ఎన్నికలయ్యాక హాజరవుతా.. సుప్రీంతో ఆజంఖాన్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ వివాదాస్పద మంత్రి ఆజం ఖాన్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. తనకు అలహాబాద్ హైకోర్టు బెయిలబుల్ వారెంట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆయన ఉన్నత న్యాయ స్థానం ఆశ్రయించారు. రాష్ట్రానికి చెందిన జల్ నిఘం సంస్థకు గతంలో ఎక్స్ అఫిషియో చైర్మన్‌గా వ్యవహరించిన ఆజం ఖాన్‌పై అక్రమాల కేసు నమోదైంది. దీనికి సంబంధించి కోర్టుకు హాజరుకాకపోవడంతో అలహాబాద్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఆయనకు బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. దీంతో ఆజం ఖాన్ తరుపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంలో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్‌కే కౌల్ బెంచ్‌కు తన పిటిషన్ ఇస్తూ మార్చి 11నాటికి తన క్లెయింట్(ఆజం ఖాన్) హైకోర్టుకు హాజరవుతారని, ప్రస్తుతం ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అనుమతివ్వాలని అందులో కోరారు. దీనిపై ఈ రోజు మధ్యాహ్నం 2గంటల తర్వాత కోర్టు నిర్ణయం వెలువరించనుంది.