
కేజ్రీవాల్ మరో ఘనత
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ట్విటర్‌లో అనుసరిస్తున్న వారి సంఖ్య శనివారం కోటి దాటింది. దీంతో ఎక్కువ మంది అనుసరిస్తున్న భారత రాజకీయ నాయకుల్లో ఆయన రెండో స్థానాన్ని పదిలం చేసుకున్నారు. సుమారు రెండున్నర కోట్ల ఫాలోవర్లతో ప్రధాని నరేంద్ర మోదీ తొలిస్థానంలో ఉన్నారు. గతేడాది నవంబర్‌లోనే కేజ్రీవాల్‌కు రెండో స్థానం దక్కింది. సుమారు 66 లక్షల మంది ఫాలోవర్లతో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కేజ్రీవాల్ తరువాతి స్థానంలో ఉన్నారు.
మైక్రో బ్లాగింగ్ రచనలతో ఎంతో పేర్గాంచిన కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ సుమారు 48 లక్షల ఫాలోవర్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక గణాంకాలు లేకున్నా ట్విటర్‌లో చురుగ్గా ఉన్న రాజకీయ నాయకుల ఖాతాలను విశ్లేషిస్తే ఈ విషయాలు బయటపడ్డాయి. ఫేస్‌బుక్ లైవ్ లాంటి కొత్త ఫీచర్లు వాడటం మొదలు పెట్టడంతో సామాజిక మాధ్యమాల్లో కేజ్రీవాల్‌ను అనుసరిస్తున్న వారి సంఖ్య ఈ మధ్య పెరిగిందని, యూట్యూబ్‌లో కూడా ఆయన వీడియోలను ఎక్కువ మంది చూస్తున్నారని ఆప్ కార్యకర్త ఒకరు తెలిపారు.