జ్యోతిర్లింగ క్షేత్రం.. కకావికలు!!
మహారాష్ట్రలోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం అయిన భీమాశంకర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. పుణెకు సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం మొత్తం కొండలతో నిండి ఉంటుంది. జ్యోతిర్లింగ క్షేత్రం కూడా భూమికంటే చాలా దిగువన ఉంటుంది. మెట్లమార్గం గుండా క్షేత్రానికి వెళ్లాలి. ఇది చాలా పవిత్ర క్షేత్రం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు నిరంతరం వస్తుంటారు. ఇలాంటి ప్రాంతంలో గత కొంత కాలంగా భారీవర్షాలు కురుస్తుండటంతో బుధవారం ఉదయం కొండచరియలు విరిగిపడ్డాయి. మట్టి పెళ్లలు విరిగి కింద పడటంతో వాటి కింద పడి సుమారు 15 మంది వరకు మరణించినట్లు ప్రాథమిక సమాచారం. ఇంకా శిథిలాల కింద సుమారు 50 నుంచి 100 మంది వరకు ఉంటారని అంటున్నారు.
విషయం తెలియగానే గ్రామస్థులు, పోలీసులు, విపత్తు నివారణ అధికారులు, సైన్యం అంతా రంగంలోకి దిగి సహాయ కార్యకలాపాలు ప్రారంభించారు. తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో అత్యంత భారీ వర్షం కురవడంతో అంబెగావ్ ప్రధాన గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. మట్టి కరిగిపోవడంతో పెద్దపెద్ద కొండరాళ్లు కింద పడ్డాయి. ఆ సమయానికి సుమారు 150 మంది వరకు గ్రామస్థులు ఇళ్లలో పడుకుని ఉంటారని భావిస్తున్నారు. వీరెవరికీ ప్రమాదం గురించి తెలియకముందే మట్టి, శిథిలాల కింద కూరుకుపోయారు. మధ్యాహ్నానికి ఇద్దరిని మాత్రమే సజీవంగా కాపాడగలిగారు. ఇంకా వర్షాలు కురుస్తూనే ఉండటంతో సహాయ కార్యకలాపాలకు ఆటంకం కలుగుతోంది.