ఏకంగా ఓ మహిళా ఏఎస్ఐ గొలుసునే తెంపుకెళ్లిపోయారు.
కోల్‌కతా: గొలుసు దొంగల ఆగడాలకు హద్దూ అదుపు లేకుండా పోతోంది. ఈ చైన్ స్నాచర్లు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. మమతా బెనర్జీ లాంటి ఫైర్ బ్రాండ్ ముఖ్యమంత్రులున్న కోల్‌కతాలో కూడా రెచ్చిపోతున్నారు. సామాన్య మహిళలతో పాటూ, మహిళా పోలీసులను టార్గెట్ చేశారు. ఏకంగా ఓ మహిళా ఏఎస్ఐ గొలుసునే తెంపుకెళ్లిపోయారు.
కోల్‌కతాలోని తిల్జాలా పోలీస్ స్టేషన్ కు చెందిన మహిళా ఏఎస్‌ఐ నిర్మలారాయ్ విధులు నిర్వర్తించుకుని ఇంటికి తిరిగెళ్తున్న సమయంలో బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లారు. పిక్నిక్ గార్డెన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కచ్చితంగా ఎవరో స్థానికులే చేసి ఉంటారని నిర్మల తెలిపారు. వారిని త్వరలో పట్టుకుంటామని వెల్లడించారు. లాల్ బజార్ నేర పరిశోధక విభాగం దీనిపై దృష్టి పెట్టింది. పాత నేరస్తుల వివరాలను సేకరిస్తున్నామని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదిస్తామని తెలిపారు. బైక్ వివరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.