
సాక్షి, బెంగళూరు: ప్రతిష్టాత్మక ‘శివరామ్ కారంత్’ అవార్డును ఎట్టి పరిస్థితుల్లోనూ నటుడు ప్రకాష్‌రాజ్‌కు ఇవ్వరాదని భజరంగ్‌దళ్ డిమాండ్ చేసింది. ఈమేరకు ఆ సంస్థ కర్ణాటక దక్షిణ ప్రాంత విభాగం సహ సంచాలకులు రఘు సకలేశపుర పేరిట శనివారం ఒక పత్రికా ప్రకటన విడుదలైంది. ‘సంఘ్ పరివార్ గౌరి లంకేష్‌ను హత్య చేసిందంటూ ప్రకాష్‌రాజ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ ఏజెంట్‌లా వ్యవహరిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీపై ఆయన తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. కేవలం ప్రచారం కోసమే ఇలా దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీల వేదికపై ఆయన దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. అందువల్ల శివరామ్ కారంత్ వంటి ప్రతిష్టాత్మక అవార్డును అందుకునే అర్హత ప్రకాష్‌రాజ్‌కు లేద’ని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా, ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందికపోవడాన్ని ప్రకాష్‌రాజ్ ఇంతకుముందు తప్పుపట్టారు. మోదీ మౌనం తనను భయపెడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ తన కంటే పెద్ద నటుడని పేర్కొన్నారు. అవసరమైన చోట తాను గళం ఎత్తుతూనే ఉంటానని ప్రకాష్‌రాజ్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసినందుకు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఆయనపై కేసు నమోదయింది.