మా చావుకు సీబీఐ వేధింపులే కారణం
సూసైడ్ నోట్‌లో బన్సల్
న్యూఢిల్లీ: సీబీఐ వేధింపుల వల్లే తన భార్య, కూతురు ఆత్మహత్య చేసుకున్నారని.. తమనూ అలాగే వేధిస్తుండడంతో తను, తన కుమారుడు మృత్యువును ఆశ్రయిస్తున్నామని కార్పొరేట్ వ్యవహారాల మాజీ డైరెక్టర్ జనరల్ బీకే బన్సల్ సూసైడ్ నోట్‌లో ఆరోపించారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు సెప్టెంబర్ 26(సోమవారం)న ఈమేరకు ఆయన లేఖ రాశారు. ఏడు పేజీల బన్సల్ లేఖను, కుమారుడు యోగేశ్ రాసిన రెండు పేజీల లేఖను బుధవారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని తమ ఫ్లాట్‌లో మంగళవారం బన్సల్, యోగేశ్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.
ఓ ఫార్మా కంపెనీ నుంచి లంచం తీసుకుంటుండగా జూన్‌లో బన్సల్‌ను పోలీసులు అరెస్టు చేయడం, తర్వాత ఆయన బెయిల్‌పై బయటికి రావడం తెలిసిందే. గతంలోనూ విపరీతంగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ విచారణకు ఆదేశించింది. సీబీఐలోని డీఐజీ, ఇద్దరు మహిళా అధికారులు, లావుగా వుండే హవల్దార్... తన అరెస్టు తరువాత భార్య, కూతురిపై తీవ్ర వేధింపులకు పాల్పడ్డారని బన్సల్ లేఖలో ఆరోపించారు. ఈ విషయాన్ని వారు బంధువులకు, ఇంటి పక్క వారికి చెప్పుకొని ఎంతో ఆవేదన చెందారని వివరించారు. సీబీఐ అధికారులు వేధింపులు మరింత ఎక్కువ కావడంతో అవమానం భరించలేక వారు ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు.
ఆ బాధలో ఉన్న తనను, తన కుమారుడిని సైతం సీబీఐ అధికారులు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారని, లైవ్ డిటెక్టర్లు సైతం ఉపయోగించి తమను విచారించారని, అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పారు. కాగా తమ అధికారులపై ఆరోపణలు రావడంతో అంతర్గత విచారణకు ఆదేశించినట్లు సీబీఐ ప్రతినిధి ఆర్‌కే గౌర్ బుధవారం వెల్లడించారు. బన్సల్, యోగేశ్‌ల లేఖలను పోలీసులు తమకు అందజేశారని.. ఈ వివరాలన్నింటిని కోర్టుకు వివరించినట్లు ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా,బన్సల్, యోగేశ్‌ల అంత్యక్రియలు బుధవారం హరియాణాలోని స్వస్థలమైన హిస్సార్‌లో పూర్తయ్యాయి.