నైపుణ్య భారత్‌కు శ్రీకారం | Arun Jaitley should explain why BJP opposed GST Bill | Sakshi
Sakshi News home page

నైపుణ్య భారత్‌కు శ్రీకారం

Published Fri, Jul 3 2015 2:05 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM

నైపుణ్య భారత్‌కు శ్రీకారం - Sakshi

నైపుణ్య భారత్‌కు శ్రీకారం

జాతీయ నైపుణ్య విధానానికి కేబినెట్ ఆమోదం
* గుణాత్మక పనితనం, సృజనాత్మక పారిశ్రామికీకరణ లక్ష్యాలు
* రూ. 200కోట్లతో ఆన్‌లైన్ వ్యవసాయ మార్కెట్
* రాష్ట్రస్థాయిలో ఒకటే లెసైన్స్, ఒకే పన్ను విధానం
* ప్రధాని నేతృత్వంలో అత్యున్నత కమిటీలు

న్యూఢిల్లీ: దేశంలో నైపుణ్యం అభివృద్ధి, దేశీయ పారిశ్రామికీకరణను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ విధానాన్ని ప్రకటించింది.

బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన ఈ విధానం పూర్వాపరాలను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ గురువారం వెల్లడించారు. సరఫరాకు డిమాండ్‌కు మధ్య సంతులనం సాధించటం, నైపుణ్యాల మధ్య ప్రస్తుతం ఉన్న అంతరాలను పూడ్చటం, కొత్త పారిశ్రామిక ఒప్పందాలను ప్రోత్సహించటం, గుణాత్మకమైన పనితనం, సమర్థమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు, గుర్తించిన కొన్ని రంగాలలో శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం ఈ విధానంలోని ప్రధానమైన లక్ష్యాలని అరుణ్‌జైట్లీ వివరించారు.

కేంద్రంతో పాటు జాతీయ నైపుణ్య అభివృద్ధి మిషన్ చేపట్టే వివిధ పథకాలకు ఉమ్మడి నియమావళికి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. దేశంలోని పౌరులందరికీ  స్వయం ఉపాధి, సంపద కల్పించటమే లక్ష్యమని జైట్లీ ఈ సందర్భంగా తెలిపారు. జాతీయ నైపుణ్య అభివృద్ధి, పారిశ్రామిక ప్రోత్సాహక విధానం మూడంచెలలో అమలవుతుందని జైట్లీ చెప్పారు.

ఇందుకోసం ప్రధానమంత్రి నేతృత్వంలో గవర్నింగ్ కౌన్సిల్ మార్గదర్శకాలు జారీ చేస్తుంది. తరువాతి అంచెలో నైపుణ్య అభివృద్ధి శాఖ మంత్రి అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ మిషన్‌కు సంబంధించిన కార్యకలాపాలు సరైన మార్గంలో అమలవుతున్నాయా లేదా అన్నవి పర్యవేక్షిస్తుంది. మూడో అంచెలో మిషన్ డెరైక్టరేట్ సెక్రటరీ, మిషన్ డెరైక్టర్‌లు కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలతో సమన్వయం చేసుకుంటూ క్షేత్ర స్థాయిలో నైపుణ్య సంబంధ కార్యక్రమాల అమలును ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు.

ప్రస్తుతం దేశంలో 70 వరకు నైపుణ్య అభివృద్ధి పథకాలు అమల్లో ఉన్నాయి. వీటిలో దేనికదే ప్రత్యేక నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఇప్పుడు అన్నింటికీ కలిపి ఉమ్మడి నియమావళిని కొత్త విధానం ద్వారా రూపొందించి క్రమబద్ధీకరిస్తారు. యువతీ యువకుల్లో వివిధ రంగాల్లో నైపుణ్యం పెంచటం ద్వారా సృజనాత్మక పారిశ్రామికీకరణను ప్రోత్సహించటం ప్రభుత్వ ఉద్దేశమని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించి ఒక అధికారిక ప్రకటననుఆయన విడుదల చేశారు.
 
రూ. 200 కోట్లతో ఆన్‌లైన్ వ్యవసాయ మార్కెట్
బుధవారం కేబినెట్ ఆమోదించిన ఆన్‌లైన్ జాతీయ వ్యవసాయ మార్కెట్‌కు ప్రభుత్వం రూ.200 కోట్ల రూపాయలు కేటాయించింది. 2015-18 ఆర్థిక సంవత్సరాలకు గానూ ఈ నిధులను కేటాయించటం ద్వారా దేశంలోని 585 హోల్‌సేల్ వ్యవసాయ మార్కెట్లను అనుసంధానం చేయటానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 250 మండీలు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 200 మండీలు, మూడో ఆర్థిక సంవత్సరంలో 135 మండీలను అనుసంధానం చేస్తామని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

వచ్చే ఆరునెలల వ్యవధిలో ఆన్‌లైన్ మార్కెట్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్ తెలిపారు. దీని ద్వారా రైతులు తమ ఉత్పత్తులను మెరుగైన ధరలకు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా అమ్ముకోవచ్చన్నారు. ఈ పథకం దేశవ్యాప్తంగా ఒకేలా ఉంటుందని, రాష్ట్రాల వారీగా కేటాయింపులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. కొత్త విధానం ద్వారా రాష్ట్రం మొత్తానికి ఒకే లెసైన్స్ ఉంటుందని, ఒకే రకమైన పన్నువిధానం ఉంటుందన్నారు.

ఎలక్ట్రానిక్ వేలం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణయం జరుగుతుందని, తద్వారా రాష్ట్రం మొత్తం ఒకటే మార్కెట్‌లా మారుతుందని రాధామోహన్‌సింగ్ వివరించారు. దీనివల్ల దళారుల వ్యవస్థ కనుమరుగవుతుందని ఆయన అన్నారు. మార్కెట్ల అనుసంధానానికి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విడిగా సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేసుకోవలసిన అవసరం లేదని, జాతీయ స్థాయిలో ఒకటే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తామని మంత్రి చెప్పారు.

దీనిపై ఆంధ్రప్రదేశ్ సహా పలురాష్ట్రాలు ఆసక్తి చూపాయన్నారు. ఇందుకోసం కేంద్ర వ్యవసాయ శాఖ ఇప్పటికే చిన్న రైతుల వ్యవసాయ వ్యాపార కన్సార్టియమ్‌ను ఏర్పాటు చేసిందని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా ఇస్తామని, ఈ-మార్కెటింగ్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలు, అమ్మకాల కోసం అవసరమైన మౌలిక వసతుల ఖర్చుల కోసం ప్రతి మార్కెట్‌కు రూ.30లక్షల సబ్సిడీ ఇస్తామని రాధామోహన్‌సింగ్ తెలిపారు.
 
50 వేల కోట్లతో నూతన నీటి పారుదల విధానం
దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులను పెంచే లక్ష్యంతో ‘ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన(పీఎంఎస్‌కేవై)’ పేరుతో నూతన నీటిపారుదల పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రానున్న 5 సంవత్సరాలలో రూ.50 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వివరించారు. ఈ నిధులను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికీ వినియోగించవచ్చని ఆయన తెలిపారు.

‘ఇందులో పెట్టుబడి పెట్టే ప్రతిరూపాయీ కూడా క్షేత్ర స్థాయిలో ప్రతి పొలానికీ నీరు అందించేందుకు తోడ్పడాలన్న’ది తమ లక్ష్యమని జైట్లీ చెప్పారు. ఈ పథకాన్ని జిల్లా స్థాయి నీటిపారుదల పథకం(డీఐపీ), రాష్ట్రస్థాయి నీటిపారుదల పథకం(ఎస్‌ఐపీ)గా విభజించి నీటి వనరులు, సరఫరా, వినియోగం అనే మూడు అంశాలను పర్యవేక్షిస్తాయని ఆయన చెప్పారు. జాతీయ స్థాయిలో పర్యవేక్షణకు అంతర్ మంత్రిత్వ శాఖలతో నేషనల్ స్టీరింగ్ కమిటీ ప్రధానమంత్రి చైర్మన్‌గా ఏర్పడుతుందన్నారు.  

నిధుల కేటాయింపు, మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం కోసం నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడి నేతృత్వంలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. రాష్ట్రస్థాయిలో ప్రధానకార్యదర్శి నేతృత్వంలో నిధుల మంజూరు కమిటీ(ఎస్‌ఎల్‌ఎస్‌సీ) ఏర్పాటవుతుంది. రాష్ట్రంలో ప్రాజెక్టులకు నిధులు కేటాయించటం, వాటిని పర్యవేక్షించే పూర్తి అధికారం ఈ కమిటీకి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement