
బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఇపుడొక అరుదైన ఘనతను సాంతం చేసుకుంది. విమానాశ్రయాల్లో దిగే (అరైవల్స్) ప్రయాణీకులకు అందిస్తున్న నాణ్యమైన సేవలపై ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ తొలిసారిగా నిర్వహించిన గ్లోబల్ సర్వేలో ప్రథమస్థానాన్ని దక్కించుకుంది. ఏఎస్‌ఐఏఎస్‌క్యూ అరైవల్ త్రైమాసిక సర్వేలో (2018 ఏప్రిల్‌జూన్ నెలల్లో) భాగంగా అయిదు పాయింట్ల సూచిలో 4.67 పాయింట్లు సాధించి ఈ సేవల్లో అగ్రస్థానాన్ని సాధించింది. ఈ సేవల్లో అబూదాబి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ 4.53 పాయింట్లతో రెండోస్థానంలో, టొరంటో పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ 4.44 పాయింట‍్లతో మూడోస్థానం పొందింది. మనదేశం నుంచి ఈ సర్వేలో పాల్గొన్న ఏకైక విమానాశ్రయం బెంగళూరే. ప్రపంచవ్యాప్తంగా 358 ఎయిర్‌పోర్టుల నుంచి ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణీకులకు సంబంధించి ఇప్పటికే నిర్వహిస్తున్న సర్వేలో ఇతర దేశాల నుంచి విమానాల్లోంచి దిగుతున్న (అరైవల్) ప్రయాణీకుల సేవలకు సంబంధించి కూడా ఈ అధ్యయనంలో మొదటిసారిగా ప్రవేశపెట్టారు.
ప్రధానంగా ఎయిర్‌పోర్టులలో దిగడం, ఇమ్మిగ్రేషన్ (అంతర్జాతీయ ప్రయాణీకులకు మాత్రమే), బ్యాగేజీ తీసుకోవడం, కస్టమ్‌్స, విమానాశ్రయ మౌలికసదుపాయాలపై ప్రయాణీకుల అభిప్రాయాలతో ఏఎస్‌క్యూ అరైవల్స్ సర్వే నిర్వహించారు. ప్రస్తుతం బెంగళూరు ఎయిర్‌పోర్ట్ దక్షిణ భారతదేశంలో అత్యంత రద్దీ అయిన విమానాశ్రయమే కాకుండా దేశంలోనే మూడో అతిపెద్దదిగా పేరుగాంచింది. ప్రాంతీయ కేటగిరిలో భారత్, సెంట్రల్ ఆసియాలోనే అత్యుత్తమ మైనదిగా ఈ ఎయిర్‌పోర్ట్ గత మార్చి నెలలోనే అవార్డు గెలుచుకుంది.యావత్ ఎయిర్‌పోర్ట్ యాజమాన్యం, సిబ్బంది నిబద్ధతతో కూడిన అసాథారణ సేవలకు ఇది గుర్తింపుగా భావిస్తున్నామని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ హరి మరార్ తెలిపారు. నాణ్యతాపరంగా మరింత మెరుగైన సేవలు, సౌకర్యాలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని, వచ్చే 9 నెలల పాటు కూడా ఉత్తమమైన సేవలందించి ’బెస్ట్ ఎయిర్‌పోర్ట్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment