ఈపీఎఫ్లపై పన్ను లేదు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) విషయంలో అనుకున్నదే జరిగింది. ఈపీఎఫ్‌లపై పన్ను విధించే విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. కేంద్ర బడ్జెట్లో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఈపీఎఫ్‌లపై పన్ను విధించాలని చేసిన ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. ఈపీఎఫ్ చందాదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతోపాలు పలు ప్రతిపాదనలు, స్పందన గమనించి దానిని ప్రస్తుతానికి విరమించుకుంటున్నట్లు అరుణ్ జైట్లీ తెలిపారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించి ఆయన నిర్ణయం మేరకే జైట్లీ ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.
ఈపీఎఫ్ లో ఏప్రిల్ 1 తర్వాత నుంచి దాచుకొనే మొత్తాలను వెనక్కి తీసుకోవాలనుకున్నప్పుడు 60 శాతం మొత్తం మీద ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో పేర్కొన్నారు. పదవీ విరమణ నాటికి ఈపీఎఫ్‌లో సమకూరిన నిధిలో 40శాతం మొత్తానికి ఎలాంటి పన్ను ఉండదని అరుణ్ జైట్లీ ప్రకటించారు. తాజా ప్రతిపాదనపై ఆరున్నర కోట్ల ఈపీఎఫ్ చందాదారులు ఆందోళన వ్యక్తం చేశారు.