తండ్రి ఆరోగ్యం బాగోలేదు. పైగా లాక్డౌన్ కష్టాలు. అందుకే ఆ కూతురు సాహసానికి పాల్పడింది. వారంపాటు 1200 కిలోమీటర్లపైగా సైకిల్ మీద తండ్రిని ఇంటికి చేర్చింది. సైకిల్ జ్యోతి కుమారి సాహసానికి, ధైర్యానికి అప్పట్లో సర్వత్రా ప్రశంసలు కురిసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఇంట విషాదం నెలకొంది.
పాట్నా: సైకిల్ గర్ల్ జ్యోతి కుమారి తండ్రి మోహన్ పాశ్వాన్ సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయాన్ని జిల్లా మెజిస్ట్రేట్ త్యాగరాజన్ ప్రకటించారు. ఏ తండ్రి కోసమైతే జ్యోతి కుమారి అంత కష్టానికి ఓర్చిందో.. ఆ తండ్రే ఇక లేరని, ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని త్యాగరాజన్ అన్నారు. అంతేకాదు ఆ కుటుంబానికి అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు కూడా. కాగా, జ్యోతి కుటుంబ స్వస్థలం బిహార్‌లోని దర్బంగా.
యాక్సిడెంట్ తర్వాత..
జ్యోతి తండ్రి మోహన్ పాశ్వాన్ ఆటో డ్రైవర్. బతుకు దెరువు కోసం ఢిల్లీలోని గురుగ్రామ్‌కు వెళ్లాడు. ఇక పదో తరగతి ఫెయిల్ అయిన పెద్దకూతురు జ్యోతి కూడా ఆయతో పాటే వెళ్లింది. మోహన్ భార్య మిగిలిన పిల్లలతో ఊరిలో ఉండేది. పోయినేడాది ఓ రోడ్డు ప్రమాదంలో మోహన్ గాయపడ్డాడు. దీంతో ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. సరిగ్గా అదే టైంలో లాక్డౌన్ వచ్చి పడింది. ఇంటి కిరాయి కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఓనర్ ఖాళీ చేయమన్నాడు. దీంతో తండ్రి ఆరోగ్య దృష్ట్యా ఊరికి వెళ్లాలని జ్యోతి అనుకుంది. సైకిల్‌పై తండ్రిని కూర్చోబెట్టుకుని ఇంటి బాట పట్టింది.
వారం కష్టం
జబ్బు పడిన తండ్రి మోహన్‌ను సైకిల్ పై కూర్చోబెట్టుకుని ప్రయాణం మొదలుపెట్టింది జ్యోతి. రోజూ ముప్ఫై నుంచి నలభై కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కింది. మధ్య మధ్యలో కొందరు ట్రక్ డ్రైవర్లు లిఫ్ట్, భోజనం ఇచ్చి సాయపడ్డారు. మొత్తానికి వారం తర్వాత ఇంటికి చేరుకుంది. జ్యోతి ప్రయత్నానికి అప్పట్లో దేశమంతా సలాం కొట్టింది. అంత చిన్న వయసులో ఏమాత్రం అధైర్యపడకుండా... ఎక్కడా అలసిపోకుండా... అంత సుదీర్ఘ దూరం ఆమె సైకిల్‌పై ప్రయాణించడం అప్పట్లో అంతా మెచ్చుకున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం జ్యోతి తెగువకు హ్యాట్సాఫ్ చెబుతూ బాలపురస్కార్ ప్రకటించారు. ఇవాంక ట్రంప్ సహా పలువురు సెలబ్రిటీలు కూడా సైకిల్ జ్యోతి సాహసంపై స్పందించారు. అయితే ఆ టైంలో కొంత సాయం అందినప్పటికీ.. ఆర్థికంగా ఆ కుటుంబం నిలదొక్కుకోలేదని తెలుస్తోంది.
జ్యోతి కుటుంబానికి సాయం
జ్యోతి కథనాల తర్వాత అధికారులు ఆమెకు కొంత సాయం అందించారు. అప్పట్లో సైక్లింగ్ ఫెడరేషన్ కూడా జ్యోతిని సైకిల్ రైడర్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించింది. అయితే జ్యోతి తల్లి మాత్రం కూతురి చదువే మొదటి ప్రాధాన్యంగా పేర్కొంది. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన జ్యోతి కుటుంబం ఇప్పుడు విషాదంలో మునిగిపోయింది. దీంతో సాయం అందించేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment