గుర్గావ్: ఎనిమిదో నంబర్ జాతీయ రహదారిపై ఖేర్కీ ధౌలా టోల్‌ప్లాజా వద్ద సుమారు 300 మంది గ్రామస్తులు బుధవారం ఆందోళనకు దిగారు. టోల్ కలెక్టర్లు తమ గ్రామానికి చెందిన వాణిజ్య వాహనాలకు కూడా టోల్ పన్ను వసూలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్థానికులు, టోల్ ఆపరేటర్ల మధ్య తీవ్ర వాగ్వావాదం చోటుచేసుకొంది. దీంతో స్థానికులు టోల్‌కలెక్టర్‌ను గాయపర్చి రూ. 50,000లను లూటీ చేశారని ఆపరేటర్ ఆరోపించాడు.
100శాతం రాయితీ ఇవ్వాలని డిమాండ్..
ఎన్‌హెచ్‌ఏఐ, ఎక్స్‌ప్రెస్ వేల మధ్య ఏర్పాటు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ప్రైవేటు వాహనాలు, వాణిజ్య వాహనాలకు పూర్తి రాయితీ లేదు. అయినప్పటికీ ఖేర్కీ గ్రామ వాహనాలకు 34 శాతం రాయితీ ఇస్తున్నారు. అయితే తమ గ్రామానికి చెందిన వాహనాలకు 100 శాతం రాయితీ ఇవ్వాలని కొంత కాలంగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పన్ను చెల్లించాల్సిందేనని టోల్ ఆపరేటర్ చెప్పడంతో స్థానికులు వారితో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న ఖేర్కీవాసులు దాదాపు 300 మంది టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్నారు. టోల్‌పన్ను వసూలను వ్యతిరేకిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. సమాచారం తెలుసుకున్న ఏసీపీ నరేందర్ కదియన్,ఖేర్కీ దౌలా ఎస్‌హెచ్‌ఓ హర్‌దీప్ సింగ్ హూడా సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. పరిస్థితిని సమీక్షించారు.
స్తంభించిన ట్రాఫిక్...
ప్లాజా క్రాసింగ్ వద్ద ట్యాక్స్ చెల్లించని గ్రామానికి చెందిన వాహనాలను ఉదయం 10 గంటలకు నుంచి సుమారు గంటపాటు టోల్ ఆపరేటర్లు నిలిపివేయడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాదాపు కిలోమీటర్‌కుపైగా వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
కేసులు నమోదు...
టోల్‌ప్లాజా వద్ద ఆందోళనకు దిగిన ఖేర్కీ గ్రామానికి చెందిన దాదాపు 200 మందిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. టోల్ ప్లాజా నిర్వహణ సంస్థ ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఆందోళకారులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఖేర్కీ టోల్‌ప్లాజా వద్ద ఆందోళన
Published Wed, Aug 20 2014 10:35 PM | Last Updated on Thu, Sep 27 2018 2:34 PM
Advertisement