టోల్‌ప్లాజా వద్ద అడ్డొచ్చిన వ్యక్తిని బస్సుతో..
గుర్గావ్: టోల్ గేట్ దగ్గర టోల్ ట్యాక్స్ కట్టకుండా పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఏకంగా వ్యక్తినే ఢీకొట్టడానికి వెనుకాడలేదు ఓ బస్సు డ్రైవర్. వివరాలు..గుర్గావ్లోని ఖేర్కీధౌలా టోల్‌ప్లాజా దగ్గర టోల్ టాక్స్ రూ.60 కట్టడానికి ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్ నిరాకరించాడు. టోల్ టాక్స్ కట్టాల్సిందిగా నిలదీయడంతో బస్సు డ్రైవర్ కట్టకుండా పారిపోవడానికి ప్రయత్నించాడు. అడ్డు వచ్చిన టోల్ మేనేజర్ను ఢీకొట్టడానికి కూడా వెనకాడకపోవడంతో అతను వెంటనే పక్కకు దూకాడు. ఈ తతంగం అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డయింది. ఆదివారం రాత్రి సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
మరో వైపు అదే టోల్ గేట్ వద్ద జరిగిన మరో సంఘటనలో కొందరు టోల్ సిబ్బంది పై దాడికి దిగారు. ట్రక్ డ్రైవర్ను టోల్ అడిగినందుకు ఆరు నుంచి ఏడుగురు వచ్చి సిబ్బంది పై దాడికి దిగారు. డ్రైవర్ ఆర్సీ చూపించినా వాహనాన్ని వెళ్లడానికి అనుమతి ఇవ్వక పోవడంతో తన వారికి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. అక్కడకు వచ్చిన వారు టోల్ సిబ్బందిపై దాడికి దిగారు. ఖేర్కీధౌలా టోల్‌ప్లాజాలో టోల్‌ఫ్రీ ట్యాగ్ చూపించిన స్థానికులకు టోల్ టాక్స్ నుంచి మినహాయింపు ఉంది. ఈ రెండు సంఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.