అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేయబోతున్న అరవింద్ కేజ్రీవాల్.. తన మంత్రుల బృందాన్ని సిద్ధం చేసుకున్నారు. తనకు అత్యంత విశ్వసనీయుడైన మనీష్ సిసోదియా సహా మొత్తం ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. పత్ పర్ గంజ్ నియోజకవర్గం నుంచి గెలిచిన మాజీ పాత్రికేయుడు మనీష్ సిసోదియాతో పాటు కేజ్రీవాల్ మంత్రివర్గంలో రాఖీ బిర్లా, సోమ్ నాథ్ భారతి, సౌరభ్ భరద్వాజ్, గిరీష్ సోనీ, సతేంద్ర జైన్ ఉండబోతున్నట్లు కేజ్రీవాల్ తో సమావేశం అనంతరం భరద్వాజ్ తెలిపారు. వీళ్లలో.. షీలా మంత్రివర్గంలోని పీడబ్ల్యుడీ మంత్రి రాజ్ కుమార్ చౌహాన్ ను రాఖీ బిర్లా ఓడించారు. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కిరణ్ వాలియాను సోమ్ నాథ్ భారతి ఓడించారు. అయితే, ఇది తుది జాబితా కాదని, కొన్ని మార్పు చేర్పులు జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
లెఫ్టినెంట్ గవర్నర్ పంపిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సరేనంటే, కేజ్రీవాల్ రాంలీలా మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. మంత్రివర్గ కూర్పుపై కేజ్రీవాల్ మంగళవారం మొత్తం తన సహచరులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు.
మరోవైపు.. సీనియర్ ఐఏఎస్ అధికారి రాజేంద్ర కుమార్ ను ముఖ్యమంత్రికి ముఖ్య కార్యదర్శిగా తీసుకోవాలని కేజ్రీవాల్ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న 47 ఏళ్ల రాజేంద్ర కుమార్ కూడా కేజ్రీవాల్ లాగే ఐఐటీ ఖరగ్ పూర్ లో చదివారు. ఆయనతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డి.ఎం. స్పోలియా కూడా కేజ్రీవాల్ ను ఆయన ఇంట్లో కలిశారు.
వినోద్ కుమార్ బిన్నీ ఆగ్రహం.. రేపు ప్రెస్ మీట్
మంత్రివర్గంలోకి తీసుకునే నాయకుల జాబితాలో తన పేరు లేకపోవడం పట్ల వినోద్ కుమార్ బిన్నీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. కేజ్రీవాల్ ఇంట్లోకి సరసరా వెళ్లిన ఆయన, పదే పది నిమిషాల్లో అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. తిరిగి వచ్చేటప్పుడు పార్టీ నాయకుడు యోగేంద్ర యాదవ్ ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. అక్కడే ఉన్న మీడియాతో మాత్రం రేపు ప్రెస్ మీట్ పెడతానని చెప్పి కారులో వెళ్లిపోయారు.
ఢిల్లీలోని లక్ష్మీనగర్ నియోజకవర్గంలో డాక్టర్ అశోక్ కుమార్ వాలియా లాంటి ఉద్దండుడిని దాదాపు 8 వేల ఓట్ల తేడాతో ఓడించిన వినోద్ కుమార్ బిన్నీ.. దాదాపుగా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలలో రాజకీయ అనుభవం కాస్తో కూస్తో ఉన్న ఏకైక నాయకుడు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్ గా గెలిచిన ఆయన.. 2011లో కాంగ్రెస్ పార్టీని వీడి జన లోక్ పాల్ ఉద్యమంలో చేరారు. మనీష్ సిసోదియాకు అత్యంత సన్నిహితుడిగా భావించే బిన్నీ కోసం వేరే పదవి ఉందని, ఆయన సేవలు తప్పకుండా వినియోగించుకుంటామని ఆప్ వర్గాలు అంటున్నాయి. అయితే, సరైన హామీ లభించకపోతే మాత్రం.. బిన్నీ బుధవారం ఏం బాంబు పేలుస్తారోనని పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.