‘ఆదర్శ్’లో చవాన్ కుమ్మక్కు | Ashok chavan role in Adharsh scam | Sakshi
Sakshi News home page

‘ఆదర్శ్’లో చవాన్ కుమ్మక్కు

Published Sun, Dec 22 2013 1:29 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

‘ఆదర్శ్’లో చవాన్ కుమ్మక్కు - Sakshi

‘ఆదర్శ్’లో చవాన్ కుమ్మక్కు

షిండే, దేశ్‌ముఖ్, నీలంగేకర్ కూడా తప్పులు చేశారు
జ్యుడీషియల్ దర్యాప్తు కమిటీ నివేదికలో వెల్లడి


  ‘ఆదర్శ్’ హౌసింగ్ సొసైటీ కేటాయింపుల్లో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, ఈ కేటాయింపుల ద్వారా లబ్ధి పొందిన ఆయన సమీప బంధువులు కుమ్మక్కుకు పాల్పడ్డారని ఈ కుంభకోణంపై దర్యాప్తు జరిపిన జ్యుడీషియల్ కమిటీ తేల్చి చెప్పింది. ‘ఆదర్శ్’ కుంభకోణంపై దర్యాప్తు కోసం 2011లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇద్దరు సభ్యుల జ్యుడీషియల్ కమిటీ, 891 పేజీల నివేదికను సమర్పించింది. ఈ నివేదిక శుక్రవారం మహారాష్ట్ర శాసనసభ ముందుకురాగా, మహారాష్ట్ర కేబినెట్ దీనిని తోసిపుచ్చింది. కాగా, ఈ వ్యవహారంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, సుశీల్‌కుమార్ షిండే, శివాజీరావు నీలంగేకర్ పాటిల్‌ల చర్యలను కూడా జ్యుడీషియల్ కమిటీ తప్పుపట్టింది.

దక్షిణ ముంబై లో ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ చేపట్టిన 31 అంతస్తుల భవన సముదాయం నిర్మాణం పారదర్శకంగా జరగలేదని, దీనికి అనుమతుల మంజూరులో ‘క్విడ్ ప్రో కో’ జరిగిందని వెల్లడించింది. చవాన్ హయాంలో (2008 డిసెంబర్-2010 నవంబర్) ఆయన సన్నిహిత బంధువులు ముగ్గురికి ఆదర్శ్ హౌసింగ్ సొసైటీలో సభ్యత్వం లభించినట్లు తెలిపింది. జ్యుడీషియల్ కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం... చవాన్ రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు 2002లో ‘ఆదర్శ్’ సొసైటీలో 40 శాతం మంది సాధారణ పౌరులకు కూడా సభ్యత్వం కల్పించాలని సొసైటీని కోరారు. నిజానికి ఇది పూర్తిగా మాజీ సైనికోద్యోగుల కోసం ఏర్పడింది. ఇందులోని సభ్యత్వ ప్రక్రియను, చవాన్ మంజూరు చేసిన అనుమతులను పరిశీలిస్తే ‘క్విడ్ ప్రో కో’ జరిగినట్లు తేటతెల్లమవుతోంది. ‘ఆదర్శ్’ సొసైటీలో సభ్యత్వం సాధారణ ప్రజలకు అందుబాటులో లేకుండా, మాజీ ఎమ్మెల్సీ దివంగత కన్హయ్యాలాల్ గిద్వానీ, రక్షణశాఖ అధికారి ఆర్.సి.ఠాకూర్ వంటి కొద్దిమంది బడా వ్యక్తుల కోటరీ చేతుల్లోనే ఉంది. సొసైటీకి కొత్త సభ్యులను ప్రతిపాదించడంలో వారు కీలకమైన, ప్రభావవంతమైన పాత్ర పోషించారు.

సభ్యుల పేర్ల ప్రతిపాదనలో వారి మాటే చలామణీ అయ్యేది. మాజీ ముఖ్యమంత్రి దివంగత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కూడా ఈ వ్యవహారంలో తప్పటడుగులు వేశారు. ‘ఆదర్శ్’ నిర్మాణానికి దేశ్‌ముఖ్ అదనపు ఎఫ్‌ఎస్‌ఐకి (ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్-నిర్మాణ హక్కు) అనుమతి మంజూరు చేశారు. అయితే, దేశ్‌ముఖ్‌కు ముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన సుశీల్‌కుమార్ షిండే (ప్రస్తుత కేంద్ర హోంమంత్రి) ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశ్‌ముఖ్ సొసైటీ ప్రమోటర్లకు రాసిన లేఖ (లెటర్ ఆఫ్ ఇంటెంట్) కూడా విమర్శలకు దారితీసింది. అదనపు ఎఫ్‌ఎస్‌ఐకి అనుమతి మంజూరులో దేశ్‌ముఖ్ హేతుబద్ధతను గాలికొదిలేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆయన నిర్ణయం పూర్తిగా అసమంజసమని జ్యుడీషియల్ కమిటీ తప్పుపట్టింది. మాజీ ముఖ్యమంత్రి నీలంగేకర్ పాటిల్ (1985-86లో పది నెలలు సీఎంగా పనిచేశారు), గత దశాబ్దంలో కొద్దికాలం రెవెన్యూ మంత్రిగా కూడా పనిచేశారు. నీలంగేకర్‌తో పాటు షిండే ‘ఆదర్శ్’ సొసైటీ గృహ సముదాయం కోసం స్థలం కేటాయింపులో పొరపాట్లు చేసినట్లు జ్యుడీషియల్ కమిటీ స్పష్టం చేసింది. భూమి విలువపై ఆర్థికశాఖ చేసిన సూచనలను షిండే ఏమాత్రం పట్టించుకోలేదని, స్థలం కేటాయింపు కోసం కేబినెట్ ఆమోదం పొందడంలోనూ ఆయన విఫలమయ్యారని తెలిపింది. ‘ఆదర్శ్’ నిర్మాణానికి అనుమతులు మంజూరైన కాలంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన నీలంగేకర్ పాటిల్ సొసైటీకి స్థలం కేటాయింపు అనుమతి మంజూరు విషయంలో అనవసర ఆత్రాన్ని ప్రదర్శించారని ఎత్తిచూపింది.

 అదో చేదు ఘట్టం: మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్

 ‘ఆదర్శ్’ కుంభకోణాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఒక చేదు ఘట్టంగా అభివర్ణించారు. అయితే, దీనిపై జ్యుడీషియల్ కమిటీ నివేదికను తోసిపుచ్చాలన్నది కేబినెట్ నిర్ణయమని ఆయన చెప్పారు. కుంభకోణం చోటు చేసుకున్నప్పటి నుంచి... నాయకత్వ మార్పునకు దారి తీసేంత వరకు... మొత్తం వ్యవహారమంతా చేదు ఘట్టమేనని ఆయన అన్నారు. అయితే, నలుగురు మాజీ ముఖ్యమంత్రులను అభిశంసించిన జ్యుడీషియల్ కమిటీ నివేదికను ఎందుకు తిరస్కరించారని ప్రశ్నించగా, బదులిచ్చేందుకు నిరాకరించారు. జ్యుడీషియల్ కమిటీ నివేదికను తిరస్కరించడం వల్ల ఎలాంటి పరిణామాలు తలెత్తగలవని ప్రశ్నించగా, అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తనకు తెలియదని, జరిగిందేదో జరిగిపోయిందని బదులిచ్చారు. ఇదిలా ఉండగా, ‘ఆదర్శ్’ దోషులపై చర్యలు తీసుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా నివేదికను రూపొందించగా, రాష్ట్ర కేబినెట్ దానిని తోసిపుచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. దానికి బదులుగా, జ్యుడీషియల్ కమిటీ నివేదికలోను తొలి రెండు అంశాలను ఆమోదిస్తూ, మిగిలిన వాటిని తిరస్కరిస్తున్నట్లు ముసాయిదా నివేదికను రూపొందించినట్లు వెల్లడించాయి. కాగా, మాజీ సీఎం అశోక్ చవాన్‌పై సీబీఐ దర్యాప్తుకు గవర్నర్ తన విచక్షణాధికారాలతోనే అనుమతి నిరాకరించారని అధికార వర్గాలు చెప్పాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement