బాంబు ఉన్న బ్యాగును దూరంగా తీసుకెళ్తున్న బాంబ్ స్క్వాడ్ సిబ్బంది
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు దొరకడం కలకలం రేపింది. టికెట్ కౌంటర్ వద్ద సోమవారం ఉదయం 10 గంటల సమయంలో అనుమానాస్పద బ్యాగ్‌ను కొనుగొన్న విమానాశ్రయ పోలీసులు, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న నగర పోలీసు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఆ బ్యాగులో పేలుడు పదార్థం ఉన్నట్టుగా అనుమానించారు. దీంతో ఆ బ్యాగ్‌ను బాంబు తరలింపు వాహనం ద్వారా కిలోమీటరు దూరంలో ఉన్న ఖాళీ స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ కట్టుదిట్టమెన భద్రతతో సాయంత్రం 5.30 గంటలకు పేల్చారు. బ్యాగ్‌లోని మెటల్ కాయిన్ బాక్స్‌లో పేలుడు పదార్థం, లోహపు ముక్కలు నింపారని సమాచారం.
సీసీ కెమెరాల్లో నిందితుడు..
సీసీ కెమెరా చిత్రాల ఆధారంతో అధికారులు నిందితుడి ఫొటోలు విడుదల చేశారు. నిందితుడు ఆటోలో రావడం, బ్యాగ్ ఉంచడం తదితర దృశ్యాలు విమానాశ్రయం కెమెరాల్లో రికార్డ య్యాయి. నిందితుడు మధ్యవయస్కుడు, విద్యావంతునిలా కనిపిస్తున్నాడు. బ్యాగ్‌ను కౌంటర్ వద్ద ఉంచి, ముఖాన్ని దాచుకుంటూ ఆటోలో వెళ్లిపోయాడు. దీని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని సీఐఎస్‌ఎఫ్ తెలిపింది. బాంబు విమానాశ్రయంలో పేలి ఉంటే మొత్తం బూడిదై పోయేదని మంగళూరు ఎస్పీ పీఎస్ హర్ష తెలిపారు. చుట్టూ 500 మీటర్ల మేర పేలుడు ప్రభావం ఉండేదన్నారు. మంగళూరు విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఇండిగో విమానంలో బాంబు ఉందనే వదంతి వ్యాపించింది. దీంతో అధికారులు విమానాన్ని వెనక్కి రప్పించి తనిఖీలు చేయగా ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. ఈ సంఘటనలతో మంగళూరులో భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవల మంగళూరులో ఎన్నార్సీకి వ్యతిరేకంగా భారీగా అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment