బెంగళూరు సరస్సులో భారీ మంటలు
బెంగళూరు: ఇండియా సిలికాన్ వ్యాలీగా పేర్గాంచిన బెంగళూరులో తిరిగి గతంలో జరిగిన సంఘటన పునరావృతం అయింది. విపరీతంగా వ్యర్థాలు పడేయడంతోపాటు, జలాలన్నీ కూడా తీవ్ర కలుషితం కావడంతో మరోసారి బెల్లందూర్ సరస్సులో మంటలు చెలరేగాయి. అయితే, ఈసారి గతంలోకంటే కూడా నగర వాసులు భయపడేంత భయంకరంగా వ్యాపించాయి. దట్టమైన పొగలతో ఓ భారీ బాంబు దాడి జరిగితే ఎలాంటి పొగలు వస్తాయో అంతకుమించిన పొగలు ఆ సరస్సు నుంచి వెళువడుతుండటంతో నగర వాసులంతా వణికి పోతున్నారు.
గురువారం సాయంత్రం చెలరేగిన మంటలు ఇప్పటికీ తగ్గకపోగా ఫైర్ సిబ్బందికి కూడా ఇబ్బందిని కలిగిస్తూ చుట్టుపక్కల ఉన్న ఎండుగడ్డిని అంటూకుంటూ తీవ్ర కలవరం పెట్టిస్తున్నాయి. సరస్సులో తీవ్ర కాలుష్యంతోపాటు ఈ సరస్సు ఒడ్డునే పడేస్తున్న వ్యర్థాలు, సరస్సు నీటిలో కలుస్తున్న రసాయనాలు, పారిశ్రామిక వ్యర్థాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఇది నగరవాసులు తిరిగే పెద్ద పెద్ద రహదారుల పక్కనే ఉన్న కారణంగా ఆ పక్కగా వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులుపడటంతోపాటు వణికిపోతున్నారు.
పెద్దఎత్తున వ్యాపించిన ఈ పొగల్లో దీర్ఘకాలంలో ఇబ్బందులు పెట్టే విషవాయువులు కూడా ఉండొచ్చని వారు ఆందోళనకు గురి అవుతున్నారు. బెంగళూరులో ఉన్న సరస్సుల్లో బెల్లందూర్, వర్తూర్‌లు అతి పెద్దవి. అయితే ఇవి చెత్త, పరిశ్రమల వ్యర్థాలతో తీవ్రంగా కలుషితమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని పరిశుభ్రం చేసే ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటి వరకు ఆ పనులు ముందుకు వెళ్లడం లేదు. దీంతో ప్రస్తుతం పరిస్థితి ఏర్పడింది. దీనిపట్ల సరైన చర్యలు తీసుకోకపోవడంతో ప్రజల నగర నిర్వాహక అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తిట్టి పోస్తున్నారు.