
మత్తిచ్చి అత్యాచారం చేసిన జ్యోతిష్యుడు!
జ్యోతిష్యుడి అరెస్ట్
పానీయంలో మత్తు మందు ఇచ్చి...
బెంగళూరు : తన పెళ్లి ఎప్పుడు జరుగుతుందోనని జ్యోతిష్యం చెప్పిం చుకోడానికి వెళ్లిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీరుపై అత్యాచారం చేసిన జ్యోతిష్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఇక్కడి రామమూర్తినగర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు శనివారం తెలిపిన సమాచారం మేరకు.. తమిళనాడుకు చెందిన దామోదరన్ అలియాస్ దాము రెండు సంవత్సరాల క్రితం రామమూర్తినగరలోని హొస్సళ నగరలో జ్యోతిష్య కేంద్రాన్ని ప్రారంభించాడు. ఇతని దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోడానికి పలువురు అపాయింట్‌మెంట్ తీసుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహిళ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు ఇక్కడి ఎలక్ట్రానిక్ సిటీలోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె దామోదరన్ దగ్గర ఈనెల 19వ తేదీన అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. తనకు వివాహం ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోడానికి ఆమె బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఆ జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో దామోదరన్ ఆ యువతికి మత్తు మందు కలిపిన పానీయం ఇచ్చాడు. దాన్ని తాగితే సమస్యలన్నీ తీరిపోతాయని నమ్మించాడు. దీంతో ఆ పానీయం సేవించిన ఆ యువతి మత్తులోకి జారుకుంది.
అనంతరం దామోదరన్ ఆమెపై అత్యాచారం చేశాడు. సాయంత్రం తరువాత ఆమెకు సృ్పహ వచ్చింది. వెంటనే ఆమె స్నేహితుడికి ఫొన్ చేసి విషయం చెప్పింది. అతను రామమూర్తినగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువతిని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెపై అత్యాచారం జరిగిందని వైద్య నివేదికలో వెలుగు చూసింది. దీంతో దామోదరన్‌ను అరెస్ట్ చేశారని పోలీసులు శనివారం తెలిపారు. ఇలా ఎంత మందిని మోసం చేశాడు అని ఆరా తీస్తున్నామని చెప్పారు.