సాక్షి, పాట్నా: బిహార్‌లోని గయా జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ ఇంటిని మావోయిస్టులు గురువారం తెల్లవారుజామున పేల్చేశారు. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. మాజీ ఎమ్మెల్సీ అయిన అర్జున్ సింగ్ నివాసం గయా జిల్లాలోని బోడిబిగా ప్రాంతంలో ఉంది. మావోయిస్టులు శక్తివంతమైన డైనమేట్ పేలుడు పదార్థాన్ని ఉపయోగించి ఆయన ఇంటిని నేలమట్టం చేశారని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనకు ముందు ఆ ఇంట్లో ఉంటున్న అర్జున్‌సింగ్ సమీప బంధువుపై మావోయిస్టుసలు భౌతికంగా దాడికి పాల్పడ్డారు. ఆ ఇంటిని ఖాళీ చేయవల్సిందిగా బెదిరించారు. ఆయన ఖాళీ చేసి వెళ్లిపోవడంతో ఆ ఇంట్లో ఎవరూలేని సమయంలో మావోయిస్టులు పేల్చేశారని దుమారియ పోలీసు అధికారి ధర్మేంద్ర కుమార్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ దాడి జరగడం పోలీసుల్లో కలవరం రేపుతోంది. గయా సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ రాజీవ్ మిశ్రా ఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. దాడికి కారణమైన మావోయిస్టులను గుర్తించడానికి ‘సేర్చ్ ఆపరేషన్ టీమ్’ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment