకు కొత్త చట్టాలు తీసుకురానున్నట్టు ప్రకటించారు. ఇక ఎప్పటిలాగానే సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీని పెంచారు. అలాగే వెయ్యి రూపాయలలోపు పాదరక్షల ధరలు తగ్గనున్నాయి.
అచ్చే దిన్ అంటూనే వాతలు..
Published Sat, Feb 28 2015 1:10 PM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM
Advertisement