twitter followers
-
ప్రిన్స్ అరుదైన ఫీట్.. దక్షిణాది హీరోల్లోనే టాప్..!
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు దక్షిణాదిన ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో అయితే ఆ క్రేజే వేరు. తాజాగా ప్రిన్స్ మహేశ్ బాబు అరుదైన ఫీట్ సాధించాడు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే హీరోకు ట్విటర్ ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెరిగింది. ప్రిన్స్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య 13 మిలియన్లకు చేరింది. తాజాగా ఈ ఫీట్ వల్ల దక్షిణాదిన ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్న హీరోగా నిలిచాడు ప్రిన్స్. ఇటీవలే దీపావళి సందర్భంగా అభిమానులకు ప్రిన్స్ సర్ప్రైజ్ ఇచ్చారు. తన కుమార్తె సితార క్లాసికల్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. మహేశ్ బాబుకు ఇన్‌స్టాలోనూ 9 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ట్విటర్లో ఫాలోవర్స్ 13 మిలియన్లకు చేరడంతో దక్షిణాదిలో టాప్ హీరోగా ఘనతను సొంతం చేసుకున్నారు. -
తిరుగులేని కోహ్లి.. సరికొత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా ఘనత!
Virat Kohli On Twitter: టీమిండియా మాజీ సారథి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రికార్డుల గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. అంతర్జాతీయ క్రికెట్లో సమకాలీన క్రికెటర్లలో ఎవరికీ సాధ్యం కాని విధంగా ఇప్పటికే 71 సెంచరీలు సాధించాడు ఈ రన్‌మెషీన్. కొన్నాళ్లుగా నిలకడలేమి ఫామ్‌తో ఇబ్బంది పడిన కింగ్.. ఆసియా కప్-2022లో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో అజేయ శతకంతో సత్తా చాటి మునుపటి కోహ్లిని గుర్తు చేశాడు. సోషల్ మీడియాలో కోహ్లి హవా! కెరీర్లో 71వ అంతర్జాతీయ సెంచరీ నమోదు చేసి తన విలువ చాటుకున్నాడు. తనదైన ఆట తీరుతో రోజురోజుకీ అభిమానుల సంఖ్యను పెంచుకుంటూనే ఉన్నాడు. తాజాగా మరో రికార్డు సాధించాడు కోహ్లి. అయితే, ఈసారి ఆటలో కాకుండా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్లో కోహ్లి అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ట్విటర్లో 50 మిలియన్ల ఫాలోవర్లు కలిగి ఉన్న మొదటి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో.. ఇక.. ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లికి 211 మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. అదే విధంగా ఫేస్బుక్లో 49 మిలియన్ మంది కోహ్లిని ఫాలో అవుతున్నారు. దీంతో.. సోషల్ మీడియాలో కోహ్లి ఫాలోవర్ల సంఖ్య మొత్తంగా 310 మిలియన్‌కు చేరింది. విరాట్ కోహ్లి(PC: Virat Kohli Instagram) కాగా ట్విటర్లో 50 మిలియన్ ఫాలోవర్ల సంఖ్యను చేరుకున్న మొదటి క్రికెటర్‌గా నిలిచిన కోహ్లి.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుట్‌బాల్ స్టార్ ఆటగాళ్లు క్రిస్టియానో రొనాల్డో(450 మిలియన్), లియోనల్ మెస్సీ(333 మిలియన్) తర్వాత అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన మూడో క్రీడాకారుడిగా కొనసాగుతున్నాడు. కాగా కోహ్లి ప్రస్తుతం.. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి సన్నద్ధమయ్యే పనిలో ఉన్నాడు. చదవండి: T20 WC: నేనైతే వాళ్లిద్దరిని సెలక్ట్ చేసేవాడిని! నువ్వొక మాజీ కెప్టెన్.. కానీ ఏం లాభం? క్రికెట్ సౌతాఫ్రికాకు భారీ షాక్ Thank you for all the love and support throughout the Asia Cup campaign. We will get better and come back stronger. Untill next time ❤️🇮🇳 pic.twitter.com/yASQ5SbsHl — Virat Kohli (@imVkohli) September 9, 2022 -
మా గొంతు నొక్కేస్తున్నారు!
న్యూఢిల్లీ: భారత్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడంలో ట్విట్టర్ తెలియకుండానే భాగస్వామిగా మారుతోందని, తన ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్స్‌ను తగ్గిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ఇండియాకు లేఖ రాశారు. భారత విధ్వంసంలో ట్విట్టర్ పావుగా మారకూడదని, కోట్లాది భారతీయుల తరఫున ఈ లేఖ రాస్తున్నానని చెప్పారు. డిసెంబర్ 27న రాసిన ఈ లేఖ విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. అయితే రాహుల్ అకౌంట్ ఫాలోవర్స్ సంఖ్య కచ్ఛితమైనది, సరైనదేనని ట్విట్టర్ వెల్లడించింది. తమ ప్లాట్‌ఫామ్‌పై ఆరోగ్యకరమైన చర్చలను కోరుకుంటున్నామని తెలిపింది. భిన్న అభిప్రాయాలను తాము గౌరవిస్తామని ట్విట్టర్ వైస్ ప్రెసిడెంట్ సైనియడ్ మెక్‌స్వీనీ తెలిపారు. తాము ఎలాంటి రాజకీయపరమైన సెన్సారింగ్ చేయడం లేదన్నారు. దేశ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేతగా అన్యాయంపై ప్రజల తరఫున గళమెత్తాల్సిన బాధ్యత తనపై ఉందని రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు. భారత్‌లో మీడియా అణగదొక్కుతున్న నేపథ్యంలో ప్రజల సమస్యలను లేవనెత్తి, ప్రభుత్వ బాధ్యతలను గుర్తుచేసేందుకు ట్విట్టర్ వంటి మాధ్యమాలు తమకు కీలకంగా మారాయని, కానీ గత కొన్ని రోజులుగా తన ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా పడిపోతూ వస్తోందని వివరించారు. తన ఫాలోయర్ల సంఖ్య రోజుకు పదివేల చొప్పున పెరిగేదని, కానీ కొన్ని రోజులుగా ఈ సంఖ్య మారడం లేదని చెప్పారు. కేంద్రమే కారణం తన గళాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం నుంచి ట్విట్టర్ ఇండియా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని తెలిసిందని రాహుల్ ఆరోపించారు. తప్పుదోవ పట్టించడం, తప్పుడు సమాచారాన్ని తమ వేదికపై అంగీకరించమని, అలాంటివాటిపై మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీ సాయంతో చర్యలు తీసుకుంటుమని ట్విట్టర్ ప్రతినిధి చెప్పారు. ఇందులో భాగంగానే కొందరి ఫాలోవర్ల సంఖ్యలో మార్పులు జరగొచ్చని, విధానాల ఉల్లంఘనకు ప్రతి వారం లక్షలాది మంది ఖాతాలను తొలగిస్తుంటామని చెప్పారు. ప్రజాస్వామ్యం, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ప్రభుత్వం అణచివేయకూడదన్నదే తమ నాయకుడు రాహుల్‌గాంధీ అభిప్రాయమని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా చెప్పారు. ఈ వారం నుంచి రాహుల్ ఫాలోయర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతకుముందు చాలా రోజుల పాటు ఆయన ఫాలోయర్ల సంఖ్య 1.95 కోట్ల వద్ద స్థిరంగా ఉండిపోయింది. ఈ వారం మాత్రం ఈ సంఖ్య 1.96 కోట్లకు చేరింది. -
సాక్షి కార్టూన్ 28-01-2022
-
సిరివెన్నెలను ఎక్కువగా శ్రమ పెట్టిన పాట ఏంటి..?
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామాశాస్త్రి మంగళవారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ట్విటర్లో చేరి ఏడాది పూర్తయిన సందర్భంగా 2021, జూన్‌లో నెటిజనులతో ముచ్చటించారు. ఆ వివరాలు.. ‘సిరివెన్నెలను అడగండి’ అంటూ దాదాపు గంటసేపు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు–సమాధానాలు ఈ విధంగా.. ► అప్పట్లో ఉన్న పాటలు, సినిమాలు ఇప్పుడు ఎందుకు రావడం లేదు? ప్రతీ కాలంలోనూ పాటలు, సినిమాలు అన్నీ అన్ని రకాలుగానూ ఉన్నాయి. ఏ రకం అభిరుచి ఉన్నవాళ్ళు దాన్ని ఆస్వాదిస్తారు. భిన్నంగా ఉన్నదాన్ని గురించి విసుక్కుంటారు. మన అభిరుచికి అనుగుణంగా ఉన్న పాటలను ఎంచుకునే అవకాశం మనకు ఉంది. విసుక్కునే చేదు మాని, మన అభిరుచిని ఆస్వాదించే తీపిని చవి చూద్దాం. ► త్రివిక్రమ్‌గారు మిమ్మల్ని రాత్రి ఉదయించే సూర్యుడు అని సంబోధించడానికి కారణం? మనకు ఇష్టమైన విషయాన్ని, మనకు తోచిన విధంగా వ్యక్తీకరిస్తాం. నేను సాధారణంగా రాత్రిపూట పని చేస్తాను. కాబట్టి దానిని ఆయన భాషలో ఆయన వ్యక్తీకరించారు. ► ‘లైఫ్ ఆఫ్ రామ్..’ పాట ఒక అద్భుతం. ఆ పాటలోని మీకు నచ్చిన ఒక లైన్ గురించి... ‘ఇలాగే కడదాకా ఒక ప్రశ్నై ఉండాలనుకుంటున్నా ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్ని అడుగుతు ఉన్నా’. అది నా ఆలోచనా ప్రపంచానికి కేంద్రబిందువు. ► మీరు రాసిన పాటల్లో మిమ్మల్ని అత్యధికంగా శ్రమ పెట్టిన పాట? పాట వచ్చే క్రమంలో శ్రమ అనే మాటకు చోటు లేదు ► దైవాన్ని నిర్వచించాలంటే? తనను తాను నిర్వచించుకోగలగాలి. ► మీకు బాగా నచ్చిన పుస్తకం? ‘భగవద్గీత’, ఖలీల్ జిబ్రాన్ రాసిన ‘ద ప్రాఫెట్’. ► వేటూరి సుందరరామ్మూర్తిగారికి మీరు రాసిన పాటల్లో ఏ పాట ఇష్టం? చాలా ఉన్నాయని వాళ్ళూ వీళ్ళూ అన్నారు. ‘నీలాల కన్నుల్లొ సంద్రమే, నింగి నీలమంతా సంద్రమే’ అన్న పాటను ఆయన అత్యంత ఆత్మీయంగా విశ్లేషించి మెచ్చుకున్నారని బాలు అన్నయ్య నాకు చెప్పారు. ► మీరు మెలకువగా ఉన్న సమయంలో ఎక్కువగా ఏం చేస్తుంటారు? ఇప్పుడైతే ఎక్కువగా ఐపాడ్‌తో గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నాను. ► ఫిలాసఫీ చూపులో ప్రపంచమో బూటకమా? మనని జీవితం అనే ప్రశ్న వెంటాడి వేధించకపోతే, ఊరికే తెలివితేటలతో మాటాడాల్సి వస్తే, ఆ వాచాలతలో బూటకమే! ► తెలుగులో ట్వీట్ చేసినవారికే బదులు ఇస్తున్నారు? తెలుగులోనే నన్ను నేను స్పష్టంగా వ్యక్తపరుచుకోగలను అన్న కారణం వల్ల. అలానే టింగ్లీషు నాకు సరిగా రాదు. ► ఏకాగ్రతకు మీ నిర్వచనం? నేను తప్ప ఇంకేం కనిపించకపోవడం, నేను తప్ప ఇంకేం అనిపించకపోవడం. ► ఒక రచయితకి ఉండాల్సిన మొదటి లక్షణం? తానేం చెప్తున్నాడో, ఎందుకు చెప్తున్నాడో తనకి స్పష్టంగా తెలియడం. ► మళ్ళీ తెలుగు సాహిత్యపు స్వర్ణయుగాన్ని చూసేదెప్పుడు? రాను రాను పద ప్రయోగాలు తగ్గిపోతూ వచ్చి ఇంగ్లీష్ లేదా యాస పాటలు వచ్చేశాయి. మీ ప్రయోగాలను, అద్భుత కావ్యాలను ఎప్పుడు చూడగలం? సాహిత్యానికి ముందు తెలుగు అనో, మరోటనో చేర్చకూడదు. భాషతో సంబంధం లేనిది భావం. భావాలనేవి అన్ని విధాలుగానూ ఉంటాయి. ధాన్యం పొట్టుతో పాటే ఉంటుంది. దూగర దులిపి, గింజను ఏరుకోవడం ఎప్పుడూ జరగాల్సిన పనే. ఎప్పుడూ మనకు కావాల్సింది ఉంటుంది. మనం చేయాల్సింది ఏరుకోవడమే. ► దేవులపల్లిగారి సాహిత్యంలో మీకు బాగా నచ్చిన కవిత? ‘మ్రోయించకోయి మురళీ, మ్రోయించకోయి కృష్ణా... తియ్య తేనియ బరువు మోయలేదీ బరువు’ – వివరణ అనేది దాహం తీర్చుకునేవారి పాత్రతను బట్టి, పాత్రను బట్టి ఉంటుంది. ► ‘సామజ వర గమనా’ అన్న సమాసం వింటే త్యాగరాజస్వామి గుర్తుకు వచ్చేవారు. ఇప్పుడు అందమైన యువతి ఊరువులు, వాటిని మోహించే యువకుడు మదిలో మెదులుతున్నారు. తప్పంతా సామాజికుడిదేనంటారా? దృశ్యంలో లేదు. చూసే కన్ను వెనకాల ఉన్న సంస్కారంలో ఉంది. ► మీరు హేతువాది అయినప్పటికీ దేవుడు ఉన్నాడని మీరు ఎలా నమ్ముతారు? నేనున్నాను గనుక. ► రచయితలు – సాంఘికీకరణపై మీ అభిప్రాయం? ‘సరిగా చూస్తున్నదా నీ మది.. గదిలో నువ్వే కదా ఉన్నది..’ చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వు కాదంటున్నది no man is island.. ► లిరిక్స్ రాయడానికి మీకు ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉందా? నా బుర్రలో అలజడి. ► ‘యుగయుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం?’ అన్నారు. నిజమా? తప్పే! మృగాలను అవమానించకూడదు. ► పాటలో నిరాశానిస్పృహలను వ్యక్తపరిచే సందర్భంలో కూడా, ఆ స్టేట్ ఆఫ్ మైండ్‌ను దాటి ఓ ఆశావాద కోణం కూడా ఇనుమడింపజేస్తూ వచ్చారు. ఆ తూకం పాటించడానికి గల ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా? ‘కాలం గాయాన్ని మాన్పుతుంది’ అన్న సత్యాన్ని గుర్తిస్తే ఏడుపైనా, నవ్వైనా, మరేదైనా మనం చెయ్యాలనుకున్నంత సేపు చెయ్యలేం. ఇది ముందే తెలుసుకుంటే, భావాల ఉద్ధృతిని మోతాదు మించనివ్వం. ‘‘నిన్న రాత్రి పీడకలను నేడు తలుచుకుంటూ నిద్ర మానుకోగలమా? ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా?’’ ► తెలుగు భాష మీద పట్టు లేని కొంతమంది గాయకులు మీ కలం నుండి జారిన అద్భుతమైన పాటలను ఖూనీ చేసినట్టు గానీ, సంగీత దర్శకులు ఆ విషయాన్ని విస్మరించినట్టు గానీ మీకెప్పుడైనా అనిపించిందా ? బియ్యంలో రాళ్ళు ఏరుకుని వండుకుంటాం. అన్నంలో తగిలిన రాళ్ళను పక్కన పెట్టి తింటాం. ‘చూపులను అలా తొక్కుకు వెళ్ళకు...’ అని మీకూ తెలుసు... ఎవరినో ఎందుకు నిందించడం! ► మీరు ‘గాయం’లో పాడిన ‘నిగ్గదీసి అడుగు’ పాట నాకు చాలా ఇష్టం. ఇలాంటి పాటలను మళ్ళీ రాయాలని మీకు ఎందుకు అనిపించలేదు? అలాంటి భావాలున్న మిగిలిన పాటలను మీరెందుకు పరిశీలించరు? జిరాక్స్ కాపీని ఎందుకు అడుగుతున్నారు. ► ‘సిరివెన్నెలగారు’ పాటల రచయిత కాకపోయి ఉంటే? జరగాల్సిందే జరిగింది. జరగాల్సిందే జరుగుతుంది. -
సోనూసూద్ మరో ఘనత
సాక్షి, ముంబై: ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి ఘనతను సాధించారు. కరోనా వ్యాప్తి, లాక్డౌన్ కాలంలో మానవత్వాన్ని చాటుకుని సగటు జీవి పట్ల రియల్ హీరోగా నిలిచిన సోనూసూద్‌కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ మామూలుది కాదు. ఫలితమే ట్విటర్లో ఆయన ఫాలోవర్ల సంఖ్య రికార్డు స్థాయిలో దూసుకుపోయింది. ప్రస్తుతం ట్విటర్లో సోనూ ఫోలోవర్ల సంఖ్య 6 మిలియన్ల మార్కును అధిగమించడం విశేషం. దీంతో అభిమానులు సోనూసూద్‌కు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు. (‘రియల్ హీరో’ సోనూసూద్‌కి అరుదైన గౌరవం) సంక్షోభంలో చిక్కుకున్న వలస కార్మికుల పాలిట ఆపద్భాంధవుడిగా సోనూసూద్ అందించిన సేవలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమాల్లో విలన్ పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించిన సోనూ..రియల్ లైఫ్‌లో తన దాతృత్వానికి హద్దులే లేవంటూ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ వారి గుండెల్లో గూడుకట్టుకున్నారు. ఇప్పటికీ తన సేవానిరతిని కొనసాగిస్తున్న కోట్ల రూపాయలు వెచ్చించి మరీ అనేక సాంఘిక కార్యక్రమాలను కొనసాగిస్తూ సాయానికి మరో పేరుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనాతో బాధపడుతున్నావారికి కీలకమైన మందులను అందిస్తున్నారు. అలాగే కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్న తరుణంలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తన వంతుగా 10 ఆక్సిజన్ సిలిండర్లను అందించారు. అంతేకాదు తమ వంతు సాయం అందిచి, పలువురి ప్రాణాలు కాపాడాలని కూడా ఆయన తన ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చారు. కాగా సోనూసూద్ మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సోనూసూద్ రైడ్ ఫర్ అవర్ స్టూడెంట్స్ అంటూ హైదరాబాద్ రోడ్లపై సైకిల్ తొక్కుతూ సందడి చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. A ride for our students 🇮🇳 pic.twitter.com/z8IkCCgZrh — sonu sood (@SonuSood) April 14, 2021 शादी ब्याह के फंक्शन के लिए संपर्क करें। pic.twitter.com/dlNUwtO8aQ — sonu sood (@SonuSood) April 15, 2021 -
నాన్న కంటతడి పెట్టడం అదే ప్రథమం: సూపర్ స్టార్
బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. కుటుంబం, వర్క్‌కు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ వారిని ఖుషీ చేస్తుంటారు. అప్పుడప్పుడు త్రో బ్యాక్ ఫోటోలను షేర్ చేస్తూ.. దాని వెనక ఉన్న జ్ఞాపకాలను అభిమానులతో షేర్ చేసుకుంటారు బిగ్ బీ. తాజాగా ఇలాంటి ఫోటోని ఒకదాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు సీనియర్ బచ్చన్. దీనిలో అమితాబ్ తన తండ్రి హరివంశరాయ్ బచ్చన్ ఆశీర్వాదం కోసం వంగి ఆయన పాదాలకు నమస్కరిస్తున్నారు. పక్కనే నిల్చున్న చిన్నారి జూనియర్ బచ్చన్ తండ్రిని ఆస్తకిగా గమనిస్తుండటం ఈ ఫోటోలో చూడవచ్చు. అయితే తొలుత ఈ ఫోటోని ఓ అభిమాని ట్విట్టర్లో షేర్ చేశారు. దాన్ని అమితాబ్ తన ఖాతాలో షేర్ చేస్తూ.. దీని వెనక గల కథను అభిమానులతో పంచుకున్నారు. (చదవండి: అతను నన్ను ప్రేమిస్తున్నాడు అంతే..) T 3777 - The caption informs of 45 million on Twitter .. thank you Jasmine, but the picture says a lot more .. Its the moment I came home surviving death after the 'Coolie' accident .. Its the first time ever I saw my Father breaking down ! A concerned little Abhishek looks on ! pic.twitter.com/vFC98UQCDE — Amitabh Bachchan (@SrBachchan) January 9, 2021 ఈ మేరకు అమితాబ్ ‘కూలీ షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో నేను చావు అంచుల వరకు వెళ్లాను. అదృష్టవశాత్తు కోలుకుని ఇంటికి చేరుకున్నాను. ఆ సమయంలో మా నాన్నగారి ఆశీర్వాదం తీసుకోవడం కోసం వంగి ఆయన పాదాలకు నమస్కరించాను. ఆ సమయంలో నన్ను చూసి నాన్నగారు ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టారు. నాన్నను అలా చూడటం నా జీవితంలో అదే మొదటిసారి. ఇక పక్కనే ఉన్న అభిషేక్ మమ్మల్ని ఆసక్తిగా గమనిస్తున్నాడు’ అంటూ ఈ ఫోటో వెనక గల స్టోరిని ట్వీట్ చేశారు.. ఇక తాజాగా శనివారం బిగ్ బీ మరో రికార్డు సృష్టించారు. సీనియర్ బచ్చన్ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య శనివారం నాటికి 45 మిలియన్లకు చేరుకుంది. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
ట్విటర్ ఫాలోవర్స్‌లో వరల్డ్ నంబర్ వన్ ఆర్బీఐ
ముంబై: ప్రపంచంలోనే అత్యధికంగా ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్నకేంద్ర బ్యాంక్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) నిలిచింది. ఆదివారం నాటికి ఆర్బిఐ ట్విటర్ ఖాతాలో ప్రపంచవ్యాప్తంగా 10లక్షలకు పైగా ఫాలోవర్స్ నమోదయ్యారు. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మరియు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కంటే ఆర్బిఐకి ఎక్కువ మంది ట్విట్టర్ ఫాలోవర్స్ ఉండటం గమనార్హం. కాగా.. ట్విట్టర్లో రెండవ స్థానంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ మెక్సికోకు 7.74 లక్షల మంది, బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియాకు 7.57 లక్షలు మంది చొప్పున ఫాలోవర్స్ ఉన్నారు. (ట్విటర్ ఫ్లీట్స్‌లో భారీ లోపం) ప్రపంచంలోని ప్రముఖ సెంట్రల్ బ్యాంక్ అయిన యుఎస్ ఫెడరల్ రిజర్వ్‌కు కేవలం 6.77 లక్షల ఫలోవర్స్ ఉన్నారు. ప్రపంచంలో రెండవ అత్యంత శక్తివంతమైన ద్రవ్య అధికారి యురోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసిబి)కి ట్విట్టర్లో 5.91 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఈసీబి తరువాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రెజిల్ 3.82 లక్షలు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ 3.17 లక్షలు, బ్యాంక్ ఆఫ్ కెనడా 1.80 లక్షలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ 1.16 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు."ఆర్బిఐ ట్విట్టర్ ఖాతా ఈ రోజు ఒక మిలియన్ ఫాలోవర్స్‌కు చేరుకుంది. ఇది మనకు ఒక కొత్త మైలురాయి. ఆర్బిఐలో నా సహోద్యోగులందరికీ అభినందనలు ”అని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ట్విట్టర్ వేదికగా అభినందించారు. -
ప్రతి క్షణాన్నీ ఆస్వాదించండి
ఇటీవలే ట్విట్టర్లో జాయిన్ అయ్యారు అనుష్క. ఆదివారం సాయంత్రం అభిమానులతో ఆమె చిట్‌చాట్ చేశారు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆ విశేషాలు. ► యోగా టీచర్‌గా మీరు నేర్చుకున్న విషయం? మనలో ప్రతి ఒక్కరూ భిన్నమైన వాళ్లమే. మనల్ని మనం కోల్పోకుండా ప్రతి ఒక్కరినీ ప్రేమించాలి, గౌరవించాలి. నిరంతరం స్వీయ విమర్శ చేసుకుంటూ ఉండాలి. ► మీకు ఇష్టమైన జంతువు? డాల్ఫిన్ అంటే బాగా ఇష్టం. ► లాక్డౌన్లో మీరు నేర్చుకున్న విషయం? మన జీవితం, మన చుట్టూ ఉన్నవన్నీ ఎప్పుడూ మన చేతుల్లో ఉండవు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే ప్రతీ క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకుందాం. ► మీకు నచ్చిన పుస్తకం? ఆల్కెమిస్ట్ ► గతానికి సంబంధించి ఏదైనా మార్చేసే అవకాశం వస్తే ఏం మారుస్తారు? ఇప్పటివరకూ జరిగిన ప్రతి విషయం నన్ను మంచి స్థాయిలో నిలబెట్టింది. అందుకే ఏదీ మార్చను. ► ప్రభాస్‌తో ఇంకో సినిమా చేయండి... మేమిద్దరం జంటగా నటించాల్సిన కథ కుదిరితే తప్పకుండా నటిస్తాం. ► కొత్త సినిమా విశేషాలు చెప్పండి.. త్వరలోనే నిర్మాణ సంస్థల నుంచి అధికారిక ప్రకటన వస్తుంది. ► మీకు స్ఫూర్తిగా నిలిచినవాళ్ల పేర్లు చెప్పండి? మా అమ్మానాన్న, యోగా గురువు, అలానే నేను ప్రతి రోజూ కలిసేవాళ్లు. అందరూ నాకు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉన్నారు. -
ఒక లీడర్ మిలియన్ నీడలు
కొత్త నెంబర్! ఫోన్ ఎత్తం. కొత్త మనిషి! తలెత్తం. ఫోనెత్తితే సమాధానం ఇవ్వాలి. తలెత్తితే.. సహాయం చెయ్యాలి. వీలవక కానీ మన నీడను కూడా.. మనల్ని ఫాలో అవనివ్వం. కవితను చూడండి. పది లక్షల నీడలు! మనిషెవరని కాదు.. కష్టం ఏమిటని చూసే లీడర్. సౌత్ పొలిటీ‘షి’యన్లలో.. ఫస్ట్ ‘మిలియనీర్’. ట్విట్టర్లో పది లక్షల ఫాలోవర్లను సొంతం చేసుకున్న తొలి దక్షిణాది మహిళా నేతగా కల్వకుంట్ల కవిత నిన్న ఆదివారం రికార్డు సృష్టించారు! ఈ రికార్డుతో సామాజిక మాధ్యమాల వినియోగంలో ఆమె ఒక ట్రెండ్ సెట్టర్ అయినట్లయింది. తన ట్విట్టర్ అకౌంట్ ప్రారంభం అయిన నాటి నుంచీ ఆమె తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు డిమాండును బలంగా వినిపించారు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేశారు. రక్తదానం, హెల్మెట్ ఆవశ్యకతపై ఇదే ట్విట్టర్ వేదికగా కవిత నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి దేశవ్యాప్త మద్దతు లభించింది. కరోనా లాక్డౌన్ కాలంలో, ఆ తర్వాత కూడా సాయం కోరుతూ దేశవిదేశాల నుంచి ట్వీట్ చేస్తున్న వారికి అండగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే.. ట్విట్టర్లో దేశవిదేశాల్లో అత్యధిక ఫాలోవర్లను కలిగిన దక్షిణాది మహిళా నేతలు దివ్య స్పందన, కనిమొళి, తమిళిసై సౌందర రాజన్, శోభా కరంగ్దలే తదితరులను దాటుకుని.. వన్ మిలియన్ ఫాలోవర్లతో కవిత అగ్రస్థానం లో నిలిచారు. మైలురాయి వంటి ఈ ప్రత్యేక సందర్భంలో తన సామాజిక మాధ్యమ ప్రస్థానంపై ‘తెలంగాణ జాగృతి’ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. మేల్కొలుపు వేదిక ‘‘సమానత్వ సాధనలో టెక్నాలజీ అత్యంత ముఖ్యమైన సాధనం. రాజకీయ రంగంలో టెక్నాలజీని ఎంత బాగా వినియోగించుకుంటే అంతగా ప్రజలకు చేరువ అవుతాం. ప్రజలకు ఏదైనా చెప్పాలనుకున్నా, ప్రజల అవసరాలు తీర్చాలన్నా టెక్నాలజీ ఒక మాధ్యమంగా పనిచేస్తుంది. గతంలో ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులను చేరుకోవాలంటే ఎన్నో అడ్డంకులు దాటుకుని వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ముఖ్యమంత్రి ట్విట్టర్ ఖాతాలో ఓ సందేశం పెడితే చాలు... క్షణాల్లో చేరుకుంటుంది. సోషల్ మీడియా ప్రస్తుతం సామాన్యుల చేతిలో ఓ బ్రహ్మాస్త్రం. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమం నుంచి వచ్చిన వాళ్లం కాబట్టి నిజజీవితంలో, సామాజిక మాధ్యమాల్లో ఒకేలా పారదర్శకంగా ఉంటాం. పుట్టినరోజు శుభాకాంక్షలు లాంటి వ్యక్తిగత విషయాలతో పాటు.. పండుగలు, ప్రభుత్వ విధానాలు, ప్రజలకు మేలు చేసే అంశాలు, వారిని మేల్కొలిపే విషయాలు తదితరాలను ప్రజలతో పంచుకుంటున్నా. ఆఫీసులో కూర్చుని ఎంత పనిచేస్తానో సోషల్ మీడియాలో కూడా అంతే ధ్యాసగా ప్రజాసమస్యలకు ప్రతిస్పందిస్తున్నా. బాధ్యతను పెంచింది 2010 నుంచి ట్విట్టర్ ఖాతాను వినియోగిస్తున్నా 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువ రిక్వెస్ట్‌లు వస్తున్నాయి. కరోనా సమయంలో ట్విట్టర్ ద్వారా వచ్చిన వినతులకు వివిధ దేశాలలో ఉన్న టీఆర్ఎస్, తెలంగాణ జాగృతి కార్యకర్తల ద్వారా ప్రపంచవ్యాప్తంగా సాయం అందించాం. ట్విట్టర్‌తో సాయం అందుతుందని, పనిచేస్తామని తెలియడంతో ఇటీవలి కాలంలో ఫాలోవర్ల సంఖ్య చాలా వేగంగా పెరిగింది. ట్విట్టర్లో అందే సందేశాలను ఒక క్రమపద్దతి లో అడ్రస్ చేస్తున్నాం. ఫాలోవర్ల సంఖ్య పది లక్షలకు చేరుకోవడంతో నా బాధ్యత మరింత పెరిగినట్లయింది. మహిళలకు, యువతకు కనెక్ట్ కావడానికి ప్రయత్నిస్తా. మంచి వాతావరణం మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నేతలు, అనుచరులతో తరచు సోషల్ మీడియాలో ఇంటరాక్షన్ జరుపుతుంటాం. మా అన్నయ్య కేటీఆర్‌తో ట్విట్టర్లో సరదా సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ రాజకీయాల్లో ఒక మంచి వాతావరణానికి దోహదం చేస్తాయి. పార్టీలకు అతీతంగా చాలా మందితో టచ్‌లో ఉంటాం. కొత్త టెక్నాలజీ వేల రెట్ల సామర్థ్యంతో దినదినాభివృద్ధి చెందుతోంది. టెక్నాలజీ, ఐటీ సంబంధిత రంగాలు.. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాకు సంబంధించిన చట్టాలు ఇంకా రావాలి. ప్రస్తుతం సైబర్ ప్రపంచంలో జరుగుతున్న నేరాలపై మాత్రమే చర్చ జరుగుతోంది. స్టాకింగ్, సైబర్ బుల్లీయింగ్ వంటి అంశాలను కూడా చర్చించాల్సి ఉంది. సోషల్ మీడియా రెగ్యులేషన్‌కూ చట్టాలు రావల్సిన అవసరం ఉంది’’ అని కవిత అన్నారు. – కల్వల మల్లికార్జున్‌రెడ్డి, సాక్షి, హైదరాబాద్ -
ఓడిపోతానని కష్టపడేదాన్ని
నటిగా సమంత భయాలేంటి? ఏ జానర్ సినిమాలు ఇష్టపడతారు? ఆమె పాటించే జీవిత సూత్రాలేంటి? అని ఫ్యాన్స్‌కు తెలుసుకోవాలని ఉంటుంది. బుధవారం సాయంత్రం ట్విట్టర్లో ‘ఏ ప్రశ్న అయినా అడగండి.. సమాధానం చెబుతాను’ అని ఫ్యాన్స్‌తో అన్నారు సమంత. అంతే.. ఫ్యాన్స్‌కి ఉన్న ప్రశ్నలన్నీ సమంత మీద కురిపించారు. అందులో కొన్నింటికి ఆమె సమాధానం చెప్పారు. అందులో కొన్నింటిని మీ కోసం తీసుకొచ్చాం. ► చాలా జానర్లలో సినిమాలు చేశారు. మీ ఫేవరెట్ జానర్ ఏది? సమంత: ఫేవరెట్ అంటూ ఏదీ లేదు. కానీ గత సినిమాలో ఏది చేశానో దాన్ని రిపీట్ చేయాలనుకోను. అదే చేస్తే ఆడియన్స్‌కు, నాకు బోర్ కొడుతుంది. ► ఈ కరోనా కష్టకాలంలో మీ అభిమానులకు ఏం సందేశమిస్తారు? ప్రస్తుతం అందరం కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. కొందరైతే చాలా కష్టాల్లో ఉన్నారు. ఈ కష్టకాలం త్వరగా గడచిపోవాలని, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ► లాక్డౌన్లో మీరు చేసిన మంచి పని ఏంటి? ఈ లాక్డౌన్లో ఓ స్పెషల్ ప్రాజెక్ట్ మీద పని చేశా. అదేంటో మీ అందరికీ త్వరలోనే చెబుతాను. అలాగే కుటుంబంతో ఎక్కువగా గడిపే అవకాశం దొరికింది. అదొక మంచి విషయం. ► కష్టపడి పని చేయడానికి మిమ్మల్ని మీరు ఎలా ప్రేరేపించుకుంటారు? ఇంతకు ముందు ఓడిపోతాం అనే భయంతో కష్టపడేదాన్ని. కానీ కరోనా వల్ల నా ఆలోచనా ధోరణి మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అందుకే నాకు సంతోషాన్ని ఇస్తాయి అనే విషయాలకు మాత్రమే కష్టపడాలనుకుని నిర్ణయించుకున్నాను. సంతోషంగా ఉండాలనే ఆలోచన నన్ను మోటివేట్ చేసేస్తుంది. కష్టపడేలా చేస్తుంది. ► జీవితం మెరుగు పడాలంటే ఏం చేయాలి? కచ్చితమైన డైట్ పాటించాలి. యోగా లేదా ధ్యానం లాంటివి చేయాలి. ప్రణాళికతో కూడిన దినచర్యను అలవాటు చేసుకోవాలి. ► ఎలాంటి పాత్రలు చేయడం కష్టంగా అనిపిస్తుంది? దర్శకుడు గౌతమ్ మీనన్‌ను కలిసే వరకూ రొమాన్స్ కష్టం అనుకున్నాను. నందినీ రెడ్డిని కలిసే వరకూ కామెడీ కష్టమనుకున్నా. కానీ ఇప్పుడు ఎలాంటి పాత్ర అయినా భయపడను. నటిగా నాకెలాంటి భయాల్లేవు. -
3 లక్షలు దాటిన డీజీపీ ఫాలోవర్లు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ ట్విట్టర్ హ్యాండిల్ అరుదైన ఘనత సాధించింది. ట్విట్టర్లో డీజీపీ ఫాలోవర్ల సంఖ్య గురువారంతో 3 లక్షలకు చేరుకుంది. ఈ విషయాన్ని డీజీపీ మహేందర్‌రెడ్డి ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఈ మైలురాయి అధిరోహించడం తమ బాధ్యతలను మరింత పెంచిందని వ్యాఖ్యానించారు. కాగా, అతి తక్కువ కాలంలోనే డీజీపీ ట్విట్టర్ హ్యాండి ల్ ప్రజలకు చేరువైంది. శాంతి భద్రతలతోపాటు, పోలీసు శాఖకు సంబంధించిన ఎలాంటి ఫిర్యాదునైనా డీజీపీ హ్యాండిల్‌కు ట్వీట్ చేయగానే వేగంగా స్పందిస్తారని ప్రతీతి. ప్రస్తుతం తెలంగాణ డీజీపీ 3 లక్ష ల ఫాలోవర్లతో దక్షిణ భారతదేశంలోని డీజీపీల్లో మొదటిస్థానంలో ఉన్నారు. -
దక్షిణాదిన మహేశ్ ఒకే ఒక్కడు
టాలీవుడ్ సూపర్‌స్టార్, మోస్ట్ హ్యాండ్సమ్ హీరో మహేశ్ బాబుకు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 40ల్లో కూడా పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తూ అందం విషయంలో మిగతా హీరోల కంటే ఓ మెట్టుపైనే నిలుస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇద్దరు పిల్లలు తండ్రి అయినప్పటికీ అమ్మాయిల్లో మహేశ్‌కు ఉండే క్రేజ్ మాటల్లో వర్ణించలేం. ఇక మహేశ్ సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటారు. ఆయన వ్యక్తిగత, కుటుంబ, సినిమాలకు సంబంధించి అనేక విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఇక ఈ లాక్డౌన్ సమయంలో ఇంటికే పరిమితైన మహేశ్ కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేలా, అందరిలో చైతన్యం కలిగించేలా పలు పోస్ట్‌లు చేసి తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. (బాధ్యతతో వ్యవహరించండి: మహేశ్) దీంతో సోషల్ మీడియాలో మహేశ్‌ను ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో మహేశ్ ఓ అరుదైన ఘనత సాధించారు. ట్విటర్లో 10 మిలియన్ల (కోటి) మంది ఫాలోవర్ల ప్రేమను సొంతం చేసుకున్నాడు (అంటే మహేశ్ కోటి మంది ఫాలవర్స్‌ను కలిగి ఉన్నాడన్నమాట). దీంతో దక్షిణాదిన కోటి మంది ట్విటర్ ఫాలోవర్స్ కలిగిన ఏకైన హీరోగా మహేశ్ పేరిట రికార్డు నమోదైంది. తమిళ స్టార్ హీరో ధనుష్ 9.1 మిలియన్ల ఫాలోయర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత కమల్ హాసన్ 6.1 , నాగార్జున 6 , రానా 6, రజనీకాంత్ 5.7, అల్లు అర్జున్ 4.7, జూనియర్ ఎన్టీఆర్ 4.2, విజయ్ దేవరకొండ 2.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. అయితే మహేశ్‌ను 10 మిలియన్ల మందిని ఫాలో అవుతుండగా అతడు మాత్రం కేవలం 31 మందినే ఫాలో అవుతున్నారు. ఇక ప్రస్తుతం మహేశ్ పరుశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రం చేస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తున్నారు. (హీరో మహేశ్ బాబు ఉదారత) Since the lockdown was eased, the cases seem to be going up. It's time we protect ourselves and the people around us. Always wear a mask when stepping out. Be aware of your surroundings, maintain social distancing… https://t.co/FOtgqxHBSc — Mahesh Babu (@urstrulyMahesh) June 29, 2020 -
ధనుష్‌ను బీట్ చేసిన మహేష్
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయనను అనుసరించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. తాజాగా మహేష్ ట్విటర్ ఫాలోవర్ల సంఖ్య 9 మిలియన్లు దాటింది. దీంతో సౌత్ ఇండియాలో 9 మిలియన్ల ట్విటర్ ఫాలోవర్లను సొంతం చేసుకున్న తొలి నటుడిగా మహేష్ నిలిచారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మహేష్.. తన కొత్త ప్రాజెక్టులతో పాటు, ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటారు. అలాగే ఇతర నటులకు విషెస్ చెప్పడంతోపాటు.. సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటారు. సినిమాల విషయానికి వస్తే.. సరిలేరు నీకెవ్వరు తర్వాత తను చేయబోయే సినిమా గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు చిరంజీవి–కొరటాల శివ కాంబినేషన్లో చేస్తున్న సినిమాలో మహేశ్ ఓ కీలక పాత్ర చేయనున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, సౌత్ ఇండియా నటుల్లో మహేష్ తర్వాత ధనుష్‌కు ట్విటర్లో 8.9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఆ తర్వాత సౌత్‌లో సమంతకు 7.8, శృతిహాసన్‌కు 7.5, మోహన్‌లాల్‌కు 5.9, నాగార్జునకు 5.9, రానాకు 5.8, శివకార్తికేయన్‌కు 5.8, రజనీకాంత్‌కు 5.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. -
ఆప్ జోరు, వైరల్ మినీ మఫ్లర్‌మ్యాన్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం దిశగా దూసుకుపోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తమ విజయాన్ని ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటోంది. స్మైలీ ఫేస్ ఎమోజీతో ‘మఫ్లర్‌మాన్’ పేరుతో ఒక బుడతడి ఫోటోను షేర్ చేసింది. ఆప్ ట్రేడ్ మార్క్ మఫ్లర్, టోపీ ధరించి, అచ్చం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లా వున్న ఒక పసిబిడ్డ ఫోటోను ట్విటర్లో షేర్ చేసింది. దీంతో అభిమానుల లైక్‌లతో పాటు కమెంట్లు, అభినందనల వెల్లువ కురుస్తోంది. ఆప్ షేర్ చేసిన మినీ మఫ్లర్ మాన్ ఫోటో వైరల్ అవుతోంది. ప్రధానంగా "నేను కేజ్రీవాల్...కానీ నేను ఉగ్రవాదిని కాదు’ అని ఒక యూజర్ వ్యాఖ్యానించగా, మరో యూజర్ ఆప్‌కు ఓట్లు వేసిన ఢిల్లీ ఓటర్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇది భారతదేశం ఆత్మను, సారాన్ని రక్షించడానికి ప్రజల స్పష్టమైన తీర్పు అని, విద్య, ఆరోగ్య సంరక్షణకు వేసిన ఓటు. హిందుస్తాన్, పాకిస్తాన్ కోసం కాదు..స్థిరత్వం కోసం ఢిల్లీ ప్రజలు ఓటు వేశారని వ్యాఖ్యానించారు. ఏదో ఒకరోజు అతనే సీఎం అని మరొకరు పోస్ట్ చేయడం విశేషం. Mufflerman 😄 pic.twitter.com/OX6e8o3zay — AAP (@AamAadmiParty) February 11, 2020 He will be the CM one day. 😍#DelhiResults Mophlar Men pic.twitter.com/oFrpjKgQY4 — Pramod Gupta (@PramodG96346806) February 11, 2020 -
ప్రధాని మోదీ తరువాత బిగ్‌బీనే
సాక్షి, న్యూఢిల్లీ: ట్విటర్లో అత్యంత చురుకైన బాలీవుడ్ సెలబ్రిటీలలో ఒకరైన అమితాబ్ బచ్చన్ (77) మరో మైలురాయిని అధిగమించారు. గురువారం నాటికి ట్విటర్లో ఈ బాలీవుడ్ మెగాస్టార్ ట్విటర్ ఫాలోవర్ల సంఖ్య 40 మిలియన్లను దాటేసింది. అంతేకాదు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న భారతీయ ప్రముఖుల్లో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (50 మిలియన్ల) తరువాత రెండవ వ్యక్తిగా ఆయన నిలిచారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో కూడా చురుగ్గా వుండే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, బిగ్‌బీ పై అభినందనల వెల్లువ కురుస్తోంది. బిగ్‌బీకి ఫేస్బుక్లో 27.9 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 14.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉండటం విశేషం. కాగా బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ 39.4 మిలియన్ల మంది ఫాలోవర్లతో మూడవ స్థానంలో ఉన్నారు. బి-టౌన్లో వాణిజ్యపరంగా విజయవంతమైన నటులలో ఒకరైన అక్షయ్ కుమార్ 33.7 మిలియన్ల ఫాలోవర్లను తన ఖాతాలో జోడించుకున్నారు. మరోవైపు సల్మాన్ ఖాన్ కూడా త్వరలో 40 మిలియన్ల బెంచ్ మార్కును చేరుకోనున్నారు. BAADDDUUMMBBAAAA ! Shahenshah Of Indian Cinema #AmitabhBachchan sir Hits 40 Million Followers On Twitter 👏🏻#AB40MillionOnTwitter @SrBachchan Heartiest Congratulations Sir , wish you many more... 🌸🌷🌷👏🏻💕💕 pic.twitter.com/l9qoo3MKLh — Sաɛta Pʀasad ɛғ™ (@SwetaLoveAB) February 6, 2020 -
జపాన్ కుబేరుడు సంచలన నిర్ణయం
టోక్యో : జపాన్ కుబేరుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని అత్యధిక ధనవంతుడు, ఫ్యాషన్ డిజైన్ ఇండస్ట్రీ దిగ్గజం యుసాకు మేజావా తన ఫాలోవర్స్‌కి ఏకంగా రూ. 64.36 కోట్లు పంచిపెట్టడం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇలాంటి నిర్ణయం ఎందుకో తెలిస్తే ఆశ్యర్యం కలుగుతుంది. సోషల్ మీడియాలో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ఆయన తన ట్విటర్లో అనుచరులు వెయ్యిమందికి ఈ నగదును పంచిపెట్టనున్నారు. 6.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న యుసాకు మేజావా జనవరి 1వ తేదీన ట్విటర్లో తన పోస్ట్‌ను రీట్వీట్ చేసిన వెయ్యిమంది ఫాలోవర్స్‌ను ఎంపిక చేసి వారికి 9 మిలియన్ డాలర్లు ( సుమారు రూ .64.36 కోట్లు) అందజేయనున్నామని ప్రకటించడం విశేషం. జపాన్ లో రెండవ అతిపెద్ద షాపింగ్ సంస్థ జోజో ఇంక్ వ్యవస్థాపకుడైన యుసాకు చేసిన ఈ ట్వీట్ రికార్డు స్థాయిలో 3.8 మిలియన్ల షేర్లను సాధించింది. 9 లక్షలకుపై పైగా లైక్‌లు కొట్టేసింది. అంతేకాదు జనవరి 7 నాటికి అత్యధిక సార్లు రీట్వీట్ అయిన ట్వీట్‌గా నిలిచింది. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ (బీఐ) భావనను నిశితంగా అర్థం చేసుకోవడంలో భాగమే ఈ ప్రయత్నమని యుసాకు మేజావా ట్విటర్లో వివరించారు. తాను పెద్ద రాజకీయ నాయకుడిని కానందున ప్రజల కనీసం ఆదాయంపై ఇంతకుమించి తానేమీ చేయలేనని వరుస ట్వీట్లలో చెప్పుకొచ్చారు. అంతేకాదు జపాన్ ప్రభుత్వం, కనీస ఆదాయ పథకాన్ని...అంటే ప్రతి నెలా పౌరులకు నిర్ణీత మొత్తాన్ని చెల్లించే ఒక విధానం ప్రవేశ పెట్టవలసిన అవసరాన్ని వివరించారు. మరోవైపు అమెరికా అధ్యక్ష అభ్యర్థి ఆండ్రూ యాంగ్ఇ లాంటి పథకాన్ని ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. తాను ఎన్నికైతే 18 ఏళ్లలోపు ప్రతి వయోజన అమెరికన్‌కు నెలకు వెయ్యి డాలర్లు ఇస్తానని వాగ్దానం చేశారనీ, ఆయననే యుసాకా ఫాలో అయ్యారని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు. కాగా మేజావా ఇటీవల 2023లో ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్లో చంద్రయానానికి సంతకం చేసిన మొదటి ప్రైవేట్ ప్రయాణీకుడిగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తో యుసాకు (ఫైల్ ఫోటో) -
హాయిగా నవ్వండి
నవ్వు మంచి మెడిసిన్ అంటుంటారు. ఆ మెడిసిన్‌ను ప్రతిరోజూ తీసుకోమంటున్నారు కాజల్ అగర్వాల్. తన ట్వీటర్ ఫాలోయర్స్ 30 లక్షలకు చేరుకున్న సందర్భంగా నెటిజన్లతో చాట్ చేశారు కాజల్. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ‘మీరు నవ్వినప్పుడు చాలా అందంగా ఉంటారు. అలా స్వచ్ఛంగా నవ్వడానికి మీ రహస్యం ఏమిటి?’ అని ఓ నెటిజన్ ప్రశ్నించగా, ‘‘మనలోని అంతరాత్మకు మన నవ్వు ఒక ప్రతిబింబమని నేను నమ్ముతాను. నిజాయతీ గల నవ్వు మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇతరులకు మన పట్ల సద్భావం కలిగేలా చేస్తుంది. నవ్వును ఓ అలవాటుగా మార్చుకోవడానికి రోజూ నవ్వుతూ సంతోషంగా ఉండండి’’ అని బదులు ఇచ్చారు. ‘‘పెళ్లి వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. వివాహ బంధానికి నేను రెడీగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటాను’’ అని పెళ్లి గురించి ఓ ఫాలోయర్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ప్రస్తుతం ‘కాల్ సెంటర్, ఇండియన్ 2, ముంబై సాగ’ సినిమాలతో కాజల్ ఫుల్ బిజీగా ఉన్నారు. -
అజయ్ ప్రవర్తనపై మండిపడిన నెటిజన్లు
న్యూఢిల్లీ : 'హమ్ హిందూ' వ్యవస్థాపకుడు అజయ్‌గౌతమ్ ముస్లిం యాంకర్‌ను చూడలేనంటూ ముఖానికి చేతులు అడ్డుపెట్టుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు ట్విటర్ వేదికగా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఇటీవల జొమాటో ఫుడ్ డెలివరీ విషయమై తలెత్తిన వివాదంపై చర్చించేందుకు అజయ్ గౌతమ్‌ను ఒక న్యూస్ చానెల్ ఆహ్వానించింది. చర్చల సందర్భంగా న్యూస్ యాంకర్ ఖలీద్‌ను చూడగానే కావాలనే తన చేతులను ముఖానికి అడ్డుపెట్టుకోవడం టీవీలో స్పష్టంగా కనిపించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న న్యూస్ ఎడిటర్ అనురాధప్రసాద్ అతని చర్యలతో ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంకెప్పుడు అజయ్‌ను ఏ చర్చలకు తమ చానెల్‌కు పిలవదని స్పష్టంచేశారు. కాగా, ముస్లిం రాజకీయాలకు వ్యతిరేకంగా సంపూర్ణ హిందూ రాష్ట్రాన్ని సాధించే లక్ష్యంతో అజయ్ గౌతమ్ 2015లో 'హమ్ హిందూ' ఆర్గనైజేషన్‌ను స్థాపించాడు. we at the newsroom of @news24tvchannel are in shock at the inappropriate & condemnable behaviour of Mr Ajay Gautam . Ethics of journalism do not allow to give platform to such devisive voices & gestures . @news24tvchannel has decided not to invite Mr Ajay Gautam to its studio .— Anurradha Prasad (@anurradhaprasad) August 1, 2019 Hindu leader Ajay Gautam was on a debate show & covered his eyes so he didn't have to see Khalid, a Muslim news presenter. This is NOT SATIRE! This is the state of national TV in #India in 2019. pic.twitter.com/lxqYzhxjMu — omer (@intellectroll) August 1, 2019 -
ట్విట్టర్లో టాప్!
నగర పౌరులు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న పోస్టులకు ఉన్నత స్థాయిలోని వారూ తమ తప్పును ఒప్పుకోక తప్పని పరిస్థితి. కొద్దినెలల క్రితం శేరిలింగంపల్లి జోన్లో పర్యటన సందర్భంగా మేయర్ వాహనం నో పార్కింగ్ ఏరియాలో ఆపడాన్ని ఫొటో తీసి ట్విట్టర్లో ఉంచారు. దీంతో ఆయన చలానా చెల్లించారు. ఇటీవల జీహెచ్ఎంసీ కమిషనర్ కారు వేగంగా ప్రయాణం చేసినందుకు ట్రాఫిక్ విభాగం జారీ చేసిన చలాన్లు పెండింగ్‌లో ఉండటం ట్విట్టర్లో హల్చల్ సృష్టించింది. దీంతో కమిషనర్ చలానా సొమ్ము చెల్లించడంతోపాటు ఇకపై వేగంగా నడపొద్దంటూ డ్రైవర్లను హెచ్చరించారు. సాక్షి, హైదరాబాద్: ఇలా వివిధ సమస్యలపై ఫిర్యాదులు చేయడానికి నగరవాసులు ట్విట్టర్‌ను ప్రధాన వేదికగా చేసుకుంటున్నారు. దేశంలోనే అత్యధిక మంది ఫాలో అవుతున్న సంస్థల్లో జీహెచ్ఎంసీ తొలి స్థానంలో ఉంది. ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ)లో భాగంగా జీహెచ్ఎంసీ ఈ–ఆఫీస్‌ను అమల్లోకి తెచ్చింది. అలాగే భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ, బర్త్ సర్టిఫికెట్లనూ ఆన్లైన్లోనే నిర్వహిస్తోంది. ఇక ఫిర్యాదుల కోసం ‘మైజీహెచ్ఎంసీ’యాప్‌ను అందుబాటులోకి తెచ్చి.. ట్విట్టర్ అకౌంట్‌ను ప్రారంభించింది. జీహెచ్ఎంసీతో పాటు మేయర్, కమిషనర్, జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఆయా విభాగాధిపతులకు సైతం ట్విట్టర్ ఖాతాలున్నాయి. జీహెచ్ఎంసీకి వివిధ మాధ్యమాలతోపాటు ట్విట్టర్ ద్వారా ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయి. జీహెచ్ఎంసీ ట్విట్టర్‌ను ఫాలో అవుతున్నవారు లక్ష మంది కంటే ఎక్కువే ఉండటం గమనార్హం. తమ ఈ ఫిర్యాదులను జీహెచ్ఎంసీ అకౌంట్‌తోపాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మేయర్ రామ్మోహన్, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ కమిషనర్ల ఖాతాలకు కూడా పోస్ట్ చేస్తున్నారు. ఫిర్యాదు ఎప్పుడు పోస్ట్ చేసిన తేదీ, సమయంతో సహా తెలుస్తుండటంతో అధికారులు వీలైనంత త్వరగా స్పందించి.. పరిష్కరిస్తున్నారు. దేశంలోని మిగతా నగరాల కంటే జీహెచ్ఎంసీని ట్విట్టర్లో ఫాలో అవుతున్నవారే ఎక్కువ. నగరంలోని ఇతర ప్రభుత్వ విభాగాలతో పోల్చిచూసినా, జీహెచ్ఎంసీనే ఎక్కువ మంది అనుసరిస్తున్నారు. కాగా, కార్పొరేషన్ ఫేస్‌బుక్‌ను ఫాలో అవుతున్నవారు 47,087 మంది ఉన్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో భాగంగా ట్విట్టర్‌తోపాటు జీహెచ్ఎంసీ ఫేస్బుక్, మైజీహెచ్ఎంసీ యాప్, ఈ–మెయిల్స్, ప్రజావాణి ద్వారా అందే ఫిర్యాదులతోపాటు నేరుగా నాకందే వాటిని కూడా పరిష్కరిస్తున్నాం. – దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ బెంగళూర్, పుణే తదితర నగరాల కంటే జీహెచ్ఎంసీకి ఎక్కువ మంది ఫాలోవర్లు ఉండటం అభినందనీయం. ఎక్కువ మంది సోషల్ మీడియాను వాడుతుండటమే కాక సమస్యల పరిష్కారానికి కూడా వినియోగించుకుంటున్నారు. – అరవింద్‌కుమార్, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ -
గర్ల్‌ఫ్రెండ్ మోసం చేసిందా?
‘సరదాగా నన్ను ఏమైనా అడగండి’ అంటూ నెటిజన్లకు నిధీ అగర్వాల్ ఆఫర్ ఇచ్చింది. అంతే.. కొంటె ప్రశ్నలు, సీరియస్ క్వొశ్చన్స్తో ఆమె ట్వీటర్ ఫాలోయర్స్ నిధీ నుంచి సమాధానాలు రాబట్టారు. వాటిలో ‘నా గర్ల్‌ఫ్రెండ్ నన్ను చీట్ (మోసం) చేసింది. వదిలేసింది?’ అని ఒక ఫాలోయర్ అడిగితే – ‘‘చీటర్ లేని జీవితం చాలా బాగుంటుంది మై ఫ్రెండ్’’ అని సమాధానం ఇచ్చింది నిధి. మోసం చేసినవాళ్ల గురించి బాధపడకూడదని చాలా షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పింది కదూ. ఇంకో ప్రశ్నకు సమాధానంగా ‘‘చిన్నప్పుడు నేను రబ్బర్లు, జర్నీ టికెట్స్‌ని దాచుకునేదాన్ని. ఇప్పుడు ‘ఇయర్ రింగ్స్’ కలెక్ట్ చేస్తున్నా. చెవి పోగులంటే నాకంత పిచ్చి’’ అని చెప్పింది. ‘‘రాత్రిపూట నీళ్లలోకి వెళ్లడం నాకు భయం’’ అని తనకున్న ఫోబియాని బయటపెట్టింది నిధి. బయాలజీ, ఎకనామిక్స్ సబ్జెక్ట్స్ అంటే ఇష్టం అని, ఇడ్లీ, పెరుగన్నం ఇష్టంగా తింటానని తన అభిరుచులు చెప్పింది. ఇలా అభిమానుల ప్రశ్నలకు సమాధానాలివ్వడం ఆనందంగా అనిపించిందని పేర్కొంది నిధీ అగర్వాల్. -
ప్రేమిస్తూనే ఉంటా
సోషల్ మీడియాలో ఫుల్ అప్డేటెడ్గా ఉంటారు మహేశ్‌బాబు. తన ఆలోచనలను పంచుకుంటూ, అభిమానులకు అందుబాటులో ఉంటారాయన. తాజాగా ట్వీటర్లో ఓ మైలురాయిని దాటారు మహేశ్. దాదాపు 7మిలియన్ (70 లక్షల) మంది ట్వీటర్లో మహేశ్‌ను ఫాలో అవుతున్నారు. ‘‘మీ అందరి సపోర్ట్‌కి ఎప్పడూ రుణపడి ఉంటాను. మీ అందర్నీ ప్రేమిస్తూనే ఉంటాను’’ అని తన 7 మిలియన్ ఫాలోయర్స్‌తో ఆనందాన్ని షేర్ చేసుకున్నారాయన. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమాలో నటిస్తున్నారు మహేశ్‌బాబు. ఈ నెల 18న ఈ చిత్రం అమెరికా షెడ్యూల్ స్టార్ట్ కానుంది. -
ట్విటర్లో ప్రధాని మోదీకి ఝలక్!
న్యూఢిల్లీ : ప్రపంచంలో చాలామంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు భారీ సంఖ్యలో ట్విటర్ ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వినియోగం భారీగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో ట్విటర్లో అత్యధిక ఫాలోవర్స్ కలిగి వుండటాన్ని ప్రముఖులు ప్రతిష్టాత్మకంగానూ తీసుకుంటున్నారు. అయితే, ఈ మధ్యన పలువురు ప్రముఖులకు ట్విటర్ ఫాలోవర్స్ భారీగా తగ్గిపోయారట. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి వారు భారీగా ట్విటర్ ఫాలోవర్స్‌ను కోల్పోయినట్టు తెలిసింది. తాజా రిపోర్టు ప్రకారం ప్రధాని మోదీ ట్విటర్ ఫాలోవర్స్ 43.4 మిలియన్ నుంచి 43.1 మిలియన్‌కు పడిపోయినట్టు వెల్లడైంది. కేవలం మన దేశ రాజకీయవేత్తలే కాకుండా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ దేశ మాజీ తొలి మహిళ హిల్లరీ క్లింటన్లు కూడా భారీ ఎత్తున్న ట్విటర్ యూజర్లను నష్టపోయారని తెలిసింది. దీనికంతటికీ కారణం ట్విటర్ ఇటీవల తన మైక్రోబ్లాగింగ్ సైట్లో ఫేక్ అకౌంట్లను డిలీట్ చేయడమే. ట్విటర్ ఫేక్ అకౌంట్లను, ఫాలోవర్స్‌ను తొలగించడంతో, వీరికి ఫాలోవర్స్ తగ్గిపోయారు. బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్లు, టాలీవుడ్ నటుడు మహేష్ బాబు కూడా పెద్ద ఎత్తున్న ట్విటర్ ఫాలోవర్స్‌ను కోల్పోయినట్టు రిపోర్టులు వెల్లడించారు. ‘గత ఏడాదంతా టెక్నాలజీ, మెరుగైన ప్రక్రియలను చేపడటంతో మా స్పామ్ విధానాలను ఉల్లంఘిస్తున్న 214 శాతానికి పైగా అకౌంట్లను నిర్మూలిస్తున్నాం. మేము అభివృద్ధి చేసిన కొత్త ప్రొటెక్షన్లు రోజుకు 50,000 కంటే ఎక్కువ స్పామ్ సైన్అప్లను నిరోధించడంలో మాకు సహాయపడ్డాయి’ అని ట్విటర్ అధికార ప్రతినిధి చెప్పారు. తాజాగా విడుదలైన రిపోర్టుల ప్రకారం తొలగిస్తున్న ఈ అకౌంట్లతో ట్విటర్ వ్యాపారాలు, కంపెనీ షేర్లు ప్రభావితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 3.1 బిలియన్ డాలర్లు పడిపోయే అవకాశం ఉంది. తాము తొలగించిన అకౌంట్లలో గత 30 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజుల నుంచి వాడనవే ఉన్నాయని తెలిసింది. -
నా ఫ్యామిలీ మూడు మిలియన్లు : నాని
తన సహజమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసే హీరో నేచురల్ స్టార్ నాని. పాత్ర ఎలాంటిదైనా సరే తన సహజత్వంతో ఆ క్యారెక్టర్‌ను పండించగల హీరో నాని. ప్రస్తుతం ఈ హీరో వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ఈ మధ్య నాని ద్విపాత్రాభినయం చేసిన కృష్ణార్జున యుద్దం సినిమా ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినా ఈ సినిమాలో కృష్ణ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం నాని బిగ్‌బాస్ రెండో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. నాని సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు నిత్యం టచ్‌లో ఉంటారు. అయితే తాజాగా తన ట్విటర్ ఫాలోవర్స్ మూడు మిలియన్లుకు చేరుకోవడంతో నాని ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ‘నా కుటుంబం మూడు మిలియన్లకు చేరుకుంద’ని ట్వీట్ చేశారు. నాని ప్రస్తుతం నాగార్జునతో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నారు. My family is now 3 million strong 😊 — Nani (@NameisNani) June 12, 2018 -
కష్టపడు.. లేకపోతే ఇంటికెళ్లిపో!
‘హాయ్.. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తా’ అంటూ ట్వీటర్లో తనను ఫాలో అవుతున్నవాళ్లకు మంచి చాన్స్ ఇచ్చారు శ్రుతీహాసన్. అంతే.. ఆమెకు ప్రశ్నల మీద ప్రశ్నలు వచ్చాయి. వాటిలో ఆసక్తికరమైన కొన్ని ప్రశ్నలు–జవాబులు. ► చెన్నైలో మీకు ఇష్టమైన ప్లేస్? మా నాన్న అండ్ పియానో ఎక్కడుంటే అది నాకు ఇష్టమైన ప్లేస్. ► మీరు ఏ వస్తువు లేకపోతే జీవించలేరు? ఫోన్. ► మిమ్మల్ని బాగా విమర్శించేవారు ఎవరు? నేనే. ► మీకు నేను (ఫ్యాన్) ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు? నో.. ఐ యామ్ సారీ అని చెప్తాను. ► ట్రెడిషనల్ ఆర్ మోడ్రన్ డ్యాన్స్. వీటిలో ఏది ఇష్టం? రెండూ ఇష్టం. ► మీ నాన్నగారు స్థాపించిన పార్టీలో చేరి ప్రజా సేవ చేస్తారా? నా జ్ఞానం, నా అనుభవం సమాజంలో పాజిటివ్ చేంజ్ తీసుకురాగలదు అని నేను నమ్మినప్పుడు తప్పకుండా వస్తా. ► మీరు నటించే నెక్ట్స్ బాలీవుడ్ మూవీ టైటిల్ ఏంటి? ఇంకా డిసైడ్ కాలేదు. ► ఏ వస్తువు తయారు చేయకుండా ఉండి ఉంటే బాగుండేదని అనుకుంటున్నారు? గన్స్. ► క్లాసులు ఎగ్గొట్టి బయట తిరుగుతున్నప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారా? అవును. ► ఖాళీ సమయాల్లో ఏం చేస్తారు? పెయింటింగ్ అండ్ రీడింగ్. ► మీ మోటివేషన్ లైన్ ఏంటీ? కష్టపడు. లేకపోతే ఇంటికెళ్లిపో. ► ప్రపంచంలోనే ఏదైనా చేంజ్ చేయగల శక్తి మీకు వస్తే ఏం చేస్తారు? మహిళలు, చిన్నారులకు హాని చేయాలనుకునే వారి మైండ్‌సెట్‌ను మార్చేస్తా. ► మీరు బ్యాడ్ మూడ్‌లో ఉన్నప్పుడు అందులోంచి బయటకు తీసుకొచ్చేదెవరు? నా చెల్లెలు అక్షరాహాసన్. ► మీ జీవితంలో అద్భుతమైన క్షణాలు? నా చెల్లి పుట్టినప్పుడు. ► ఆర్టిస్ట్ కాకపోయి ఉంటే ఏం చేసేవారు? మ్యుజిషియన్. ► లవ్ మ్యారేజ్ లేదా అరేంజ్డ్ మ్యారేజ్. దేన్ని ప్రిఫర్ చేస్తారు? లైఫ్‌లో నాకు అన్నీ అరేంజ్ చేయడానికి ఒక మనిషిని నేను ఏర్పాటు చేసుకోలేదు. అలాంటప్పుడు నేనెందుకు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలి.