బెంగళూరు 'మార్కు' మారనుందా?
సూర్యతాపం ఉద్యానగిరిగా పేరొందిన బెంగళూరునూ వదలడం లేదు. పదేళ్లలో ఎన్నడూ లేనంతగా పగటి ఉష్ట్రోగ్రతలు పెరిగిపోవడంతో ఈసారి బెంగళూరులో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదయ్యాయి. సాధారణంగా ఈ గార్డెన్ సిటీలో 31 డిగ్రీలు దాటని ఎండలు... ఈసారి తీవ్రంగా పెరిగిపోయి బెంగుళూరు మార్కునే కోల్పోయేలా చేశాయి.
ఈ యేడు సూర్యతాపంలో వచ్చిన తీవ్ర ప్రభావం బెంగళూరుపైనా చూపింది. ఉద్యాననగరిగా పేరొందిన బెంగళూరులో సాధారణ ఉష్ణోగ్రత 31.5 డిగ్రీల సెల్సియస్ కాగా, ఈసారి 40 డిగ్రీల వరకు వచ్చేసింది. ఆదివారం నాడు అక్కడ 39.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ సారి ఏర్పడిన వాతావరణ ప్రతికూల పరిస్థితులు 40 డిగ్రీలను దాటేట్టు చేసి రాకార్డును తిరగరాశాయి. బెంగళూరులోనే కాక కర్ణాటక రాష్టంలోనే ఈసారి అధిక ఉష్ణోగ్రత నమోదౌతున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. కర్ణాటకలోని వేసవి విడిది ప్రాంతంగా పేరొందిన కలబుర్గీలో కూడా ఈసారి సాధారణ ఉష్ణోగ్రత 35 డిగ్రీలు దాటిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మిగిలిన ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. సీజన్లో సరైన వర్షాలు కురవకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న కాలంలోనూ ఇదే పరిస్థితి కొనసాగితే ఎయిర్ కండిషన్డ్ నగరంగా పేరొందిన బెంగళూరు పరిస్థితే మారిపోయే అవకాశం కనిపిస్తున్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు.
సుమారు 80 ఏళ్ల క్రితం 1931 ఏప్రిల్ నెలలో బెంగళూరులో 38.3 డిగ్రీల ఉష్ణోత్రత నమోదై రికార్డును సృష్టించిందని, ఆతర్వాత 2016 సంవత్సరంలో నమోదైన ఉష్ణోగ్రతలు ఈ రికార్డును మించిపోయినట్లు వాతావరణ శాఖ అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కొన్ని ప్రైవేటు ఏజెన్సీలు కూడా ఈసారి బెంగళూరులో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలుపుతున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే బెంగుళూరు సంపాదించిన ప్లెజెంట్ వెదర్ కిరీటాన్ని కోల్పోయే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు పెరగడమే కాక రాత్రి సమయాల్లోనూ వేడి అసౌకర్యాన్ని కలిగించడం వాతావరణ అధికారులకు కూడా అంతుబట్టడం లేదు. రాగల రెండు రోజుల్లో బెంగళూరు వాతవరణం కాస్త చల్లబడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ భావిస్తోంది.