టోల్ అడిగినందుకు తోలు తీశారు
గుర్గాం: టోల్ చార్జీని చెల్లించాలని అడిగినందుకు అందులో పనిచేసే వ్యక్తిని చితక్కొట్టారు. ఈ దృశ్యం సీసీటీవీ కెమెరాల్లో కూడా రికార్డయింది. చూసిన వారి ఒళ్లు జలదరించేలా టోల్ వసూలు చేసే సహాయకుడిపై ముష్టిఘాతాలకు దిగారు. వివరాల్లోకి వెళితే.. గుర్గామ్ బ్లాక్ సమితి మాజీ చైర్మన్ హోషియార్ సింగ్ శనివారం రాత్రి 9.30గంటల ప్రాంతంలో ఓ కారులో వెళుతూ ఖైద్కీ దౌలా ప్లాజాను సమీపించారు.
ఆ సమయంలో ఆయనను టోల్ చెల్లించాలని అక్షయ్ అనే యువకుడు అడిగాడు. దీంతో తననే టోల్ చేయమంటావా అని ప్రశ్నిస్తూ ఒకేసారి అనూహ్యంగా దాడికి దిగారు. హోషియార్ ఆగ్రహంతో కారులో నుంచి వేగంగా దిగి అక్షయ్‌పై దాడి చేశాడు. అనంతరం అందులోని కంప్యూటర్, ఇతర సామాను పగులగొట్టారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ దొరికిన నేపథ్యంలో దాని ఆధారంగా హోషియార్‌పై గట్టి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.