ఔరంగాబాద్: మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలో కరువు, తీవ్ర దుర్భిక్ష పరిస్థితులకు అద్దం పట్టే సంఘటన ఇది. క్షుద్బాధను తట్టుకోలేక ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ రైతును కిడ్నాప్ చేశారు. ఔరంగాబాద్ జిల్లా ఘాతంబరి గ్రామంలో జరిగిందీ ఘటన. రైతు సుదాం సురాద్కర్ ఆదివారం పొలానికి వెళ్తుండగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని అపహరించారు.
సురాద్కర్ వద్దనున్న టిఫిన్ బాక్స్‌ను లాగేసుకొని ఆబగా తినేశారు. ఒక్కడి కోసం తెచ్చుకున్న ఆహారం ముగ్గురికి ఏం సరిపోతుంది? దాంతో సురాద్కర్ బంధువులకు ఫోన్ చేసి తమకు మరింత ఆహారం పంపాలని, అప్పుడే అతన్ని విడుదల చేస్తామని డిమాండ్ చేశారు. కిడ్నాపర్లు కోరినట్లుగానే ఆహారం పంపగా... సురాద్కర్‌కు విడుదల చేశారని ఏఎస్‌ఐ శంకర్ షిండే వెల్లడించారు. వీరికోసం గాలింపు జరుగుతోందని ఔరంగాబాద్ ఎస్పీ నవీన్‌చంద్రా రెడ్డి తెలిపారు.