పంజాబ్, గోవా రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం
ఢిల్లీ : పంజాబ్, గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. పంజాబ్‌లోని 117 స్థానాలు, గోవాలో 40 స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పనాజిలో రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ క్యూలో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గోవాలో భారీగా ఓటింగ్ నమోదవుతుందని చెప్పారు.
తొలిసారిగా ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లకు బదులు ఈ–బ్యాలెట్‌ను వాడనున్నారు. జవాన్లతో సహా వివిధ సర్వీసు ఉద్యోగులు దీని ద్వారా ఆన్ లైన్ లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గోవాలో 40 స్థానాలకు 251 మంది అభ్యర్థులు, పంజాబ్ 117 స్థానాలకు 1145 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గోవాలో 1,642 పోలింగ్ కేంద్రాలు, పంజాబ్‌లో 22,615 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మార్చి 11న ఫలితాలు వెలువడనున్నాయి.