బెంగళూరు కేఫ్‌ టెర్రరిస్టులు ఎలా దొరికారంటే? | The culprits caught with the help of Mobile | Sakshi
Sakshi News home page

బెంగళూరు కేఫ్‌ టెర్రరిస్టులు ఎలా దొరికారంటే?

Published Mon, Apr 15 2024 1:55 AM | Last Updated on Mon, Apr 15 2024 3:38 PM

నిందితులు ముసావీర్‌, అబ్దుల తాహ - Sakshi

నిందితులు ముసావీర్‌, అబ్దుల తాహ

బెంగళూరులో బాంబు పెట్టారు

సరిహద్దులు దాటి జాగ్రత్తలు తీసుకున్నారు

టూరిస్టుల్లా మారుమూల ప్రాంతాల్లో తిరిగారు

వాడిన మొబైల్‌ రిపేర్‌కు ఇచ్చారు

సిమ్‌ పెట్టగానే పోలీసులకు చిక్కారు

బనశంకరి: సిలికాన్‌ సిటీ బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుడు గుర్తుంది కదా..! మార్చి 1, 2024న బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. అయితే ఉగ్రవాద ఘటనలకు చాలా రోజులుగా బ్రేక్‌ పడ్డ తర్వాత ఈ ఘటన జరగడం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ కేసులో నిందితులు తాము చేసిన ఓ చిన్న తప్పుతో పోలీసులకు దొరికిపోయారు.

పక్కాగా ప్లాన్‌ చేసి తప్పించుకున్నారు

ముసావీర్‌ హుసేన్‌ షాజీబ్‌, అబ్దుల్‌ మతీన్‌ తాహ.. ఇద్దరు ఉగ్రవాద శిక్షణలో ఆరితేరారు. పక్కాగా స్కెచ్‌ వేసి బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ను ఎంచుకున్నారు. ఎన్నికల వేళ దక్షిణాది రాష్ట్రాల్లో అలజడి సృష్టించాలన్నది వీళ్ల కుట్ర. రెక్కీల తర్వాత మార్చి 1, శుక్రవారం రోజున తమ ప్లాన్‌ అమలు చేశారు. రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలగానే జారుకున్నారు. నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (NIA) రంగంలోకి దిగి కేసు దర్యాప్తు ప్రారంభించింది. అప్పటికే నిందితులు సరిహద్దులు దాటేశారు. సిసి టీవీ ఫుటేజ్‌ సేకరించిన NIA.. నిందితుల జాడ చెప్పిన వారికి పది లక్షల బహుమానం ప్రకటించింది.

అబ్బో.. ఎన్ని జాగ్రత్తలో.?

బెంగళూరు నుంచి బయటపడ్డ నిందితులిద్దరూ.. చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. బాంబు అమర్చిన హుస్సేన్‌ షాజీబీ (30), తెర వెనక మాస్టర్‌మైండ్‌ మథీన్‌ థాహ (30) తమ ఆహార్యాన్ని మార్చేశారు. పశ్చిమబెంగాల్‌లోని మారుమూల ప్రాంతాలకు చేరుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 35 సిమ్‌ కార్డులు మార్చారు. ఏ ప్రాంతానికి వెళ్లినా.. కొత్త పేర్లు చెప్పి లాడ్జ్‌లు తీసుకున్నారు. వీలైనంత వరకు తక్కువ ఖరీదు ఉండే మాస్‌ ఏరియాల్లో.. పోలీసు గస్తీ ఎక్కడయితే తక్కువగా ఉంటుందో అలాంటి ప్రాంతాలు మాత్రమే ఎంచుకున్నారు. స్కాన్‌ చేసి చెల్లించే UPI పేమెంట్‌ ఎక్కడా చేయలేదు, కేవలం నగదు మాత్రమే చెల్లించి భోజనం, కావాల్సిన వస్తువులు కొన్నారు. ఓ జిరాక్స్‌ సెంటర్‌లో ఆధార్‌ కార్డులను, డ్రైవింగ్‌ లైసెన్స్‌లను సేకరించిన వీరిద్దరు.. వాటితో ఫేక్‌ ఐడెంటిటీ కార్డులను తయారు చేసి వాడారు. వీరికి ఎప్పటికప్పుడు క్రిప్టో కరెన్సీ ద్వారా నిధులు సమకూరేవని దర్యాప్తులో తేలింది.

చిక్కరు.. దొరకరు

పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్‌కు వచ్చిన నిందితులు అక్కడ ఒక హోటల్‌లో పర్యాటకుల తరహాలో మకాం వేశారు. ఒకసారి ఒక పని మీద వాడిన సిమ్‌ను వెంటనే మార్చేవారు. అలా 35 సిమ్‌కార్డులను చేతిలో ఉంచుకున్నారు. ఒక్కో పనికి ఒక్కో సిమ్‌ చొప్పున వాడడం పక్కనబెట్టడం. పని పూర్తి కాగానే ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయడం. ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. పైగా  ఈ సిమ్‌ కార్డులన్నీ నకిలీ అడ్రస్‌లు ఉపయోగించి సేకరించినవే. కొన్ని తమిళనాడు పేరుతో ఉన్నవయితే.. మరికొన్ని మహారాష్ట్ర, ఢిల్లీలోని ఫేక్‌ అడ్రస్‌లు, ఆధార్‌లతో సేకరించిన సిమ్‌ కార్డులు. ఈ సిమ్‌లను వినియోగించినా.. వీళ్ల ఆచూకీ NIA పసిగట్టలేకపోయింది. ఏ చిన్న ఆధారం దొరికినా.. తప్పుడు అడ్రస్‌ల కారణంగా దర్యాప్తు మాత్రం ముందుకు సాగలేదు.

ఆడింది ఆట.. పాడింది పాట

హోటల్‌లో రూం తీసుకునేటప్పుడు రిజిస్టర్‌లో తమ పేర్లు కాకుండా నకిలీ పేర్లు రాశారు. కొన్ని సార్లు పొరపాటున అసలు పేరు రాసి కొట్టివేసి నకిలీ పేర్లు రాశారు. పర్యాటకులమని, డార్జిలింగ్‌ నుంచి వస్తున్నామని, చెన్నెకు వెళుతున్నామని.. ఇలా తోచిన కారణాలను హోటల్‌ సిబ్బందికి చెప్పారు. నకిలీ ఆధార్‌ కార్డులు చూపారు. స్థానికంగా వివిధ పర్యాటక స్థలాలను సందర్శిస్తూ జల్సా చేశారు. కోల్‌కతాలో మూడు హోటల్స్‌లో ఎప్పటికప్పుడు మకాం మార్చారు.

చిన్న కారణంతో చిక్కారు

మకాం మార్చుతూ పశ్చిమబెంగాల్‌లోని చాంద్‌నీ అనే ప్రాంతానికి వచ్చిన వీరు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, వీళ్లిద్దరిలో ఒకరు వాడుతున్న మొబైల్‌ కింద పడడంతో ఫోన్‌లో స్పీకర్‌ పాడయింది. దీన్ని రిపేర్‌ చేయించేందుకు.. ఫోన్‌లోని సిమ్‌ కార్డు తీసేసి.. దగ్గరలోని రిపేర్‌ షాప్‌ మైక్రోమాజిక్‌ ఇన్ఫోటెక్‌ అనే చిన్న మొబైల్‌ షాప్‌కు తీసుకెళ్లారు. ఫోన్‌ను పరిశీలించిన మొబైల్‌ షాపు మెకానిక్‌.. స్పీకర్‌ పని చేస్తుందా లేదా అని తెలియడానికి షాప్‌ కీపర్‌ తన దగ్గరున్న సిమ్‌ను ఫోన్‌లో వేసి రిపేర్‌ చేశాడు.

అప్పటికే IMEA నంబర్‌పై నిఘా పెట్టిన NIA అధికారులు.. సిమ్‌ వేయగానే దాని ఆధారంగా అడ్రస్‌ కనిపెట్టారు. ఈ సారి మాత్రం పక్కాగా ఒరిజినల్‌ అడ్రస్‌ దొరికింది. మొబైల్‌ లొకేషన్‌ను సంపాదించిన అధికారులు.. కొన్ని గంటల్లోనే చాంద్‌నీ ప్రాంతానికి చేరుకున్నారు. షాప్‌ కీపర్‌ ఇచ్చిన విలువైన సమాచారంతో నిందితుల జాడ పట్టేశారు. వేర్వేరు హోటళ్ల సిబ్బంది వాంగ్మూలం, ఎన్‌ఐఏ బృందాలు సేకరించారు, రిజిస్టర్లు, సీసీ కెమెరా ఫుటేజీలు, గుర్తింపు కార్డులు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement