‘విద్య’లో ముస్లింల వెనుకబాటు
ఓ కమిటీ అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ: విద్యపరంగా మైనార్టీలలో ముస్లింలు అత్యంత వెనుకబడి ఉన్నారని కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా నడిచే ఓ సంస్థ ఏర్పాటు చేసిన ప్యానెల్ వెల్లడించింది. కేంద్ర పాఠశాలలు, కమ్యూనిటీ కాలేజీలు, జాతీయస్థాయి విద్యాసంస్థలు మూడంచల్లో విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ముస్లింలలో సాధికారత వస్తుందని సూచించింది. వారికోసం 211 పాఠశాలలు, 25 కమ్యూనిటీ కాలేజీలు, 5 జాతీయ స్థాయి విద్యా సంస్థలను నెలకొల్పాలని పేర్కొంది. పాఠశాలలను కేంద్రీయ విద్యాలయాలు లేదా నవోదయ విద్యాలయాల మాదిరిగా నడపాలని సూచించింది. దీనిపై కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి అబ్బాస్ నఖ్వీని ప్రశ్నించగా.. విద్య పరంగా మైనార్టీల సాధికారతపై కేంద్ర విధానాల్లో భాగంగా ఈ నివేదిక కూడా ఒకటని చెప్పారు.
‘ఈ నివేదికను పరిశీలిస్తున్నాం. నివేదికలోని అంశాలు ఆచరణీయమైనవని అనిపిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకొస్తాం’అని వివరించారు. మైనార్టీల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు కేంద్ర నిధుల ద్వారా నడిచే మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ గతేడాది డిసెంబర్ 29న 11 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర మాజీ కార్యదర్శి అఫ్జల్ అమానుల్లా కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీ ఇటీవల తన నివేదికను విడుదల చేసింది.