నా ఆస్తులతో బ్యాంకులకు ఏం పని?
న్యూఢిల్లీ: విదేశాల్లోని తన ఆస్తులు వివరాలు బ్యాంకులకు తెలిపేందుకు దివాలా తీసిన వ్యాపారవేత్త విజయ్‌మాల్యా నిరాకరించారు. విదేశాల్లోని తన ఆస్తుల వివరాలు వెల్లడించాలని కోరేందుకు బ్యాంకులకు ఎలాంటి హక్కుగానీ, అధికారంగానీ లేదని ఆయన గురువారం సుప్రీంకోర్టుకు తెలిపారు. బ్యాంకులకు వేలకోట్ల రూపాయల రుణాలు ఎగవేయడంతోపాటు మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు విజయ్ మాల్యా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
ఈ కేసులో గురువారం తన వాదనలు వినిపించిన మాల్యా జున్ 26వ తేదీన సీల్డ్ కవర్‌లో తన ఆస్తుల వివరాలు తెలియజేసేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరారు. మాల్యా విదేశీ ఆస్తుల వివరాలు తెలియజేయాలన్న బ్యాంకుల అభ్యర్థనపై ఆయన స్పందిస్తూ.. రుణాలు ఇచ్చేటప్పుడు తన విదేశీ ఆస్తుల గురించి బ్యాంకులు పరిగణనలోకి తీసుకోలేదని, అలాంటప్పుడు ఇప్పుడు వాటితో ఏం పని? అని ప్రశ్నించారు.
బ్యాంకులకు ఎగవేసిన అప్పుల విషయంలో అదనంగా రూ. 1,398 కోట్లు చెల్లించడానికి సిద్ధమని విజయ్ మాల్యా సుప్రీంకోర్టుకు ఆఫర్ చేశారు. మరోవైపు విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాను భారత్‌కు రప్పించేందుకు ఈడీ తన చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటికే మాల్యాకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ దాఖలైన నేపథ్యంలో అతన్ని రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖను ఈడీ ఆశ్రయించింది.