చెన్నై: తమిళనాట రాజకీయ పరిస్థితులు అటు మీడియా, ఇతర రాష్ట్రాల ప్రజలు, తమిళ పార్టీలకు మాత్రమే చెందిన కేడర్ వర్గాలు తప్ప అక్కడి సామాన్య ప్రజానీకానికి ఎలాంటి ఉత్కంఠను కలిగించడం లేదని తెలుస్తోంది. ముఖ్యమంత్రి పీఠం నీకా నాకా అంటూ శశికళ, పన్నీర్‌సెల్వం తగువులాడుకుంటుండా నిత్యం అమ్మా అమ్మా అంటూ కలవరించే కొంతమంది తమిళ తంబీలు మాత్రం ఏం చక్కా ఎంజాయ్ చేస్తున్నారు. మొన్నటి వరకు కేంద్రంపై, సుప్రీంకోర్టుపై పోరాడి తెచ్చుకున్న తమ సాంప్రదాయ క్రీడ జల్లికట్టుతో సేద తీరుతున్నారు.
వీరెవ్వరూ తమిళ రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని ఈ ఆట జరుగుతున్న తీరు చూస్తుంటే ఇట్టే అర్థమవుతోంది. ‘సూపర్ సూపర్ సూపర్.. ఈ ఎద్దును ఎవరు బందించగలిగితే ఈ సిల్క్ చీర ఉచితం అంటూ గట్టిగా కేకలు.. 19 నుంచి 25 వయసుగలవారు రంకెలేస్తూ కొమ్ములు విసురుతూ దూసుకొస్తున్న నందులను అణిచివేసేందుకు వాటి వెనుక సవారీ చేస్తూ దూసుకెళుతున్నారు. జల్లికట్టుకు ప్రసిద్ధిగాంచిన మధురై, అలంగనల్లూర్ ప్రాంతాల్లో జల్లికట్టు జరుగుతోంది. ఇదే సమయంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
సాధారణంగా జల్లికట్టు క్రీడను తొలుత ముఖ్యమంత్రి ప్రారంభించాలి. ఆ లెక్కన ప్రస్తుతం అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం దానికి పచ్చజెండా ఊపాలి. అలాగే, ఆయా నియోజవర్గాల స్థాయిలో పలువురు ఎమ్మెల్యేలు ఈ క్రీడను ప్రారంభించి ప్రజలతో సరదాగా గడపడం ఆనవాయితీ. ప్రస్తుత రాజకీయ అనిశ్చితి ఏర్పడిన నేపథ్యంలో ఈసారి గతంలో ఎన్నడూ లేనిది మధురై జల్లికట్టుకు స్టాలిన్ హాజరై ప్రారంభించాడు. అలాగే, ఇంకొన్ని చోట్లకు కూడా స్టాలిన్ మాత్రమే వెళ్లాడు.
దీంతో ప్రజలు ఇక అన్నాడీఎంకేను పక్కకు పెట్టి తమ ఆలోచనలు డీఎంకే వైపు మళ్లిస్తున్నారేమో అనే అనుమానం కలుగుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాగే, పార్టీ గొడవ అయినందున వాళ్లే తేల్చుకుంటారని, ఆ గొడవతో తమకెందుకనే రీతిలో కూడా పోరాటాలు చేసే సామాన్య ప్రజానీకం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఏం చక్కా వాళ్లు జల్లికట్టుతో ఎంజాయ్ చేస్తున్నారు.