బిహార్ ప్రజలు మొత్తం శుభ్రం చేసేశారు: లాలు
యువకులు, రైతులు, పేదలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు తమకు మద్దతు ఇవ్వడం వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైందని, అందుకు అందరికీ కృతజ్ఞతలని ఆర్జేడీ అధినేత, మహాకూటమి కీలక నేత లాలుప్రసాద్ అన్నారు. మహాకూటమి విజయం ఖాయమైన తర్వాత ఆదివారం మధ్యాహ్నం ఆయన ఆర్జేడీ ప్రధాన కార్యాలయంలో ఆయన నితీష్ కుమార్తో కలిసి కిక్కిరిసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమావేశం ప్రారంభం కావడానికి ముందే ఆయన నితీష్ కుమార్ను గట్టిగా కౌగలించుకుని అభినందనలు తెలపడంతో పాటు విజయతిలకం కూడా దిద్దారు. ఆ సమయంలో అభిమానులు ఒకటే జయ జయ ధ్వానాలు చేస్తుండటంతో.. పెద్దమాష్టారిలా అందరినీ గట్టిగా గదమాయించి నిశ్శబ్దంగా ఉండాలని తెలిపారు. ఇక ఈ సందర్భంగా లాలు ఏమన్నారంటే..
- బిహార్ ముఖ్యమంత్రి మళ్లీ నితీష్ కుమారే
- మహాకూటమికి మద్దతు ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు
- అందరికీ పేరుపేరునా మా సోదరులిద్దరం కృతజ్ఞతలు తెలుపుతున్నాం
- బిహార్ ప్రజలు మొత్తం రాష్ట్రాన్ని శుభ్రం చేసేశారు
- నితీష్ కుమార్ పాలనలోనే బిహార్ అభివృద్ధి సాధ్యమని చాటిచెప్పారు
- యువకులు, రైతులు, కార్మికులు, ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకుంటాం
- ఎన్నికల సమయంలోనే మేం ఈ విషయం చెప్పాం
- దేశం ముక్కలు ముక్కలు కాకుండా కాపాడుతామని కూడా ముందే చెప్పాం
- నేను దేశవ్యాప్తంగా పర్యటన చేసి ప్రచారం చేస్తాను.
- మీరు సమర్థించడం వల్లే మేం ఇంత ముందుకు రాగలిగాం
- నితీష్ కుమార్ కు చాలా అభినందనలు, ధన్యవాదాలు చెప్పుకొంటున్నాను
- ప్రజలు మాకు బాగా పెద్ద విజయాన్ని అందించారు
- బిహార్ ప్రజలు, యువత, పేదలు.. ఇలా ప్రతి ఒక్కరూ ఈ విజయంలో భాగస్వాములే
- ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా స్వయంగా అభినందనలు తెలిపారు
- ఇది చాలా సంతోషకరమైన విషయం