- తెలుగు దినపత్రికతో బాంబును పార్సిల్ చేసిన ఉగ్రవాదులు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ బెంగాల్‌లోని బుర్ధ్వాన్ పేలుడుకు కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎస్‌బీఐ బ్యాంకు దోపిడీకి మధ్య ఉన్న సంబంధాలపై స్పష్టత రాకుండానే మరో ఉగ్రవాద చర్యకు తెలుగు రాష్ట్రాలతో లింకు ఉన్నట్లు అనుమానాలు వస్తున్నాయి. ఆదివారం రాత్రి బెంగళూరులోని చర్చి స్ట్రీట్‌లో పేలిన బాంబు శకలాల్లో ఓ తెలుగు దినపత్రిక(‘సాక్షి’కాదు) ముక్కల్ని అధికారులు గుర్తించారు. జీఏ పైపుతో ఐఈడీ బాంబును తయారు చేసిన ఉగ్రవాదులు దాన్ని ప్యాక్ చేయడానికి తెలుగు దినపత్రిక బెంగళూరు టాబ్లాయిడ్‌ను వినియోగించారు.
దీంతో దర్యాప్తు వర్గాల దృష్టి తెలుగు రాష్ట్రాలపై పడింది. గత ఏడాది ఎన్నికల నేపథ్యంలో బీహార్‌లోని పట్నాలో ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన ర్యాలీని టార్గెట్‌గా చేసుకున్న ఉగ్రవాదులు వరుస బాంబుల్ని పేల్చారు. జీఏ పైపుతో తయారైన ఎల్‌బో (వంపుతో ఉండే భాగం) వాడి ఈ బాంబులను తయారు చేశారు. బెంగళూరులో పేలిన బాంబు ఇలాంటిదే.
బాంబును తొలుత చేతి రుమాలులో కట్టిన ఉగ్రవాదులు దానిపైన తెలుగు దినపత్రిక టాబ్లాయిడ్‌ను ఉంచి పార్సిల్ చేశారు. దుండగులకు తెలుగు పత్రిక ఎలా చేరిందనే దానిపై దర్యాప్తు సాగుతోంది. పేలుడుకు కుట్ర పన్ని బెంగళూరులో బస చేసిన ఉగ్రవాదులు అక్కడే ఈ పత్రికను కొనుగోలు చేసి ఉంటారని భావిస్తున్నారు.