సాక్షి, ముంబై: ఓ కీలక ఫైల్‌లో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సంతకం చేసిన అనంతరం మా ర్పులు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మంత్రాలయ కార్యాలయంలో పనిచేస్తున్న కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది వర్గాల్లో కలకలం రేపింది. ఈ ఘటనపై స్థానిక మెరైన్‌డ్రైవ్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. ప్రజా పనుల విభాగానికి చెందిన ఓ సూపరింటెండెంట్ ఇంజినీర్ నానా పవార్‌పై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి అదేశించారు. అందుకు సంబంధించిన ఫైల్‌లో సీఎం సంతకం చేశారు. కానీ, సంతకం చేసిన తరువాత అందులో మార్పులు చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
ముఖ్యమంత్రి సంతకం చేసిన చోట పైన విచారణ నిలిపివేయాలని రెడ్ పెన్నుతో రిమార్క్ రాసి ఉంది. అయితే విచారణ నిమిత్తం ఈ ఫైల్‌ను పరిశీలించిన మంత్రి అశోక్ చవాన్‌కు అనుమానం వచ్చింది. సీఎం ఉద్ధవ్ సంతకం చేసిన చోట స్థలం లేదు. అయినప్పటికీ సంతకంపైన చిన్న అక్షరాలతో విచారణ నిలిపివేయాలని రాసి ఉంది. ఒకవేళ ఉద్ధవ్ విచారణ నిలిపివేయాలని రిమార్కు రాస్తే స్థలం ఉండేది. కానీ, అక్కడ ఇరుకైన చోట చిన్న అక్షరాలతో రిమార్కు రాయడంపై చవాన్‌కు అనుమానం వచ్చింది. వెంటనే ఈ ఫైల్‌ను ముఖ్యమంత్రి చాంబర్‌కు పంపించారు.
ముఖ్యమంత్రి సంతకం చేసిన ప్రతీ ఫైలు స్కాన్ చేస్తారు. అక్కడ పరిశీలించగా స్కాన్ చేసిన పత్రాలపై రెడ్ పెన్నుతో రాసిన ఎలాంటి రిమార్కు లేదు. దీన్ని బట్టి సంతకం చేసిన తరువాతే ఈ మార్పులు జరిగినట్లు స్పష్టమైంది. దీంతో మంత్రాలయలో ఎవరో ఈ పనిచేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై మెరైన్‌డ్రైవ్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment