న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భాగంగా పశ్చి మ బెంగాల్, అసోం రాష్ట్రాలలో తొలి దశ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చి ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ చురుకుగా సాగుతోంది. ఉదయం 9 గంటలకు అసోంలో 12 శాతం పోలింగ్ నమోదు కాగా, పశ్చిమ బెంగాల్ లో 23 శాతం పోలింగ్ నమోదైంది.
ఇక పశ్చిమ బెంగాల్ లో అక్కడక్కడ చెదురు మదురు సంఘటనలు నమోదయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారి తెలిపారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం మొరాయించడంతో కొంత గందరగోళం నెలకొంది. దీంతో అధికారులు పోలింగ్ ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 33 మంది అభ్యర్థులు బరిలో ఉన్న తొలి దశ ఎన్నికల్లో బెంగాల్ రాష్ట్రంలో 18 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 18 నియోజకవర్గాలల్లో తృణమూల్ కాంగ్రెస్-వామపక్ష కూటమి భారతీయ జనతా పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు.
అస్సోంలో మొదటి రెండు గంటల్లో 12 శాతం పోలింగ్ శాతం నమోదయినట్టు ఎన్నికల కమిషన్ అధికారి తెలిపారు. ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరారు. ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి శరబానందా సొనవాల్ సహా 539 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్న మొదటి దశలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అస్సోంలో 65 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 539 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఏప్రిల్ 11, 17, 21, 25, 30, మే 5 తేదీలలో మలిదశ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
అస్సోంలో 12శాతం, బెంగాల్ లో 23శాతం
Published Mon, Apr 4 2016 11:10 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement