
బెంగళూరు: మానవాళికి పెనుముప్పుగా పరిణమించిన ప్రాణాంతక కరోనా వైరస్‌పై పోరులో ప్రజలకు అండగా ఉండేందుకు అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. మహమ్మారిపై పోరాడేందుకు విప్రో లిమిటెట్, విప్రో ఎంటర్‌ప్రైజెస్‌లతో కలిసి రూ. 1125 కోట్ల నిధులు వెచ్చించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు మూడు సంస్థలు కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేటాయించిన ఈ భారీ మొత్తం తాము చేపట్టే సామాజిక కార్యక్రమాల కోసం (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ఖర్చుపెట్టే నిధులకు అదనం అని వెల్లడించింది. అంటువ్యాధి ప్రబలకుండా తమ ప్రాణాలు పణంగా పెట్టి సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి అండగా ఉంటామని ఈ సందర్భంగా పేర్కొంది.(కరోనాపై పోరుకు ‘టాటా’ విరాళం 1,500కోట్లు..)
కాగా రూ. 1125 కోట్లలో ఎక్కువ మొత్తం అజీమ్ ఫౌండేషన్ నుంచే సమీకరించినట్లు తెలుస్తోంది. విప్రో లిమిటెడ్ రూ. 100 కోట్లు, విప్రో ఎంటర్‌ప్రైజెస్ రూ. 25 కోట్లు అందించగా.. అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ రూ. 1000 కోట్లు కరోనాపై పోరుకు కేటాయించినట్లు సమాచారం. ఇక విప్రో కంపెనీల వ్యవస్థాపకుడు, ఐటీ దిగ్గజం అజీం ప్రేమ్‌జీ 2019 మార్చిలో సామాజిక సేవ నిమిత్తం తన సంపదలో 52,750 కోట్ల రూపాయలు(ఆయన షేర్లలో 34 శాతానికి సమానం) వెచ్చించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిధులను అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ ద్వారా ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment