
అద్వానీలాగే అరుణ్ కూడా..
- డీడీసీఏ వివాదం నుంచి అరుణ్ జైట్లీ భేషుగ్గా బయటపడతారన్న ప్రధాని
- హవాలా కేసు నుంచి అద్వానీ కడిగిన ముత్యంలా బయటికొచ్చారని గుర్తుచేసిన మోదీ
- బీజేపీపీపీ భేటీ వివరాలను వెల్లడించిన వెంకయ్యనాయుడు
న్యూఢిల్లీ: 'హవాలా కుంభకోణం వెలుగుచూసినప్పుడు మన పార్టీ కురువృద్ధుడు అద్వానీపై కూడా ఆరోపణలు వచ్చాయి. అప్పుడు కూడా ప్రత్యర్థి పార్టీలు ఇలానే గోలచేశాయి. కానీ చివరికి అద్వానీజీ కడిగిన ముత్యంలా బయటికొచ్చారు. ఆయనపై మోపిన ఆరోపణలన్నీ పటాపంచలయ్యాయి. ఇప్పుడు అరుణ్ జైట్లీ విషయంలోనూ అదే జరుగుతుంది. డీడీసీఏ వివాదం నుంచి ఆయన భేషుగ్గా, స్వచ్ఛంగా బయటపడతారనే నమ్మకం ఉంది'.. ఇదీ స్థూలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ ఎంపీలతో అన్న మాటలు.
మంగళవారం పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు బీజేపీపీపీ కార్యాలయంలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఆ పార్టీ ఎంపీల సమావేశం జరిగింది. భేటీ అనంతరం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు. హవాలా కేసు నుంచి అద్వానీ బయటపడ్డట్టే, డీసీసీ వివాదం నుంచి అరుణ్ జైట్లీ బయటపడతారని ప్రధాని అన్నారని వెంకయ్య తెలిపారు. కేవలం ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేసేందుకే విపక్ష కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఇప్పుడు జైట్లీని టార్గెట్ చేసినట్లే గతంలో సుష్మా స్వరాజ్, వసుంధరా రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్ లపై నిందారోపణలు చేశారని దుయ్యబట్టారు.