బెంగళూరు: ‘‘కరోనా గురించి భయం వద్దు. జాగ్రత్తలు పాటిస్తూ చికిత్స తీసుకుంటే దాని నుంచి విముక్తి పొందవచ్చు. అందుకు నేనే నిదర్శనం. కరోనా నుంచి కోలుకుంటున్న పేషెంట్‌ను నేను. శ్వాస తీసుకోగలుగుతున్నాను. భయాలను అధిగమించి ఆశావహ దృక్పథంతో ముందుకు సాగండి’’ అంటూ కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న బెంగళూరు వ్యక్తి ప్రజల్లో చైతన్యం నింపారు. రాజరాజేశ్వరి నగర్‌కు చెందిన పీకే వెంకట్ రాఘవన్ గత నెలలో ఆఫీసు పని నిమిత్తం అమెరికాకు వెళ్లారు. అనంతరం లండన్‌లోని హీత్రో ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కి భారత్‌కు చేరుకున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో స్వస్థలానికి చేరుకున్న వెంటనే తనకు పరీక్షలు నిర్వహించాల్సిందిగా ఎయిర్‌పోర్టు అధికారులను కోరారు. అయితే వైరస్ లక్షణాలేవీ కనిపించకపోవడంతో సిబ్బంది ఆయన అభ్యర్థనను తిరస్కరించారు. ఈ క్రమంలో తన బంధువుతో ఈ విషయం గురించి పంచుకున్నారు. దీంతో సదరు వ్యక్తి రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చెస్ట్ డిసీజెస్‌కు వెళ్లాల్సిందిగా సూచించాడు. పరీక్షలు నిర్వహించిన అనంతరం కరోనా పాజిటివ్‌గా తేలడంతో రెండు వారాలు చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో తనకు కరోనా సోకిన విధానం.. చికిత్స పొందే క్రమంలో ఎదుర్కొన్న అనుభవాల గురించి వెంకట్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
‘‘ఎయిర్‌పోర్టులో పబ్లిక్ బాత్‌రూం వాడటం వల్ల లేదా అక్కడి ఉపరితలాలపై చేతులు ఆనించడం వల్ల వైరస్ అంటుకుని ఉంటుంది. కరోనా ఉన్న పేషెంట్ల పక్కన కూర్చోవడం మూలాన కూడా ఇలా జరిగిఉండవచ్చు. ఆస్పత్రిలో చేరే ముందు నాకు 102 డిగ్రీల జ్వరం వచ్చింది. అయితే డాక్టర్లు ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. ఇతర ఇన్‌ఫెక్షన్లు సోకకుండా యాంటీ బయోటిక్స్ ఇచ్చారు. జ్వరం తగ్గించే మందులు(స్టార్‌ఫ్లూ) ఇచ్చారు. నా ఆధ్యాత్మిక గురువు ప్రవచనాలు కూడా నాకు ఎంతగానో ఉపకరించాయి. డాక్టర్ల సేవలు ప్రశంసనీయం. సరైన జాగ్రత్తలు పాటిస్తే ఈ మహమ్మారి నుంచి తొందరగా కోలుకోవచ్చు. అదృష్టం ఏమిటంటే.. నా వల్ల నా కుటుంబ సభ్యులు, ఇతరులకు కరోనా సోకలేదు’’ అని యూట్యూబ్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment