
పట్నా: బిహార్ క్వారంటైన్ కేంద్రంలో ఓ వ్యక్తి పది మందికి సరిపోయే ఆహారం తింటూ అధికారులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. వివరాలు.. అనూప్ ఓజా(23) అనే వ్యక్తి ఉపాధి కోసం రాజస్తాన్ వెళ్లాడు. లాక్‌డౌన్ విధించడంతో సొంత ఊరికి వచ్చాడు. అధికారులు అతడిని బక్సర్‌లోని మంజ్‌వారీ క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. ఈ క్రమంలో ఓజా ప్రతిరోజు ఉదయం టిఫిన్‌లో 40 చపాతీలు, మధ్యాహ్నం 8-10 ప్లేట్ల ఆహారం తీసుకుంటున్నాడు. ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాలకు నిర్దిష్ట పరిమాణంలో ఆహార సామాగ్రి సరఫరా చేస్తుంది. కానీ ఓజా ఒక్కడే పది మందికి సరిపోయే ఆహారం తీసుకోవడంతో.. పిండి, ఇతర పదర్థాలు త్వరగా అయిపోయాయి. దాంతో క్వారంటైన్ కేంద్రం అధికారులు ఓజా అసాధారణ తిండి గురించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. (‘నరకం కంటే దారుణంగా ఉన్నాయి’)
ఈ క్రమంలో ఓ రోజు మధ్యాహ్న భోజనం సమయంలో అధికారులు క్వారంటైన్ కేంద్రానికి వచ్చి పరిశీలించగా ఓజా వారి ఎదుటే పది ప్లేట్ల ఆహారాన్ని లాగించాడు. ఇది చూసి అధికారులు విస్తుపోయారు. ఆ తర్వాత అతడికి చాలినంత భోజనం పెట్టాల్సిందిగా వంటవారిని ఆదేశించి వెళ్లారు. అనంతరం క్వారంటైన్ సిబ్బంది మాట్లాడుతూ.. ‘ఓజా ఒక్కడే 40 చపాతీలు తింటాడు. లిట్టీలు(గోధుమ పిండితో చేసే ఓ రకం వంటకం) అయితే 80 వరకు లాగిస్తాడు’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment